ఒకప్పుడు
కనిపించని తుంపర కింద నువ్వు నడచిన దారిపై
ఇప్పుడు మరొక స్త్రీ
కనిపించే తుంపర కింద నింపాదిగా వెడుతుంది
ఈ సాయంత్రం ఎవరు ఎవర్ని కోల్పోయారు?
చీకటిగా మారుతున్న రోజును
పదాలతో వెలిగించిన నువ్వా? లేక
ఒకప్పుడు ఇదే దారిపై నీ పక్కగా నడిచి
ఇప్పుడు ఏమాత్రం నడవలేని నేనా?
గడ్డిలో అప్పటి దాక గెంతిన కుక్క
అలసి ఒక మూలకు ముడుచుకుంది
అది తడిచిపోయింది
అది దిగులుగా ఉంది
ఎదురుగా చెట్ల ఆకుల పచ్చటి రంధ్రాలలోంచి
చీకటీ కమ్ముకుంటుంది
ఇక ఏ స్త్రీ నింపాదిగా నడవలేనంతగా
తుంపర వర్షంగా మారింది
ఇక నేను, శిరస్సుకి రుమాలు చుట్టుకుని
నువ్వు లేని ఈ సాయంత్రాన్ని
భద్రంగా బొడ్డులో తడవకుండా దోపుకుని
నేను ఇంటికి వెళ్లేదా?
No comments:
Post a Comment