01 August 2010

ఒక ఆకుపచ్చని కాగితం మీద ఆకుపచ్చని వెలుతురు కింద ఈ నల్లటి పదాలు

ఒక ఆకుపచ్చని కాగితం మీద
ఆకుపచ్చని వెలుతురు కింద
ఈ నల్లటి పదాలు రాస్తాను

ఇది ప్రేమ కవిత కాదు
ఇది స్మృతి గీతం కాదు

ఈ ఒక్కసారికి
ఎదురుచూసే మనిషికి
ఏకాంతంలో
ఏమవుతుందో రాస్తాను

ఇలా మొదలు పెట్టనా?)

మరొక నాలుగున్నర గంటలకి
అతడికి మరొక
ముప్పై ఏళ్ళు నిండుతాయి
అయితే,
అంతకుమునుపే
కాలు విరిగి
ఆసుపత్రిలో
విలవిలలాడుతున్న
ఒక తండ్రి ముఖం
బాధతో
దీపాన్ని తాకి
ముకుళితమౌతున్న
పూవులా
కుంచించుకుపోతున్నప్ప్పటికీ
అతడు చేతులు చాచి,
ముఖం పై చల్లటి నీళ్ళు
జల్లినట్టు నవ్వాడు
నేను ఇప్పటికీ
ఆ నీటితడిని భద్రంగా
గుప్పెట్లో దాచుకుని
తిరుగుతున్నాను

అతడికి ఎదురుగా,
నా పక్కగా
నిరంతరం ఎదురుచూస్తున్న
మనుషులు

ఇక్కడేమీ నొప్పీ లేదు
ఇక్కడేమీ బాధా లేదు

నిరతరం
నిరాదరణ అలవాటైన
మనిషిని కనుక
దేహం కొంకర్లు తిరుగుతున్న
ముసలివాడిని వొదిలి

ఆకుపచ్చని కాంతి కింద
ఆకుపచ్చని కాగితంపై,
వస్తానన్న
పసుపు పచ్చని స్త్రీకి
ఎదురుచూస్తూ
ఈ శాపవిమోచనంలేని
పదాలు రాస్తుండగా
పై వాక్యం చివరనుండి
రక్తం ఉబకటం
మొదలయింది

నాకు తెలీదు

పధం ఒక
చెయ్యి కాగలదని
ఐదు వేళ్ళలా విచ్చుకుని
వస్తాననీ,
రాని (రాలేకపోయిన)
రానివాళ్ళ స్పృహ
గాజుపెంకుల్లా గుచ్చుకుని
రక్తం చిందగా
కాగితంపై జ్ఞాపకాలు
విషపు నవ్వుల్లా
మారగలవని:
ఇటు చూడు
మరల్చుకున్న
నీ కళ్ళని
ఇటువైపు మరల్చు
రెండు పావురాల్లా
వాటిని
ఈ టేబుల్ అంచున
వాలనివ్వు:
ఇటు చూడు

ఏమీ జరగదు

నా కళ్ళతో
వాటిని తాకుతాను
నా రెక్కలతో
వాటిని కప్పుతాను.
మహా అయితే
నీ కళ్ళతో పాటు
కిటికీలోంచి
చీకటిలోకి ఎగిరిపోయి
నీతోపాటు కూస్తాను:
ఇటు చూడు
ఇంతకు
మునుపే చెప్పినట్టు

ఇది ప్రేమ గీతం కాదు
ఇది స్మృతి గీతం కాదు:
ఈ ఒక్కసారికి
ఎదురుచూసే మనిషికి
ఏకాంతంలో
తడిచిన కాగితంలా
ఎలా చిరిగిపోతాడో రాస్తాను

వాసన. పచ్చిముళ్ళ వాసన.
చుట్టూ వలయమై
తిరుగాడుతున్న, లోతుగా
దిగాబడుతున్న
పచ్చిముళ్ళ వాసన.
అంతకుమునుపే
అప్పుడే
నడిచి వెళ్ళిపోయిన
తన్ధనుకున్న
తనది కాదని
అర్థం అయిన
స్త్రీ పాద ముద్రల వాసన,
మళ్ళా

మళ్ళా ప్రాణం
పోసుకుంటున్న వాసన.
ఆ పాదాలచుట్టూ
వర్షం నేలవంకలలతో
రాలుతున్న వాసన :
ఏం జన్మిస్తుంది
ఈ సంబంధంలోంచి?
ఏం మరణిస్తుంది
ఈ సంబంధంలోంచి?
నువ్వు వస్తావా
సంధ్యవేళ తప్పిపోయిన
ఈ దూడ కోసం
నువ్వు వస్తావా
ఈ నగరం మధ్య
విలవిలా
వెదుకులాడుకుంటున్న
మనిషి కోసం?
పాలపొదుగై
దయగల కళ్ళై,
ఆకలి గొన్న కడుపుకి
ఇంత అన్నంముద్దై
వస్తావా,
నువ్వు వస్తావా?

ఇటు చూడు:
నిరంతరం
ఎదురుచూసే మనిషికి
ఆకుపచ్చని కాంతి కింద
ఆకుపచ్చని కాగితంపైకి
ఎంతకూ రాని ప్రేమ:
ఇటు చూడు:
కొద్దిసేపు
నీ చెవుల్ని అద్దెకు ఇవ్వు
రెండు తామరాకుల
దోనేల్లా వాటిని
ఈ టేబుల్ పై పెట్టు
ఏమీ జరగదు

నా నాలికపై ఉన్న
బీజాక్షరాల్ని
వాటిలోకి వంపుతాను
నా కళ్లపై ఉన్న
వాగులు ఎండిపోతున్న
పల్చటి సబ్ద్ధాల్ని
వాటిలో పెరుస్తాను:
మహా అయితే
నీ చెవులని
నా హృదయంలో
దోపుకుని
కిటికీలోంచి
చీకటిలోకి ఎగిరిపోయి
నీతో పాటు
రహస్య సబ్దాలని వింటాను:
ఇటు చూడు

ఈ కాగితం నిండిపోయింది
వస్తానన్న
పసుపుపచ్చ స్త్రీ
మరెక్కడో బందీ అయ్యింది
ఇటు చూడు,
ఇక రాయలేను,
నీ ఊపిరి సోకక
చెమ్మగిల్లని గాలిలో
మరింతసేపు నిలవలేను
అందుకని
ఆకుపచ్చని కాంతికింద
ఆకుపచ్చని కాగితం
ఎదురుగా
ఎదురుచూస్తున్న మనిషి,
ఎప్పటిలానే మరోమారు
వొంటరిగా
తన గదిలో సమాధి
అయ్యేందుకు
వెడుతుండగా
నేను కూడా లేచి
ఈ పదాలపై
తెల్లటి గుడ్డను కప్పి,
ఈ ప్రేమ గీతాన్ని
ఈ స్మృతి గీతాన్ని
గొణుక్కుంటూ
ఇంటికి వెడతాను.

No comments:

Post a Comment