ఒక గడ్డిపరకని అరచేతులోకి తీసుకుని
గుప్పిట మూసి అరనిమిషంలో తెరచి
వొదిలివేస్తావు కదా అందులోంచి ఒక
రంగు రంగుల చిన్ని పిట్టని, విస్మయంగా తెరుచుకున్న నా కనుల ముందుగా
మరి అంత ఇంద్రజాలమేదీ లేదు నా వద్ద కానీ
నా దగ్గర ఉన్నదేదో చూపిస్తాను నీకు చిన్నగా-
ఒకసారి కనులు మూసుకో నెమ్మదిగా
నీకు నచ్చినవాళ్ళని తలుచుకో ప్రేమగా
నీ వదనం ముందు నిలిచిన నా చల్లని
అరచేతులలోకి గాలిని ఊదు ఒక్కసారి, నిండుగా నింపాదిగా నీటి తెరలపై వీచే గాలిగా-ఆపై
కనులు తెరిచి చూడు యిక
నిలకడగా నీ ఎదురుగా!
అమ్మాయీ
ఏం కనిపించింది నీకు నా అరచేతుల్లో
_మొలచుకు వచ్చిన నీ శరీరమంత_
అద్దాల వనాలలో
వీచే పవనాలలో?
No comments:
Post a Comment