01 August 2010

నిదుర

నిదురించాలనే సరళమైన కోరిక అది

నిదురించాలనీ, ఒక విరామమైన శూన్యంలోకి
ఒక నలుపు గులాబి రెమ్మల్లలోకి,
అదృశ్యంగా, రహస్యంగా నిర్బయంగా కరిగిపోయి

నిదురించాలనే సరళమైన కోరిక అది

నిదురించాలనే సరళమైన కోరిక అది:
మృత్యువంత, ప్రేమంత
జీవన బీభత్సమంత సరళమైన కోరిక అది.

మొహసింతో, ఒక పురాతన జ్ఞాపకానికీ
ఈ ముఖరహిత స్వరరహిత
విస్మృతి జీవితానికీ మధ్య కదులాడే దినాలు
ఆకలిగొన్న మృగాలు:
మనం పంచుకునే కొన్ని క్షణాలు
ఇతరుల దృష్టిలో ఉన్మాద చిహ్నాలు:

మొహసింతో,ఒక పదంకై తపిస్తూ
శూన్యంలోకి చాచిన మన హస్తాలు, తరచూ
ఎప్పటిలాగే
తడిబారిన మన కళ్ళ అంచుల చివర వేలాడే
ఆమె నీలి కనుల అనంత
నిశ్శబ్దాలతో తిరిగి వస్తాయి

వాళ్ళు అంటారు, మొహసింతో, వాళ్ళు అంటారు
ఒక స్నేహితుడికై పరితపించే వేదన
ఒక ప్రియురాలికై పరితపించే వేదన కంటే గొప్పదని

పునర్యానమా? నాకు తెలీదు.
ప్రయాణించడమా? అది కూడ నాకు తెలీదు.
ఇక జీవితమంటావా? వొద్దు, ధన్యవాదాలు.
ఇక ఈ రాత్రికి ఈ నల్లటి ధరిత్రిలో
సమాధి అయ్యేందుకు
గుప్పెడు నల్లటి మట్టిని నాకు ప్రసాదించు చాలు.

No comments:

Post a Comment