ఆక్కడ
ఆ తుమ్మ చెట్ల మధ్యగా
-మెలికలు తిరుగుతుంది
ఆ ఇరుకిరుకు మట్టి దారి
స్థాణువై నువ్వు
చూస్తుండగానే
గలగలలాడతాయి నీడలు
గాలికి తేలిపోయే
ఆ మట్టి దారిలో:
నీళ్ళు కొమ్మలయినట్టు
-కొమ్మలు ఆకులైనట్టు
ఆకులు పచ్చగా పూలై ముళ్ళుగా వికసించినట్టు
హాయిగా కదిలే
మబ్బుల ఆకాశం కింద
అలా ఉంటాయి
నిర్మలంగా
కాంతిగా
దయగా
ఆప్తంగా
నిన్ను చూసే తుమ్మ ముళ్ళు-
అద్దంలో
నువ్వు చూసుకునే
కనుల అంచున చిట్లే
నువ్వైన చల్లటి
తుమ్మముళ్ళు-
అయితే, ఇంతకూ
నువ్వెపుడైనా
ఆ తుమ్మముళ్ళ
రేపటి కన్నీటిని
రుచి చూసావా?
No comments:
Post a Comment