04 August 2012

సాధా/రణం

తడచిన మంచు రాత్రుళ్ళలోంచి నువ్వొచ్చి
బిక్కుబిక్కుమంటూ నా పక్కలో నువ్వు
ముడుచుకుని పడుకున్న జ్ఞాపకం-

వొణుక్కుంటూ ఏడ్చుకుంటూ
ఎక్కిళ్ళు పెట్టుకుంటూ నువ్వు
ఎందుకొచ్చావో ఆ నల్లని రాత్రి
నా శరీరంలోకి చొచ్చుకుపోయి ఎప్పటికీ ఛాతిపై మిగిలిపోయే ఒక కత్తి గాటై-

ఎందుకని నేనూ అడగలేదు
ఎందుకో నువ్వూ చెప్పలేదు
కానీ ఆ రాత్రంతా బయట వానకి తడిచి చలికి వొణికి ఒక పిల్లి
అరుస్తూనే ఉండింది, ఆకలితో
మనం పెంచుకున్న కుక్కపిల్ల
బోరుమని ఊళ పెడుతూనే ఉండింది - ఆనక ఏ తెల్లవారుజాముకో

కిటికీ అంచుల నుంచి వాన మందగించి, చినుకుల
లతయై భూమికి అల్లుకుంది.
చెప్పడం మరచిపోయాను నేనా రోజు నీకు నిజంగానే

నువ్వు వెళ్లిపోయిన మరుదినం నుంచి
యిక మిగిలిపోయిన ఒంటరి రాత్రుళ్ళలో
విరిగిపోయిన ఆకాశంలో

పొటమరించిన ఒక పాలరాతి అశ్రువుని తప్ప
తిరిగి నేనెన్నడూ జాబిలిని చూడలేదు. యిక
నాకెన్నడూ పవిత్ర మాసం మొదలు కాలేదు

No comments:

Post a Comment