01 August 2010

నువ్వు వెళ్ళిపోయాక

నువ్వు వెళ్ళిపోయాక

నా గదంతా నీ దేహపు వాసన. నీ తొడల మధ్యనుంచి తప్పించుకుని
పుస్తకాల అరలో గూడును ఏర్పరుచుకుంటున్న పిచుక వాసన.

గంట మునుపు దేహం నిండా సముద్రాల పిట్టలు అలల గూళ్ళను వదుల్చుకుని
పిచ్చి పిచ్చి శబ్దాలతో ఎగిరాయి: ఒక గంటంతా
నువ్వు నా తనువునంతా నీ లోపల్నుంచి ఎరుకొచ్చిన పుల్లలతో నింపావు:
ఒక గంటంతా నువ్వు నా తనువునంతా నీ లోపలున్న
రహస్య పుస్తకాల బాషతో నింపావు. నేను గాయపడ్డనా? నవ్వానా? నువ్వు
నవ్వావా, మౌనంగా ఉండిపోయావా?

తలుపు తెరిచి నువ్వు వెళ్ళిపోయినా తరువాత, ఎదురుగా వెచ్చటి కాంతిలో
రెపరెపలాడుతున్న ఆరేసిన నా దుస్తులు
సన్నటి తీగల నీడ పడి అక్కడక్కడా పచ్చిగా ఉండిపోతాయి: నా లోదుస్తులు.
ఎండా నేరుగా పడి వాటిపై మెరిసేలా పక్కకు లాగి
ఒక గంటంతా గడిపిన నా గదిలోకి నీ చంకల చెమట వాసనతోటి వస్తాను :
గంట క్రితం నువ్వు  వదివేసిన లోదుస్తుల పిచుక మాత్రం ఇంకా పుస్తకాలపై
సాలిడులా గూడు అల్లుకుంటూనే ఉంది.

No comments:

Post a Comment