11 March 2012

ఒక సాధారణ వాచకం

నువ్వు చేసిన నాలుగు అసాధారణ పనులకై
నాలుగే నాలుగు సాధారణ వాక్యాలు రాస్తాను నీకై పూట-

౧.

వేసవి పగటిలో అన్నం వండి పిల్లలని స్కూలుకి పంపి
ఒక చల్లటి కుండై అక్కడ కూర్చున్నావు కిటికీ పక్కగా

చుబుకం కింద అరచేయితో , పసి కళ్ళతో
నీ చూపులను నీ తల్లి వద్దకు, తన స్మృతి వద్దకూ పంపి-

౨.

కమిలిపోయిన మధ్యాన్నం ఒక్కదానివే కవ్వంతో మజ్జిగ చేస్తూ
ఒక్కసారి మననం చేసుకున్నావు మంత్రంలా
'ఇళ్ళకు మగవాళ్ళు సమయానికేందుకు రారో' నని - ఆనక తినీ తినక

కడుపులోకి ముడుచుకుని పడుకున్నావు

కిటికీ పక్కన రిఫ్ఫ్ రిఫ్ఫ్ మని వింజామరలు వీచే
పావురాళ్ళ రెక్కలను వింటూ, ఒక అలసటని తనువులోకి లాక్కుంటూ
అంతం కాని ఒక అలసటని కలగంటూ-

యిక నువ్వు నిద్రించావో, మరణించావో ఎవరికీ తెలియదు-

౩.

సాయంత్రం ఇల్లంతా ఊడ్చి, గదంతా ఎగిరే పిల్లలను
నింపాదిగా కూర్చోబెట్టావు, హోంవర్క్ చేయించావు:

ఆనక చీకటయ్యి ఆకాశం బోసిపోయింది కనుక
బాల్కనీలో నక్షత్రాల పరదాని పరిచావు
చల్లటి గాలి వీచగా, నన్ను క్షణకాలం మరచి బ్రతికావు

తరువాత పిల్లలని దగ్గరగా లాక్కుని, ముద్దు పెట్టుకుని
ఒక్కసారిగా కన్నీళ్ళతో గాట్టిగా కౌగాలించుకున్నావు:

ఎందుకనో నీకే తెలియలేదు

౪.

రాత్రి నిలువునా చీలింది. గదిలోని దీపం
సగంగా చిట్లిపోయింది. పగిలి పగిలి
నీ ముంగిట్లోకి తూలుతూ వచ్చింది నేనే

విరిగి విరిగి నిదుర లేక తిరిగి లేచి, నన్నే
ఈ స్మశానాన్నే శుభ్రం చేసి
నా తల వద్ద ఒక ప్రమిదె వెలిగించినదీ నీవే-

నేను ఎన్నడైనా ఉన్నానా నీకు
నువ్వు ఎన్నడైనా ఉన్నావా నాకు అని
నువ్వూ అడగలేదు, నేనూ చెప్పలేదు-

***

యిక మిగిలిన అయిదో వాక్యం, వాక్యాంతం నీదే: మొదలపెట్టు-

1 comment:

  1. మౌనంగా అక్షరాంజలి అర్పించడంకన్నా మరో మాట రాలేదు...

    ReplyDelete