23 June 2012

మరి ఉందా నీ వద్ద

మరి
ఉందా నీ వద్ద
ఏదో ఓ పలక
అలక లేకుండా?

ఇక నీ వేళ్ళతో
నువ్వు అలా
వెన్నెలనే రాస్తావో
నల్లని చీకటిని
ఉమ్మితో తుడిచే
వేస్తావో

చొక్కా కాలర్
నములుకుంటూ
గుండ్రంగా
వంకర గా
నాలుగు గీతేలే
గీస్తావో తిరిగి
కొట్టే వేస్తావో

నాలిక నిండా
ఐస్క్రీమె వేస్తావో
చెట్లెక్కి తిరిగి
పురుగులనీ
పిట్టలనే తెస్తావో
గజిబిజిగా కోపంగా
అక్షరాలే రాస్తావో
దాస్తావో నవ్వుతావో

మరి అదంతా
నీ ఇష్టం కానీ

మరి ఇంతకూ
ఉందా నీ వద్ద
ఏదో ఒక తెల్లని

హృదయం పలకా
ఒక బలపపు
పలుకరింతా?

1 comment: