11 December 2012

నువ్వూ, నేనూ

బల్లపై పారే సెలయేరూ, ఒక లేత పసుపు ఊరూ ఈ సూర్యరశ్మి. మరి

అందుకే
ఇక ఉదయాన్నే వొదులుతావు
ఒక పాత్రాపుష్పాన్ని ఆ నీటిలో:
ఇక సన్నటి ఆవిరి నా అరచేతిలో-

ఊరికే, దానిని నీ ఊపిరిగా తలుస్తాను, అగరొత్తు పొగలా ఊహిస్తాను

తొలిఎండ సోకి, మెత్తగా కరిగిపోయే
మంచుపొగలో ఎగిరిపోయే ఓ
పిచ్చుకగా నిన్ను తలుస్తాను.

ఈ మిద్దెపై అద్దె ఇంటిలో, ఇంకా నీడలుగా మారని మన సమయాలని

గోడకు కొట్టిన మేకుకు వేలాడే, పగుళ్ళిచ్చిన పాత అద్దంలో అలా కొత్తగా
కదిలే నిండైన నీ రూపంగానే       
నెలలు నిండిన నీ నెమ్మదైన
ఆ కదలికలుగానే చూస్తాను-ఇక

అరచేతిని పొట్టపై ఉంచుకుని, కొద్దిగా నొప్పితో కొద్దిగా సంతోషంతో ఆ
సెలయేటిలో తళతళా మెరుస్తో తేలిపోయే, పల్చటి పగటి పొరల ఒక
శ్వేతగులాబీని చూస్తూ నువ్వు-  
మరో లోకపు రంగులని చూసే
నీ కళ్ళని అందుకునేందుకు ఓ
మహా ప్రయత్నంలో నేనూ.ఇక

పత్తిపువ్వై విచ్చుకుని, ఉమ్మ నీటికాంతితో ఒక జనన మరణ సువాసనతో
మెరుస్తున్న ఆ గదిలో, ఆ క్షణాలలో
- మాట్లాడుకోడానికి- ఇక నీకైనా నీ
నాకైనా ఏముంటాయి?

No comments:

Post a Comment