03 August 2012

మహా వానరం

రోజూ సాయంత్రం లేత ఎండకు ఊగుతూ
సూర్య ఫలాన్ని రాత్రిలోకి లాగుతూ
కూర్చుంటాయి ఆ మూడు కోతులు-

ఒకదానిపై మరొకటి కలబడుతూ
ఒకదానిపై మరొకటి దుముకుతూ
ఒకదానికి మరొకటి కోపంతో పళ్ళు చూపిస్తూ, తిరిగి అంతలోనే
ఒకదాని వెంట మరొకటి 'కిక్కీ కిక్కిక్కీ' మంటో పరిగెత్తే కోతులు

ఇంటినిండా కాగితాలు చింపిపోస్తూ
ఇంటినిండా నీళ్ళు ఒలకబోస్తూ
ఇంటినిండా బట్టలు విసిరివేస్తూ
చేతికందినవి పగలగొడుతూ కిటికీలలోంచి బయటకి విసిరి కొడుతూ
ప్రతీ సాయంత్రం కల్లు తాగకనే చిందులేసే
రెండు పిల్ల కోతులూ
ఒక తండ్రి వానరమూ-

ఒకటి ఎవరి మాటా వినదు
ఒకటి ఎవరనీ చూడదు. ఒకటి
ఎప్పటికీ మాట్లాడటం ఆపదు- చూడిక, ఊసురోమంటూ ఇల్లు ఊడ్చుకుంటూ
అంటుంది మా ఆవిడ-

'అడవిలో సీతనైనా కాకపోతిని
కొంత విరామమైనా దొరుకును-
ఎలా చచ్చేదీ పిల్లలతో పాటూ నిన్నూ నీ ద్రిమ్మరి కోతి వేషాలనీ_"

యిక నేను అనుకుంటానూ
తనకి అంతిమంగా తెలియక
తెలిసే ఉంటుందని - తాను
పెళ్ళాడినది ఒక మానవుడిని కాదు ఒక మహా వానరాన్నని!

1 comment: