21 June 2012

otobiography*

నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.

కొన్నిసార్లు ఒక బిడ్డను ఒళ్లో కూర్చోబెట్టుకుని వాడు వేసే కేకలన్నిటినీ కాగితంపై రాస్తూ ఉంటాను. ఎవరైనా బిగ్గరగా రోదిస్తూ గుండెలు చరచుకుని వెక్కిళ్ళతో నేలకొరిగిపోతుంటే సంవత్సరాలుగా రాసుకున్న పిల్లల పదాల కేకలని వాళ్ళ ముందు ఉంచుతాను. కొన్నిసార్లు తరగతి గదుల్లో పిల్లలకు పాటాలు చెప్పుకుంటాను. వాళ్లు ఆ పుస్తకాలు చదువుకుని బావుకునే దేమీ లేదని తెలిసీ, అ విషయమే వాళ్లకు మరోసారి చెప్పి, మళ్ళా వచ్చే ఏడాది అవే పాటాలు అప్పజేపుతాను. విసుగొచ్చిన విద్యార్థులకు వినమని గద్దర్ పాటలనూ చదవమని పతంజలి పుస్తకాలనీ ఇస్తుంటాను. భూమి బల్లపరపుగా ఉందని ఒక విద్యార్ధి సంవత్సరం తరువాత కనపడి చెబితే అతడి ముందు నేను చేతులు కట్టుకున్న బాలుడని అవుతాను.

నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.

కొన్నిసార్లు ఇదిగో ఇటువంటి పదాలను వొంటరిగా కూర్చుని చెక్కుకుంటాను. చెక్కుతున్న ఉలి గురి సరిగ్గా ఉండి దేహంపై గాట్లు పడితే, ఊరుతున్న రక్తాన్ని తుడుచుకుని, మళ్ళా మళ్ళా శిలకు ప్రాణం వచ్చేదాకా నా గొంతుని నరుక్కుంటాను. పగలు సూర్యుడు మేఘాల మధ్యకు అద్రుశ్యమైతే, మరో అంచు నుంచి నేను చంద్రుడిని వెలుపలికి లాగుతాను. రాత్రిపూట చీకటి కటినంగా చుట్టుకున్నప్పుడు ఉదయం దాచిపెట్టుకున్న సూర్యరశ్మిని కట్టెలకు చుట్టి కాగాదాల్లా వెలిగిస్తాను. దారి పొడుగూతా కమిలిన రక్తం పేగుల్లా చెల్లాచెదురై పడి ఉన్న పురుషోత్తం, ఆజంలూ కనిపించి నప్పుడు అరచేతుల మధ్య ఇంత నిప్పుని రాజేసుకుని కనుగుడ్లలో కుక్కుకుంటాను.

కొన్నిసార్లు, మధ్యాహ్నం ఇంట్లోకి మూడు రోజులకొకసారి వచ్చే నీళ్ళని పదిలంగా పట్టుకుంటాను. ఆ తరువాత ఎండ కుబుసం రాలుతున్న వేప చెట్టు కింద నీడల్ని ఆకులకి అంటిస్తూ నా తార తరాల మనుషుల శ్రమను జ్ఞాపకం చేసుకుంటాను. నా సమయం సరస్సు ఒడ్డున వాలి, రెక్కల్ని టప టపా విదిల్చి, నా శరీరంలోని కొన్ని ముక్కల్ని పొడిచి నోట కరచుకుని ఎగిరిపోయిన స్త్రీల లేని పాద ముద్రల్ని, నిశ్శబ్దంలో నిశ్శబ్దంతో మళ్ళా పునర్ నిర్మించుకుంటాను. కూసింత తీరిక దొరికినప్పుడు రోడ్డు పక్కగా కూర్చుని దువ్వెనలమ్మే వాళ్ళతో కలసి, ఇంత టీ సిగరెట్ తాగుతాను. అప్పుడప్పుడూ గతాన్నంతా మరచి మళ్ళా స్నేహితుల వద్దకి వెళ్లి గాయపడి వస్తాను.

నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.

కొన్నిసార్లు నేను రోజుల తరబడి తాగుతూ కూర్చుంటాను. శబ్దం పరిపక్వమైన నిశ్శబ్ధంలా మారేదాకా, నేనే సృష్టించిన మబ్బుల బుడగాలని ముని వేళ్ళతో పగులకొట్టి, వర్షం పరిపూర్ణంగా నా శరీరం అంచులని నిమ్పెదాకా అలా అలలా కదులుతూ కూర్చుంటాను.

నేనొక దేవతని. అప్పుడప్పుడూ నేనొక రాక్షసుడిని. రాతి బండపై పదునుగా సానబెట్టిన కత్తిని అందుకుని, నా రెక్కలోంచి కొంతా నా ఛాతిలోంచీ కొంతా నరుక్కుని ఆహారం వండుకుంటాను. మీరందరూ ఇంతకు మునుపే రుచి చూసిన నా శరీరపు మాంసాన్నే మరోసారి నేను తిని రుచి చూస్తాను. దాహార్తులైన స్త్రీలకు కొద్దిగా రక్తం ఒంపుతాను. సాయంత్రాలు నలుదిక్కులా లేని నక్షత్రాలతో పిగిలిపోతున్నప్పుడు మీరెవరూ చూడని మహా అరణ్యాలలోకి కాంతి వేగంతో పరిగెత్తుకు వెళ్ళిపోతాను. కనిపించని రంగులు. వినిపించని శబ్దాలు. ముఖ్యంగా, పిల్లలు కాళ్ళను టప టపా మని నీళ్ళలోకి మోదుతూ చేతుల్ని చాచి మ్మా మ్మా అంతో రివ్వున రివ్వున ఎగిరిపోయే సమయాలు. యిక నేను

మౌనంగా కూర్చుంటాను. కనిపించని వాటిని వింటాను. వినిపించే వాటన్నిటినీ చూస్తాను. అప్పుడప్పుడూ రోడ్డు పక్కన చెట్టు కింద ఫుట్ పాత్ పై ఇన్ని సామానులు వేసుకుని పంక్చరైన టైర్లు బాగు చేసుకుంటాను. రాత్రి పూట ఇన్ని రొట్టేలని కాల్చుకుని తింటాను. అది కూడా లేనప్పుడు కడుపులోకి ఇన్ని మంచినీళ్ళు కుక్కుకుని పడుకుంటాను. అర్థరాత్రిలో నవ్వుతాను. పగటి పూట మీరందరూ ఇకిలింతలతో మురిసిపోయేలా రోదిస్తాను. యిక

ఈ ధరిత్రి విచ్చుకోవచ్చు. నింగి కుంగి నల్లని జలపాతంలా రాలిపోవచ్చు. వాళ్ళంటారూ, రేపటిని ముందుగా చూసిన వాడెవ్వడూ ఈ పూట ప్రశాంతంగా ఉండలేదు. ఒక ప్రవక్త తన చేతుల్లోని తెల్లటి పావురాన్ని నిమిరి తెల్లని నవ్వుతో మనుషులకు ఇచ్చాడు. ఆ తరువాత మనుషుల చేతులలో తలలు తెగిన వాటి రక్తాన్ని అతడు చూడలేదు. ఇప్పుడు యిక్కడ ఉన్నదేదో ఎప్పటికీ ఉంది. ఉంటూనే ఉంటుంది. గోడపై పాకుతున్న బల్లి పిల్ల. ఆకలికి తాళలేక స్పృహ తప్పిన బిక్షగాడు. రతి సంతృప్తితో లేచి ఉచ్చ పోస్తున్న అరమోడ్పుల కనుల స్త్రీ. రాత్రి పన్నెండింటికి, కూలీకి వెళ్ళిన భర్తకై ఎదురు చూసే భార్య. దూరం నుంచి. తేలే దీపాల్లా దూసుకు వస్తున్న భజన.

నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.

నేనేమీ చేయను. సమయపు నల్లని మట్టిలోంచి మొలకెత్తిన నా ఉనికిని చిరునవ్వుతో బయటకు లాగి, పదాల మధ్య చెమ్మగిల్లుతూ మృదువుగా ఆవిరవుతున్న ఖాళీ స్థలాలను నాతో బాటు చిటికెన వేళ్ళు పట్టుకుని వెళ్ళిపోయే దాకా నేను మీ మధ్య కూర్చుంటాను. రాత్రి మిగిలిన చద్ది అన్నాన్ని మిరపకాయల పచ్చడితో కలుపుకుని తింటాను. కొద్దిగా మిగిలిన, ఎండ వేడిమికి కాగుతున్న నీళ్ళను తాగి, బట్టలన్నీ విప్పి ఆరుబయట కళ్లపై తడిపిన రుమాలుని వేసుకుని నిదురపోతాను. అయ్యల్లారా అమ్మల్లారా, అప్పటిదాకా

నేనేం చేస్తూ ఉంటానని అడగకండి.

1 comment:

  1. Srikanth second poetry book "Ithara" lo first poem...one of my fav.poem....

    ReplyDelete