11 August 2012

అడవులు

కలక అంటిన కళ్ళలోకి ఓ తల్లి పాలచుక్కలు వేసినట్టు
లేత ఉదయపు సూర్యరశ్మి, చినుకులై
కళ్ళలోకి జారే మృదువైన అడవి దారి-

చాచిన అరచేతిలోకి నిండుగా
నీడలూ అరిచే పక్షులూ గాలీ
చీకట్లో ఎక్కడో చిలుకలు వాలి
రెక్కలు విశ్రమించిన ఒక నిర్మలమైన లోకమూ, కాలమూ-

పురా స్మృతులతో మనిషి
ఆదిమ ఆనందంతో మనిషి

భూమిపై పుట్టుమచ్చైన నగువైన పాపమైన శాపమైన శోకమైన పవిత్రమైన మనిషి
ఇక్కడి నించీ యింకా రాలేక, ఖండిత పట్టణ బాహువులలో ఒదగాలేక అదే మనిషి
యిక యిక్కడే ఈ పూటకి తనని తాను పచ్చిక మైదానాలో పారవేసుకుని, ఉన్నాడు
తొలిసారిగా. అది సరే కానీ ఫిరోజ్

ఇంతటి చల్లటి ప్రియమైన నిశ్శబ్ధాన్ని
మన హృదయాలలోకీ దేహాలలోకీ
యింత ఆకస్మికంగా తీసుకు వచ్చింది ఎవరు?

No comments:

Post a Comment