కాంతివంతమైన ఉదయం:
రాత్రి కురిసిన మంచుకీ, గాలికీ
చిన్నగా ఊగే ఒక
తెల్లని గులాబి -
***
చల్లని దారులు. లేత ఆకులు:
వానజల్లులో రెక్కలు విదుల్చుకుని
ఎగిరిపోయే
పక్షులు -
లోపలి మట్టి, చిన్నగా నాని
ఇక
హృదయం ఒక విత్తనమై చిట్లి
మొలకెత్తినట్టు ఒక
సువాసన -
అవును.
నువ్వన్నది నిజమే. అనుకోకుండా
వచ్చే అతిధి
స్ఫురణే ఇది -
ఇతరుని స్వప్నమే
ఇది.
***
తిరిగి రా నువ్వు. చూడు:
ఎంత అందంగా ఉందో ఇక్కడ. కిటికీ
అద్దం వెనుక
ఒద్దికగా
నీ స్మృతితో సజీవమయ్యి
చిన్నగా ఊగే ఒక ఎర్రని గులాబీ
పువ్వు, ఐదు
ఆకులు -
No comments:
Post a Comment