30 August 2012

రేపటి రాత్రికి

నువ్వొక రాత్రైనప్పుడు
నీకై రాస్తాను నేను ఈ
కింది బలపాలని:

కొద్దిగా కిటికీ తెరిచే ఉంచు
వానలోకి చేతినీ గాలిలోకి
ముఖాన్నీ చాచి ఉంచు -

శరీరంలోకి కొంత వేడినీ
మనస్సులోకింత తడినీ
అలా ఉండనివ్వు. పర్లేదు

ఏడవడం దగా పడటం
ఎవరికోసమో బ్రతికిలా
చివరిగా మిగిలిపోవడం

చీకటి అద్దంలో నీ కళ్ళని
నువ్వే తవ్వుకుని
ఏకాకిగా ఉండిపోవడం
నేరమేమీ కాదిక్కడ.

చూడూ

పాడుబడిన బావిలో
నీళ్ళు లేని కాలంలో
పూచిందొక

మా మంచి పిచ్చిపూవు.

వెళ్లి ఇన్ని కన్నీళ్ళని
వొంపిరా చిన్నా. ఇక

రేపటి రాత్రికి
బ్రతికే ఉంటుంది
ఒక తెల్లని మల్లె చందమామ.

1 comment: