26 April 2016

ఆక్షేపణ

నుల్చుండిపోయాను వెలసిన బాల్కనీలో, అట్లా తడిచి:
నిరత్తురడనై మిగిలిపోయి -
***
వర్షం వచ్చి వెళ్లిపోయింది. నేలలో, గాలిలో, రాళ్ళలో
అది వొదిలిన ముద్రలు, నాలో నువ్వు
వొదిలి వెళ్ళిన నీ పెదాల స్పర్శలాగా -

సాయంత్రం అయ్యింది. మరి ఆకాశం మసక మసకగా
మారింది. ఇంకా తిరిగిరాని పక్షులకై
ఎదురుచూసే చెట్లు: కొంచెం నాలాగా -

ఈలోగా, మన పైనింట్లోని పిల్లలు వచ్చారు. ఇంట్లోకి
తొంగి చూసారు: చాక్లెట్లు ఏమైనా నువ్వు
ఎప్పటిలా ఇస్తావేమోననీ, నవ్వుదామనీ -

తెలియదు వాళ్లకి, నువ్వు లేవనీ, బాల్కనీలోని గూడు
తడిచి రాలిపోయిందనీ. నేను కూడా
చిన్నబోయి ఎదురు చూస్తున్నాననీ -
***
నుల్చుండిపోయాను నీ జ్ఞాపకం ముందు, అట్లా తడిచి:
రాత్రిలోకి వొణికొణికిపోయి -
***
ఇక, ఈ పూటకి ఒకటే అడుగుతాను నిన్ను:

ఎవరైనా ఉన్నారేమోనని, తొంగి చూసి, చిన్నబోయి
వెళ్ళిపోయిన హృదయానికి, ఏమని
జవాబు చెప్పడం? 

No comments:

Post a Comment