అందరూ రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు,నిద్రిస్తున్న ముఖాల్ని
నువ్వు ఒక్కడివే తదేకంగా
మసక చీకట్లో గమనిస్తున్నప్పుడు,ఆకస్మికంగా నీకు
ఏవీ సవ్యంగా లేవనీ,
ఇక ఏవీ సవ్యంగా జరగవనీ అర్థం అవుతుంది. నిదురించని
ఆలోచనలనుంచి నిదురలేపిన దోమకై అతడు తన
రోగగ్రస్త ఉమ్మిని దాచుకున్న దినపత్రికతో
గదంతా వెదుకులాదతాడు:అంతిమంగా, అశక్తుడై దోమకి బదులుగా
ఒక కవిత్వపు పుస్తకంతో మంచంలో గోడకి చేరాగిలపడతాడు
పదాలకు బదులుగా అతడు జ్ఞాపకాల్ని చదువుతాడు, జ్ఞాపకాల్ని
తిరిగి అతడు పదాలుగా మారుస్తాడు. రాత్రంతా
ఇక పదాలకూ జ్ఞాపకాలకూ మధ్య ఇరుక్కుపోయి స్పృహ కోల్పోతాడు.
మర్నాడు ఉదయం అతడు లేచేసరికి, గదంతా పదాలతో నిండి
పొంగిపొర్లిపోతూ ఉండగా, ఒకే ఒక్క దోమ మాత్రం
తెరచీ తెరవని కిటికిలోంచి, బూడిద నిండిన ఒక కన్నులోంచి
పదాల నీడలలోంచీ ఎగిరి పోయేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
No comments:
Post a Comment