03 August 2012

అతిశయం

ఎవరి పిడికిలిలోనో చిక్కుకుని
ఎటూ తప్పించుకోలేక
విలవిలలాడుతుంది ఈ
నీ హృదయపు తేనెపిట్ట. నిజమే ఫిరోజ్,

రాత్రుళ్ళకు నల్లని రంగు వేసి
పగళ్ళకు వెలుతురుని
కట్టేదీ
చుక్కలని చక్కగా అల్లి ఈ భూమిని అలంకరించేదీ
ఆకులకు వాన చుక్కలని అంటించి సంతోష పడేదీ

సూర్య చంద్రుల దీపాలకు
తన దేహ తైలం అర్పించి
వెలిగించి రాత్రింబవళ్ళూ మురిసిపోయేది తనేననీ

తనలో తాను ముడుచుకు
పోయిన
ఈ లోకపు తాబేలుకు
నువ్వు ఎలా
చూపించగలవు? ఎం చెప్పగలవు?

ఫిరోజ్, చూడు

తను జ్ఞాపకం వచ్చి
నీ ముఖం ఈ అర్థరాత్రిలో ఎలా
ఓ ఇంద్రధనుస్సులా వికసించి
సీతాకోకచిలుకై

కమ్ముకున్న మబ్బుల పూదోటలో
ఎంత అతిశయంతో
చక్కర్లు కొడుతుందో!

1 comment: