11 June 2012

ఒక క్షణం

అరచేతులు ముకుళించి
నుదిటిన ఆన్చుకుని
నీ తలను వంచుకుని
అలా నిస్సహాయంగా
గాలికి తేలే తుంపరై కూర్చుంటావు
ఆ కొన్ని దినాలలో
ఒక్క మాట కోసం
ఒక తేలికైన భయం లేని స్పర్శ కోసం-

గదిలో తనువు ఉందో
తనువులో గది ఉందో
తెలియదు నీకు ఆ మాగన్నుగా తూలిన క్షణాలలో:

తెరిచిన కిటికీలోంచి
ఎప్పటిదో ఒక ఎండ
నేలంతా కదులుతూ
పొడుచుకు తింటుంది రాలిన నీడలనీ
పొడి పొడిగా మొలకెత్తుతున్న గాలినీ

తెరిచిన తలుపులోంచి
ఎవరిదో ఒక చేయి సాగి
వెనుక నుంచి భుజంపై
రహస్యంగా ఒత్తుతుంది ఒక ఓదార్పు ఒత్తిడిని

అంతా అద్రుశ్య సంగీతమే
అంతా అంతులేని/పట్టని
ఒక జీవన మృత్యు మోహిత సంరంభమే

నా చెంపని తాకే చేతులు
అవి నీ కళ్ళలోని కన్నీళ్లు

ఆగిపోయిన నీ పెదాలూ
కమిలి, మంచంలో అలా
ముడుచుకుపోయిన నీ అలలాంకృత తనువూ
నేను వినలేకపోయిన
నీ మూగ కథనాలు -

వికసించిన గులాబీని
తాకుదామని కదిలిన
ఆ వేలి చివరన నిలిచింది
ఒక నల్లని నెత్తురు బొట్టు

నృత్యం చేద్దామని దూకిన
అరి పాదాలలో పొసగింది
ఆ మంచు దిగంతాల ఒక
మహా అస్తిత్వపు వొణుకు

దీనిని జీవితమనాలో లేక
ఒక శాపరత్నాకరమనాలో
ఏమనాలో, నా పేరుగా మారుతూ

అరచేతులు ముకుళించి
నిశ్శబ్ధంగా ఆరిపోతున్న
--అతనికి నువ్వే చెప్పు--

5 comments:

  1. చాలా బగుందండీ....!!!:) :)

    ReplyDelete
  2. "మాగాగ్న" -- ?

    ReplyDelete
  3. మాగన్ను అని ఉండాలి. (మ్రాగన్ను అని కూడా వాడవచ్చు అనుకుంటాను). typo error.

    ReplyDelete