20 June 2012

కొరికే కోరిక

తుమ్ముతూ తుళ్ళిన వీధుల్లోంచి
వెళ్తున్నాను వొంటరిగా
ఒక వాన వానరాన్ని నా
వీపు పై ఎక్కించుకుని

అలా ఆడుకుంటో
అలా పాడుకుంటో
ఇలా ఈ పదాలతో
లోకాన్ని పోపొమ్మని ఎత్తు పళ్ళతో వెక్కిరించుకుంటో

మళ్ళా వస్తున్నాను
నువ్వు తూలిన నీలి
నిప్పుల నింగి సీసాల
విసిగిన హృదయ చెరశాలలలోకే

చేరదీయదా నను నిను
ఈ వింత లోకం కరిగిన
మధుశాలల్లో ఎగురుతో
పోయదా ఈ తోక తొక్కిన సర్పకాలం ఇంత హలాహలం
చాచిన మన గొంతుకలలో
బుసలు కొడుతో
కుబుసం విడుస్తో

అని అనుకుంటో
కొరికే కోరికను
కోరుకుంటో కొరుక్కుంటో

ఇంత గంజాయిని
అలా పీల్చుకుంటో
నీ దరికే వస్తున్నా
బిడ్డా

దారీ తెన్నూ లేక
దుమ్మెతిన దరిద్ర
మహా ద్రిమ్మరినై -

ఉన్నావా నువ్వు
ఇంతకూ యిక్కడ?

1 comment:

  1. వున్నాను..ఇక్కడే....వొంటరిగా....

    ReplyDelete