కొంత - అనంతమైన- విసుగు పుట్టి
ఏ ఒడ్డు నుంచో ఎరుకొచ్చిన శంఖాలని
నీ రాత్రి రాతి కళ్ళతో మోగించుకుంటూ
కూర్చుంటావు మూడో అంతస్థులో- యిక
ఆ కొంత చెమ్మగిల్లిన సాయంత్రంలోంచి
ఎక్కడిదో ఒక పసుపు పచ్చని పిట్ట వచ్చి
రెక్కలల్లార్చుతూ నీ కిటికీ అవతల, ఆగకుండా గిరికీలు కొట్టేదీ
కుండీలో ఒక పూవు శిరస్సు వంచి
నిశ్శబ్ధంగా నీ మౌన సమక్షంలోంచి
నిష్క్రమించేదీ, ఒక పిలుపు నీ నుంచి నెమ్మదిగా దూరమయ్యేదీ
ఇటువంటి
నీపై నీకే కొంత విసుగు పుట్టిన ఆ
మసక బారిన సాయంత్రాలలోనే -
చెప్పు నువ్వు
నీపై నీకే అంతులేని విసుగు కలిగి, మూడో
అంతస్థు నుంచి ఏడో అంతస్థు చేరి
ఆ అంచున కూర్చుని ఊగిసలాడే
లిప్త నిర్ణయపు మైకపు క్షణాలలో
ఏం చేస్తావు నువ్వు? ఆ వీడని నీతో
ఆ సంధ్యాకాలపు అలసట నీడలతో?
No comments:
Post a Comment