07 December 2012

పిచ్చుకలు

ఉదయాన్నే, లేత కాంతిలో పచ్చని పొలమై నువ్వుంటావ్

ఇక నువ్వు రాల్చే వడ్ల గింజలకై
ఎగిరొస్తాయి పిచ్చుకలు అప్పుడు

ఇక నీపై, నీకు ఇరువైపులా మరి అలల్లాడే వాటి రెక్కలు

దూరంగా గట్టుపై, బద్ధకంగా
వొళ్ళు విరుచుకునేఆ పొద్దు
తిరుగుడు పూలను చూస్తో

మరి గజ్జెలతో, తలపై మూటతో, నుదుటన ఉదయించే
ఎర్రని సూర్య బింబంతో 
రాత్రి చుక్కల నవ్వుతో

ఎవరికీ చెప్పలేని చీకటి వేళల కథల మసక గుసగుసలతో
పొలం వెంటా, గట్టు వెంటా
నీళ్ళ వెంటా, నీడల వెంటా
సాగుతుంది ఓ అమ్మాయి

ముడిచిన తన కొప్పులో ఎవరినో ఒకరిని దోపుకునేందుకు-

సరిగ్గా అప్పుడే, ఎవరో పరచిన వలలోనో
చిక్కుకున్న నిన్ను చప్పున అందుకుని
రివ్వున లేపుకు పోతాయి

వడ్లగింజలకై, నీ పచ్చని పొలంలో వాలిన ఆనాటి పిచ్చుకలు! 

No comments:

Post a Comment