నా చనుమొనల నుంచి నీ పెదాల మధ్యగా పాలు కారినప్పుడు
మరణించిన నా సంవత్సరపు పాప తిరిగి నవ్వుతుంది
మెత్తటి సెప్టెంబర్ దినాన
మరుగైన సూర్యుడి చెమటతో కలగలిసి విశ్వమంతా
పాల వాసనతో నిండిపోతుంది.
ఊగే అవిస చెట్లతో ఆటలాడే పిట్టలు, ఊగని పిట్టలతో
ఆటలాడే పిల్లలు పిల్లలతో నృత్యం చేసే దుమ్మూ,
దుమ్ముతో పరిశుబ్రమయ్యే ప్రపంచం
లేత కాంతి వర్షంతో, నా బిడ్డ నవ్వుతో మళ్ళా
ఈ దినాన నా వక్షోజాలు నిండిపోతాయి.
నీ చేతులలోని గాలితో తాకబడిన ఈ శరీరం,
ఈ శరీరాన్ని ఒక సారి తాకిన మరణం
నల్లటి మట్టి గులాబీ రేకుల మధ్య సమాధి చేయబడ్డ పాప నయనం
ఈ దినాన మళ్ళా జీవం పోసుకుని
కనులపై చేమ్మగిల్లుతున్న పాల చుక్కలా
మెత్తటి సెప్టెంబర్ దినాన
నా చనుమోనల్లో నిండి పోతాయి. రంగుల చీకటి
కనులలోకి నిండిపోగా
అది బాధా తెలియదు, అది సంతోషమా తెలియదు. నా
చనుమోనల్ని చప్పరిస్తున్నది
పాపనా లేక నువ్వో కూడా తెలియదు.
No comments:
Post a Comment