చినుకులు ముసిరిన చీకట్లలో
ఒక్కత్తే కూర్చుంటుంది ఒంటరిగా ఒక అమ్మ కొంత చీకటితో కొంత చిత్తడితో
ఇంకా ఇప్పుడే ఉన్నట్టు, ఇంకా ఇప్పుడే జరిగినట్టు
నువ్వు గుప్పిళ్ళతో చీకటిని వెన్నెలతో దూసి
తన ముఖాన్ని లేత రావి ఆకుల అరచేతులతో తడిమిన జ్ఞాపకం
నువ్వు పాకుతూ, పడుతూ లేస్తూ
నీటి నవ్వులతో పరిగెడుతూ
అటు తననీ ఇటు నిన్నూ
నింగికీ భూమికీ ముడివేసి
తన బొజ్జలో ముడుచుకుని ఒదిగి ఒదిగి పడుకున్న ఒక కలవరం
హోరున వీచే అవిసె చెట్లు
తిరిగి వచ్చే పక్షుల కలకలంతో జలదరించే ఉద్యానవనాలు
తల వంచుకున్న వీధి దీపాలపై
రాలే తొలి చినుకులూ, మూసుకుంటున్న ఏకాకి తలుపులూ
ఇవన్నీ తనై, ఇవన్నీ తన తనువై
చీకట్లు ముసిరిన చినుకులలో
ఒంటరిగా కూర్చుంటుంది ఒక్కత్తే ఒక అమ్మ కొంత దిగులుతో కొంత దహనంతో
కన్నీళ్ళతో బరువైన కళ్ళే తనవి
ఎదురుచూపులతో చిట్లి
కనుల కింద సాగిన నల్లని చారికల దారులే తనవి
నిన్ను అడగలేక, నిన్ను విడవలేక
ఎవరికీ చెప్పుకోలేక
నిన్ను హత్తుకుని నెత్తురోడిన చల్లటి చేతులే తనవి, పగిలిన అరి పాదాలే తనవి
గుమ్మానికి అనుకుని
తిరిగి ఇంటిలోకి తిరిగి చీకటిలోకి కదులుతూ, వీచే గాలిని మునివేళ్ళతో తాకిన
విలవిలలాడే పసి హృదయమే తనది
రాత్రిలోకి ఒక శిలయై, నీకై ఎదురు చూస్తూ కాలాన్ని చెక్కక మునుపు
తనకే తెలియదు, ఆ అమ్మకే తెలియదు
బాల్యంలో నిన్ను తను కొట్టినప్పుడు
ఇపుడు నువ్వు తనని చరచినప్పుడు
అపుడూ, ఇపుడూ
తనే ఎందుకు గుండె ఉగ్గపట్టుకుని ఏడ్చిందో-
చాలా బాగా రాసారు శ్రీకాంత్ గారూ.......
ReplyDelete"గుమ్మానికి అనుకుని
తిరిగి ఇంటిలోకి తిరిగి చీకటిలోకి కదులుతూ, వీచే గాలిని మునివేళ్ళతో తాకిన
విలవిలలాడే పసి హృదయమే తనది"
అమ్మ పిల్లల రాక కోసం అలానే ఎదురు చూస్తుంది ...కానీ ఈ 'ఇ' యుగం లో అమ్మని పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేకుండా పోయింది.
ఆలోచింపచేసేలా ఉంది.....చాలా బాగుంది. :)
--సీత
correct ga chepparu seetha garu
Delete