07 June 2012

మరొక తప్పు

-ఒక బీరు తాగడం
పెద్ద తప్పేమీ కాదు
నీలా నువ్వు బ్రతికి ఉండటమే ముఖ్యం- అయితే

ఏడు బీర్లు తాగాక
ఇంకో రెండు బీర్లు
ఇంటికి తెచ్చుకుని

ఆ రాత్రంతా తిరిగి రాని
రాత్రుళ్ళని తలచుకుని
ఒక్కడివే ఒక చేయి భూమిపై మరొక చేయి జాబిలిపై ఆన్చి

విశ్వపు చితిలో మెత్తగా
ఆ పూలమత్తుతో ఒరిగి
నీ ఆత్మతో అంటించుకుంటావు కదా నీ ఆత్మనీ నీ దిగులు శరీరాన్నీ

నీతో నువ్వు మాట్లాడుకునీ - విసిగీ
అలసీ అలసీ విసిగీ - మరి జహాపనా
చెప్పలేదా నీకెవ్వరూ

---ఒక మనిషి
బ్రతికుండగానే
అతని నెత్తురిని తాగి తాగి పీల్చి పీల్చి పిప్పి చేసి

యంత్రంగా రూకలుగా
మహా దారిధ్ర్యపు కీర్తిగా
ముడి సరుకుగా మార్చి

బహిరంగ విపణిలో అందమైన వస్తువుగా అమ్మడం

రక్త పిపాసిగా మార్చడం
------మధుపానం కంటే
మహా పాపమనీ నేరమనీ
అన్నిటినీ మించిన
మహా తప్పిదం అదేననీ?---

1 comment: