నా నయనాలలో నీ మరణాన్ని చూడలేదు లేదా ఎవరూ లేక
ఒక్కతివే గదిలో లుంగలు చుట్టుకుపోయి
నువ్వు కక్కిన రక్తాన్ని కానీ, అంతిమంగా ఊపిరి అందక
నువ్వు పాలిపోతూ రాలిపోతూ
ఈ ప్రదేశాన్ని వొదిలి వెళ్లిపోవడాన్ని కానీ
నేను చూడలేదు
నా నయనాలలో నీ స్వప్నం ఇంకిపోయి
కొయ్య గులాబీలుగా మారడాన్ని కానీ లేదా అవి రాతి వక్షోజాలగానూ
బదులు లేని ఆక్రందనలగానూ, అంతిమంగా
ఆత్మహత్య చేసుకున్న ఎవరూ లేని పాలిపోయిన రాలిపోయిన ఊపిరిగా
మారడాన్ని నేను చూడలేదు
ఇక నేను చూస్తాను, ఇప్పటికీ ఎప్పటికీ
గతించిన సంవత్సరాల పొగ మంచులోంచి నీ నయనాల మరణాన్నీ
నలుపు కన్నీళ్ళనీ ఇక నేను చూస్తాను
మృత్యు నయనాలతో, పాదం వెనుక పాదంతో
పదం వెనుక పదంతో
ఊపిరి వెనుక ఊపిరితో నువ్వు ఈ రక్తపు ప్రపంచాన్ని వొదలక మునుపు
నా శిరస్సుని తాకేందుకు చాచిన
పాలిపోయిన రాలిపోతున్న
నీ చేతిని ఇప్పటికీ ఇక ఎప్పటికీ
నేను చూస్తాను, చూస్తాను చూస్తాను.
No comments:
Post a Comment