ఒక రోజు ఆమె నా గదిలోకి వచ్చింది: అంది కదా
"ఏమిటిదంతా అస్థవ్యస్థంగా?
నీ గదిని శుభ్రం చేయాలి." (సంవత్సరాల క్రితం
నాలోకి జొరబడి నన్నుశుభ్రం చేసినట్టు)-
నేను సరేనన్నాను. అంది కదా తను:
"కాళ్ళు దులిపి మంచంపై పెట్టుకో. నా పని అయ్యేదాకా
నువ్వు కిందకి దిగకూడదు."
నేను ఆమె ఆజ్ఞని శిరసావహించాను. ఎందుకంటే
మీకు తెలుసు, ఆమె నాకు ప్రియురాలి కన్నా
మరింత ఎక్కువగా తల్లి వంటిదని. ఇంకా నిజంగా
ఆమె ముందు నేను బాలుడనని- యిక తరువాత
దుమ్ముపట్టిన కుక్కపిల్లలా ఆ మంచపై
ముడుచుకు కూర్చుని నేను, ఆమెని గమనించాను
మట్టి పరిమళపు వొత్తిడితో కదిలిన గాలిలా
ఆమె గదంతా తిరుగాడింది.
విశ్వంలోని విశ్వాలని క్రమంలో పేర్చుతున్నట్టు
వస్తువులను సర్ధుతూ, ఒక పాత గుడ్డతో
సర్వాన్నీ తుడుస్తూ అడ్డం వచ్చిన వాటిని
పిల్లి పిల్లలను రెండు వేళ్ళతో పుచ్చుకుని
జాగ్రత్తగా పక్కకి పెట్టినట్టు ఉంచుతూ తనే
గదంతా వర్షపు నీటిలా పారాడింది.
నేను పిల్లిపిల్లనై (తను తీసి పక్కకు పెట్టిన)
తనను గమనించాను. లేత ఎండలో
వేగంగా కదులాడే పిచ్చుకల పాదాలలా
రాత్రుళ్ళలో అలలలో చెలరేగే వెన్నెలలా
కదిలే తననూ, తన పూజిత పాదాలనూ
తన అల్లికల పాదాల కదలికలనూ
అబ్బురపడే పిల్లి కళ్ళతో గమనించాను-
రాత్రి ఆకాశపు అద్దాన్ని మంచుతో తుడిచినట్టు
ఒక పాత బనీనుతో తను నా గదిని
తన శ్రమతో అడవులని తడిపిన తుంపరలా
కడిగివేసింది: అంత సమయమూ నేను
రెండు కాళ్ళ చుట్టూ రెండు చేతులు చుట్టుకుని
నా జీవితం కళ్ళల్లో మెరిసే దయతో
తననూ, తన పాదాలనూ తన ముఖాన్నీ గమనించాను
బహుశా ఒక కుక్కనై ఉంటే, ఆమె ఆజ్ఞలను దాటి
ఆమె పాదాలను సంతోషంతో నాకి ఉందును: తన
చుట్టూతా ఎగురుతో గిరీకీలు కొట్టి ఉందును-
ఆ తరువాత ఆమె అంది: " అప్పుడే కిందకి దిగకు
గది తుడిచాను, తడి ఆరాలి కదా-"
అవును. తడి ఆరాలి. అది నిజం. అదే నిజం
అందుకే ఇప్పటికీ యిక నేను
గదిలోని నేల వైపు చూస్తాను
తను లేని నేల వైపు - నేనపుడు గమనించని -
తను వొదిలి వెళ్ళిన నెత్తురు
పద పాద ముద్రికల వైపూ
వాటిపై తడారుతున్న నా వైపూ
ఇప్పటికీ నేను పాదం మోపలేని
తను లేని నేల వైపూ-
ఇలాంటి అనుభవము నాకూ ఉంది కానీ అక్షరీకరించాలనే ద్యాసే రాలేదు.
ReplyDeleteతడితదిగా అద్భుత లోకంలో విహరింపచేసారు
"బహుశా ఒక కుక్కనై ఉంటే, ఆమె ఆజ్ఞలను దాటి
ఆమె పాదాలను సంతోషంతో నాకి ఉందును: తన
చుట్టూతా ఎగురుతో గిరీకీలు కొట్టి ఉందును-"
నాకు బాగానచ్చాయి
అభినందనలు
ఒకానొక సామాన్యానుభవాన్ని (నిజం కావొచ్చు కాకపోవచ్చు) అసామాన్యమైన కవిత్వానుభూతిగా మార్చటం ఒక ఆల్కెమీ కదా.
ReplyDeleteఎన్ని డైమన్షన్స్ ఉన్నాయీ ఈ కవితలో. అద్బుతం. ఒక్కొక్క సారి ఒక్కొక్క విధంగా అర్ధమౌతుంది.
ఆమెను ఎలా అన్వయించుకొంటే ఆ విధంగా కవితమొత్తం ఒదిగిపోతుంది చిత్రం గా.
చాలా గొప్పకవిత. చాన్నాళ్ళకు చదివిన ఒక మాస్టర్ పీస్.
వాటిపై తడారుతున్న నా వైపూ
ReplyDeleteఇప్పటికీ నేను పాదం మోపలేని
తను లేని నేల వైపూ- _____Wow..!!
మీ కవితలు చాలా లోతుగా బాగుంటున్నాయి. అనువాదపు వాసనలు తగుల్తున్నాయి అక్కడక్కడా!(శైలి అలా ఉందని...) అడిగానని అనుకోకండి...ఇవి అనువాదాలు కావుగా!
I must accept with Dear Balloju Baabaa....Great feel. ...Sreyobhilaashi ...Nutakki Raghavendra Rao.(Kanakambaram. )
ReplyDeleteమంచి కవిత
ReplyDelete