12 April 2016

అంతే

~ అంతే ~

"బావోలేదు. కొద్దిసేపు కూర్చో నాతో", అలసటతో ఒరిగి
అడిగింది తను -
***
సాయంత్రం:
ఎండిపోయి ఆవరణ. పెదాలు పగిలిన ఆకులెన్నో  తనలో
రాలి -

పాలిపోయి
కాంతి. వడలిపోయి శరీరం. నీటి ఊసు లేక కందిపోయిన
గాలి -

ఇక చెట్లన్నీ
తను వ్రాసుకుని ఎవరికీ చూపించని లేఖలు: మసకబారి
చిట్లి -

ఎంతకూ
అంతం కాక, శూన్యమై వ్యాపించిన గగనం, ఆ క్షణంలో
తన

హృదయం:
సన్నటి గాలి మూలుగుతో, చీకటితో, చుక్కలతో, వేసవితో
నాతో -
***
"బావోలేదు. కొద్దిసేపు కూర్చో నాతో", అలసటతో ఇంకి
గొణిగింది తను -
***
నెమ్మదిగా లేచి
తనకో గ్లాసు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి, తనకు ఆనుకుని
కూర్చున్నాం

నేనూ, ఈ పదాలు -
ఇక ఇంతకు మించి ఈ జీవితానికి, అవి గానీ, నేను గానీ
చేయగలిగే

గొప్ప పనులేమీ
లేవు. అంతే!

1 comment:



  1. అంతే బావో లేదూ !
    వింతగ జూచెను జిలేబి, వీటిని జూడన్,
    యింత నిరాశ వలదు ! ఆ
    చింతను వదిలిన పదాలు చికుబుకు లాడున్ !

    ReplyDelete