31 March 2012

వింటున్నావా నువ్వు

అడగకు వీధులను
బాహువులై ఆలింగనం చేసుకొమ్మని

అడగకు మిత్రులను
చీలిన హృదయంలో నిదురించమని

అడగకు స్త్రీలను
శరీరాన్ని శిశువు వలె పొదివి పుచ్చుకొమ్మని

అడగకు నిన్ను
నీకు నీవు ఆలంబనగా ఉండమని, రక్షించమని

అడగకు ఎవరినీ
నల్లటి మట్టి వలె తమలోకి తీసుకోమ్మనీ
ఒక శాంతి సమాధి కమ్మనీ

నీకు నీవే ఒక బిక్షపాత్ర, అక్షయపాత్ర
నీకు నీవే ఒక మధుపాత్ర

శరనార్ధివై తిరిగే నీవు
అడగకు ఒక మాతృ దేశాన్ని ఇమ్మనీ
ఇతరులని ఒక తల్లి చూచుకం కమ్మనీ
శ్వాసల పాలిమ్మనీ-

మృత్యు గులాబీల తోటలో
సంచరించే తుమ్మెద నీవనీ

విశ్వపు గాలిలో కొట్టుకుపోయే
గడ్డిపరకవనీ, కాంతి వానవనీ
అదే నీవనీ తెలుసు నీకు-

ఇక అడగకు ఎవరినీ, ఎప్పుడూ
నీతోపాటు రోదించమని
నీతోపాటు నవ్వమనీ, లోకాన్ని వెక్కిరించమనీ
అర్థాలని అనర్ధం కమ్మనీ:

ఒక విషపాత్రతో
ఒంటరిగా కూర్చుని, నింపాదిగా
చనిపోమ్మనీ, అనకు

ఎవరితో, రమ్మనకు
ఎవరినీ పొమ్మనకు

ఇదిగో నాకు నేనే
సమర్పించుకుంటున్నాను
ఒక తపించే పూలగుత్తిని

నా మరణానికై 
నా జీవన శిధిల సమాధికై-

వింటున్నావా నువ్వు?
ఈ పదాల నిశ్శబ్దాన్ని? 

తిరిగి నువ్వొకడివే

వెంటాడుతావు ఎందుకో
తన వెనుకే, తన తనువు వెనుకే వెను వెనుకనే

తననే, తన ఆ తనువునే
వేణువులా ఊదుదామనీ
తన సరస్సులో చేపపిల్లవై ఈదులాడుదామనీ

వెడుతుంటావు వెనుకే, వెను వెనుకనే
ఊరికనో, కోరికతోనో
ఆటతోనో అల్లరితోనో

నిన్ను నువ్వు కనుక్కుందామనే
అనుసరిస్తావు

మొహంతోనో, మైకంతోనో
ఒక అమృత దాహంతోనో
ప్రేమ విషంతోనో-

ఏడు లోకాలు తిరిగి
ఏడు కాలాలు దాటి

తిరిగి నువ్వొకడివే        
తను లేక, తనువు ఎప్పటికీ లేక
తిరిగి నువ్వొకడివే

నువ్వు చూడని కనులనుంచి
రాలే పన్నీరు కరుణలో
తడిచి తడిచి, ఏడ్చి ఏడ్చి

తిరిగి నువ్వొకడివే
ఒంటరిగా
ఒంటరిగా
ఒంటరిగా

ఆఖరుగా-  

please...

ఆదిమ తల్లీ, ఒక ప్రియురాలూ
నిర్బీతి హృదయపు రంగులు కలిసిన కారుణ్యపు గీతం తను

పాపం అడిగాడు ఆ పసివాడు
ఎదిగాననుకున్న పెద్దవాడు, ఏం కావాలో తెలియక అన్నాడా పురుషుడు
'నిన్ను ప్రేమిస్తున్నాను' అని

తనతో, ఉద్యోగం నుంచి తిరిగి వస్తున్న తన తనంతో
నల్లని పొగ ఇనుప యంత్రాలై దుమికే క్రూర మృగాల రహదారులలో-

ఆకాశమంత ఆవలింతతో
ఈ ధరిత్రి మోస్తున్నంత అలసటతో, రావి ఆకులు రెపరెపలాడే నవ్వుతో
తను అంది తన తనువు అంతటితోనూ-

'please, fuck off
leave me alone-'

ఆ ఇంట్లో

"నువ్వేం చేస్తావో తెలియదు
ఇంట్లోకి డబ్బులు కావాలి-"

(అతడు మాట్లాడడు)

"సరుకులు నిండుకున్నాయి
కట్టాల్సిన అప్పులు ఉన్నాయి
నువ్వేం చేస్తావో తెలియదు
ఇంట్లోకి డబ్బులు కావాలి-"

(నిండుకున్నాయి అనే పదంలో
వ్యతిరేకార్ధం ఎందుకు ఉందో
తెలియక అతడు మాట్లాడాడు)

"నీతోటి వారికి అన్నీ ఉన్నాయి
ఏమీ చేతకాక నువ్వే
ఇలా ఉన్నావు, నా రాత బాలేక
కట్టబెట్టారు నన్ను నీకు -"

(కిటికీ అద్దాన్ని కోస్తున్న కాంతినీ
కాంతిలో దాగున్న నీడనీ
చూస్తాడు అతడు మాట్లాడక)

"ఏ సుఖమూ లేదు నిన్ను
కట్టుకున్నందుకు, దరిద్రం
సంపాదన లేదు
సంసారం లేదు-

వొదలనన్నా వొదిలివేయవు
ఎందుకో ఉన్నావు బ్రతికి:
థూ- నీదీ ఒక బ్రతుకేనా?"

( అద్దంపై కురిసే చినుకుల సవ్వడి
ఇద్దరి నీడల అలజడీ
వింటాడు ఇక అతడు
తన అతడు కాలేక -)

ఇక ఆ తరువాత  ఆ ఇంట్లో
ఆ శ్మశానంలో, ఆ చీకట్లలో  
కాటి కాపరుల హృదయాల్లో

ఏం జరిగిందో,  అంతం
ఎలా మొదలయ్యిందో
ఏం జరగబోతుందో

ఎవరైనా మీకు చెప్పాలా?

30 March 2012

beer, whiskey or vodka?

మధువనిలో ముగ్గురు
హితులు, సన్నిహితులు, స్నేహితులూ-

ముగ్గురూ
మూడు అమృత పాత్రలూ, విష భాండాగారాలు

ఏం తాగాలి ఇక ఈ పూటకి?
ఎవరు ఎవరిని తాగాలి ఇక ఈ సంచార రాత్రి వేళకి?
ఎవరు ఎవరిని కలవాలి ఇక
ఈ అనాత్మ చీకటి కాంతికి?

ఇది అంతా ఆదిమ సంగీతం
ఇది అంతా ఆదిమ విలాపం - పాపం
అంతటా ఒకటే సందేహం, సమదేహం
ఒక ఒక్క దేహం

నెలవంకతో
ఎండిపోయిన నాలికలతో, వేసవి గాలితో
బయట రాలే, నేలపై వాలే
వేపాకుల మృత కాలంలో

ఈ రహదారి పక్కగా వెలసిన
మరో లోకంలో, మరో స్వర్గంలో మరో నరకంలో
ఇక ఏం తాగాలీ పూటకి

beer, whisky or vodka?

నీకెందుకు?

దారి తప్పి ఉండి ఉండవచ్చు
ప్రమిదెను వెదుకుతూ చీకట్లో కనుమరుగై ఉండొచ్చు 

భూమిని కౌగలించుకుని ఉండి ఉండవచ్చు 
నింగిని తాకి తిరిగి రాలేక నా కృష్ణబిలంలో చిక్కుకుపోయి ఉండొచ్చు 

తాగి ఉండి ఉండవచ్చు, అరిగి ఉండి ఉండవచ్చు 
లోకంతో విసిగి, కాలాన్ని ఆపలేక నగర దారులలో విలవిల లాడుతుండవచ్చు 

స్నేహితులతో ఉండి ఉండొచ్చు 
స్నేహితులు లేరని తెలిసీ, స్నేహితుల బాకులను మదిలో దింపుకుంటుండవచ్చు  

ప్రేమిస్తూ ఉండి ఉండొచ్చు, ద్వేషిస్తూ ఉండి ఉండొచ్చు 
వెలుతురు అంచున ఉండే, కనుల అంచులను తెంపే స్త్రీలను గుర్తు చేసుకుంటుండవచ్చు 

పిల్లలతో ఉండి ఉండవచ్చు 
పెద్దలతో తగువు లాడుతుండొచ్చు, ఎవరివో కన్నీళ్లను పొదివి పుచ్చుకుని ఉండి ఉండొచ్చు   

తిరుగుతూ ఉండి ఉండొచ్చు, ఇతరులలో దాగి ఉండి ఉండొచ్చు 
తెగిన నీడలను గమనిస్తూ, సంధ్య కాంతిలో కరిగిపోతుండవచ్చు

నవ్వుతుండొచ్చు, ఏడుస్తుండొచ్చు
ఒక్కడినే వేల మందై, శిధిలాలలో 
దారి తెలిసి శిల్పంగా మారి ఉండి ఉండొచ్చు, లోహ బాహువులలో విగతజీవుడని అయ్యి ఉండవచ్చు

తల్లై ఉండి ఉండొచ్చు, తండ్రై ఉండి ఉండొచ్చు 
తనువు లేక తనువుకై, అరూపాల తనకై కబోధి వలె వీధులలో సంచరిస్తూ ఉండి ఉండవచ్చు

పూలల్లో రాయి ఉండి ఉండవచ్చు 
రాళ్ళలో పన్నీరై ఉండి ఉండవచ్చు 

వానై రాలుతుండవచ్చు
ఏరై పారుతుండవచ్చు, ఎడారై ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు 

గాలై వీస్తుండవచ్చు, నేలై మొలకెత్తుతుండవచ్చు      
రావి ఆకుల గలగలల్లో కాంతి బిందువులై మెరుస్తూ ఉండి ఉండొచ్చు 
పావురమై మేఘమాలికల లేఖలని 
దాహార్తులకి అందిస్తుండవచ్చు, తిరిగి తిరిగి తిరిగే దారి తప్పి చనిపోతుండవచ్చు

ఏమైనా అవుతుండవచ్చు
ఏమీ కాక పోతుండవచ్చు- అయినా 

ఇదంతా నీకెందుకు?                      

అమ్మ

ఇదే రాత్రి
అలసిన అమ్మ అటువైపుకి తిరిగి నిదురోయింది

తెరిచిన కిటికీలోంచి
తన చుట్టూతానే గిరీకీలు కొడుతుంది పురా సరస్సుల పచ్చటి నీటి గాలి-

నెలవంక చెప్పిన కథలేవో కలలుగా తనలోకి పంపుతూ
చీకటి మెత్తటి చిగురాకై

కొంత కాంతితో కొంత శాంతితో
తన ముడుతల పసుపుపచ్చని ముఖంపై శ్వాసల ఊయల ఊగుతోంది

గదిలోనూ
నా మదిలోనూ కాలపు స్పృహతో కూడిన ఒక గగుర్పాటు, కొంత దిగులు-

అలసిన అమ్మ
అలసిపోయి, శ్రమతో అరిగిపోయిన ముసలి అమ్మ, తనకు తాను మిగలని
చిన్నారి అమ్మ-

ఆ నిదురలో, ఆ కలలో
తను తన పూర్వ జన్మలో చూసిన చిత్రాలేవో, హస్తాలేవో కదపగా
నింగికి కట్టిన నీలి మేఘపు జలతారు పరదావలె చిన్నగా కదిలే

తనువంతా చిట్లిన అమ్మ
తనువే లేకుండా మిగిలిపోయిన చిట్టి అమ్మ- అటువంటి అమ్మని

రాత్రి తనువుని పెనవేసుకుని
అటువైపుకు తిరిగి నిదురోయే అమ్మని ఎందుకైనా, ఎవరైనా ఎలా కదపటం?

29 March 2012

ప్రార్ధన

అరచేతుల్లోని నీళ్ళు
పెదాలని చేరలేవు

తుంచిన రొట్టెముక్క అలానే
విరిగిన నెలవంక లానే బిడ్డకై ఉంచిన అనాధైన పాత్రలానే-

కడుపులో ఒక శోకపు గనిని
కళ్ళలో ఒక కన్నీటి చితినీ
చాచిన చేతులలోకి ఒక సమాధినీ ఇచ్చింది ఎవరు?

ఇన్ని ప్రమిదెలని
స్వహస్తాలతో ఆర్పుకునేలా చేసింది ఎవరు?

తగల బడుతున్న
ఉరివేసుకుంటున్నపిల్లల్ని, ఏమీ లేని పిల్లల్ని
అనేకమైన ఒక కల గన్న పిల్లల్ని

ఏడుస్తో శపిస్తో
గుండెలు బాదుకుంటున్న ఆ తల్లితండ్రుల చేతుల్లో
తిరిగి పెట్టగలిగేది ఎవరు?

ప్రభూ, ఈ ఆ శరీరంలోంచి
తొలగించిన హృదయాన్ని
తిరిగి తెచ్చివ్వు - ఒక ప్రాంతాన్ని తిరిగి బ్రతకనివ్వు-

ఎవరు నువ్వు?

వెన్నెల ఒక పూవై
విచ్చుకుందా లేక
పూవే వెన్నెలయ్యి

నీ మోముగా మారిందా?

మరిగించిన పాల రంగుతో
పచ్చి ఆకుల పరిమళంతో
తెలుపు నలుపు సీతాకోకచిలుకలై ఎగిరే నయనాలతో

నునుపుగా బుస కొట్టే
శ్వేతనాగుల వంటి పొడుగాటి చేతులతో
వంకీలు తిరిగిన ఆ లేతెరుపు పెదాలతో

వేసవిలో మట్టిని రగిల్చిన
వాన చినుకుల ధూపం ని

గుప్పిళ్ళతో గాలిలోకి వెదజల్లినట్టు
అమృతం వంటి విషాన్ని ఎవరో
ప్రేమగా, మొహంగా తాగించినట్టు

రాత్రి పాలరాతి శిల్పం లేచి
నవ్వుతో పగటిలోకి నడచి వచ్చినట్టు
పగలు నిను చూచి సిగ్గుపడి
రాత్రి అరచేతుల మధ్య దాగున్నట్టు

చంద్రబింబం ఒక పూవై
విచ్చుకుందా లేక
పూవే ఒక చంద్రబింబమై

నీ వదనమై ఇలా
ఎదురుపడిందా?

ఇంత ఆకస్మిక అయోమయానికి
ఇంత ఆకస్మిక
కాస్మిక అబ్బురానికీ గురిచేసిన

నువ్వు ఎవరు?

తల్లి పాలు

ఊరులు తిరిగిన దారులు
దారులను తనువులతో అద్దిన మనుషులు

ఎవరూ లేరిపుడు: చూడు
వొదిలివేసిన ఒక వేణువు, తిరిగి వెదురువనం కాలేక

మట్టి నీటి పెదాలపై ఊపిరి కాలేక
ఆదిమ నాదం కాలేక
ఎలా వడలిపోయిందో-

లిపి లేని ఎటువంటి
మహా నగరపు
మృత మృగలిపి ఇది!

నాకు వొద్దు
దాహం తీరని ఈ శీతల చదరపు గూళ్ళు-

వెళ్లి పోతాను
వెళ్ళేపోతాను

తొలి చినుకు చింది
పుడమికి మోకరిల్లిన
ఆ చిగురాకును
తిరిగి నాకు తెచ్చివ్వు-

ఈ సమయంలో

ఈ సమయంలో మెలకువ రావడం
ఎవరి కలలోకో నువ్వు
రహస్యంగా వెళ్ళడం వంటిది

రాత్రి ముఖానికి కట్టిన పరదా
ఈ నిశ్శబ్దం-తొలగిద్దునా లేక
చీకటిని ఊహిద్దునా?
వడకట్టిన చూపుల మాటున
దాగుని మగతగా తిరిగి తిరిగే
నిద్రకు ఉపక్రమిద్దునా?

ఈ సమయంలో మెలకువ రావడం
ఎవరి కలలోకో నువ్వు
మెత్తని దీవనవై దేవతా ఆలింగనమై
అధృస్యంగా వెళ్ళడం వంటిది-

నిన్ను అల్లుకుని నిదురించే
తోటలోని లేత మల్లె మొగ్గలు

గాలిలో వీచే పచ్చని శ్వాసలు
గుండెపై చేయి, బోజ్జపై కాలూ-

నీ నిదురలోంచి దాటుకుని వచ్చి
నిన్ను తడిపే ఒక సెలయేరు
ముఖాన రాలుతూ, మరంతలోనే
ఎగిరిపోయే మెత్తని కురులూ-

ఇక ఒక కల/వరింత దివ్యవాక్కై
ఈ గదిలో వెలుగుతోంది దీపమై-

హత్తుకున్న చేతులని వొదిలి
కలల అలల పరిమళంలో
చేపపిల్లై తిరుగాడే ముఖాన్ని
ఆ చేతుల మధ్య నుంచి లాగి

ఈ నాలుగు పదాలు రాయడం
ఎంత కష్టమో
మీకు తెలిసే ఉంటుంది

ఏదో ఒకనాడు-!

28 March 2012

నువ్వూ, నేనూ (అను ఒక మధుశాల)

ఒక్కడినే వెళ్లాను ఈ వేళ
ఒక మధుశాలకి
మరుపే లేని ఆ ప్రదేశానికీ

కూర్చున్నాను ఒక్కడినే
ఓ మూలగా, ఒంటరిగా
తడిచిన ఆ మసక చీకట్లలో, ఆకులు రాలే కాలంలో-

సీసా నిండుగా బ్రాందీ
పాత్ర నిండుగా బ్రాంతీ

ఈ రోజు లేవు నీవు ఇక్కడ
కానీ నీ హాంగ్ ఓవరే వ్యాపిస్తోంది నలుమూలలా

ఆ పాకుడు రాళ్ళ పచ్చి పరిమళంతో
నేల రాలి దొర్లిపోయే
నిరుడు పూల శబ్దాలతో-

ఇక నేను నీకు ప్రత్యేకంగా చెప్పాలా

ఈ వేళ నేను
నీ జ్ఞాపకంతో

తాగి తాగి మత్తిల్లి
అలసి సోలి సోలి
తూగి తూగి ఊగీ

నాకు మాత్రమే కనపడే
నీ రూపంతో, నీ నీడలతో

నగ్నంగా
నృత్యం చేస్తానని?
దేవతా గీతాలు
పాడతాననీ?

27 March 2012

ఏమని

నీ ముఖం
ఒక మంచి నీటి సరస్సు అనుకున్నాను

ఎండకూ
లోహ మనుషుల వేడిమికీ వడలిన వదనం కదా నాది

కొంత సేద తీరుదామనుకున్నాను
నీ బాహువులలో కనులు మూద్దామనుకున్నాను-

ఇదేమిటి?
నీటిని ముఖాన చల్లుకుందామని, గొంతు తడుపుకుందామని

సరస్సున ముంచిన అరచేతులలోకి
అలలు అలలుగా నెత్తురూ
వొడిలో వాలిన శరీరంలోకి
నిలువెత్తుగా, నిండుగా దిగిన బాకులూ-

ఏమని అనను దీనిని? ఏమని పిలవను దీనినీ?

దుర్ధినం

ఎటువంటి దుర్ధినం ఇది!

ఎవరికీ ఏమీ కాక
మరోసారి ఈ రహదారులలో శిలువ వేయబడ్డాను-

ఎవరినీ తాకలేక
ఎవరినీ చూడక

ఎవరినీ వినలేక
ఎవరినీ పిలవక
ఎవరినీ కలవక

ఎవరికీ మిగలక
మరోసారి ఈ శరీరపు బలిశాల వద్ద నరకబడ్డాను

ఇక ఆ తరువాత
ఈ సాయంత్రానికి

పసి చేతుల్లో మెరిసిన పూలనూ
రాత్రి కురిసిన
చినుకులనూ

నేనెన్నడూ చూడలేదు-

26 March 2012

నీ వద్ద

ఎవరైతే
నీ నీడను వెలిగించారో
ఎవరైతే
నీ నిదురని కాజేసారో
ఎవరైతే
నీ రాత్రిని రాజేసారో
ఎవరైతే
నీ పగటిని లిఖించారో

ఎవరైతే లేకుండా ఉండి

నిను మాయచేసారో
ఎవరైతే రహస్యంగా
నిను తాకి నవ్వుతో వెళ్ళారో

ఎవరైతే నువ్వు లేక
కనుపాపలలో నెత్తురు కొన మెరిసి
విలవిలలాడిపోయారో

ఎవరైతే నువ్వు కానరాక
ఒంటరి రాకాసి గదులలో
లుంగలు చుట్టుకుపోయి

దూరం కాలం ఒక్కటే
అని తెలుసుకున్నారో

ఎవరైతే తమ
నీడకు చితి అంటించుకున్నారో
ఎవరైతే
తమ నిదురను సమాధి చేసారో

ఎవరైతే తమ రాత్రిని
చిట్లిన గాజుపెంకు అంచున ఉంచారో
ఎవరైతే తమ పగటిని
శవపేటిక వలె ఆలంకరించారో

వాళ్లు నా వద్ద లేరిపుడు -

నీ వద్దేమైనా ఉన్నారా? వాళ్లు?

గులక రాళ్ళు

రాత్రుళ్ళలో నిన్ను చూసే మెత్తని నయనాలు
ఈ దారిలోని గులకరాళ్ళు-

నీ అరచేతులలోకి అవి ఒదిగినప్పుడు
నీ హృదయంలో రెక్కలు
విదుల్చుకుంటాయి నల్లటి పావురాళ్ళు

చేతులపై రోమాలు జలదరించి
శిరోజాలు చిందరవందర అయ్యి
నీ పాదాలని చుట్టుకుని సాగుతాయి చల్లటి నదుల నీళ్ళు - చూడు

ఏ కళ్ళలోని చెమ్మో కలిగిన గూళ్ళు
ఈ నల్లని గులకరాళ్ళు
ఏ పసినవ్వులో తాకిన
పూలు ఈ గులకరాళ్ళు
ఆ నీలి సంద్రాల నిశ్శబ్ధం
ఆ ఇంద్రజాలపు లోకం గులకరాళ్ళు

ఏరుకువచ్చిన పసిపిల్లల కాలం
నీరెండ తాకిన
గులాబీల నీడల మోహం మైకం

ఈ గులకరాళ్ళు -
మొదటి ప్రేమలూ
మొదటి కౌగిళ్ళూ

యిక తిరిగి రాని, రాలేని వీడ్కోలులూ
తనువులూ తపనలూ ఈ గులకరాళ్ళు-

(యిక ఏం చేయగలవు వీటిని?)

ఏం చేయలేక యిక

రాళ్ళయిన కళ్ళతో
కళ్ళయిన రాళ్ళతో

రాళ్ళూ నిద్రపోతాయి
నీళ్ళ నీలి నిశ్శబ్ధంతో

నిలువెత్తు కన్నీళ్ళయిన నీ కళ్ళలో!

22 March 2012

అయితే ఏంటి?

సరే. యిక మరెన్నడూ చెప్పను

స్నేహం కన్నా శక్తీవంతమైనదీ
అత్యంత విలువైనదీ శత్రుత్వం: కావాలి నాకు అదే _

అయితే ఇంతకూ
నీ సమస్య ఏంటి?

21 March 2012

యిక యిక్కడ నీకేం పని?

నీడల వెలుతురులో
నిన్న రాలిన రావి ఆకులు నిన్నే పిలుస్తాయి-

రేపు రాలే
తిగిరాని మరో ఆకువి నీవని కొమ్మల్లోని కొంగలకి తెలుసు
గాలికి వాలి
మట్టిని తడిమే గడ్డి పరకలకీ తెలుసు, నీ తల్లికీ తెలుసు నీ స్త్రీకీ తెలుసు-

అందుకనే ఏమో
ప్రతీ సాయంత్రం

పిల్లలు నీ ముఖాన్ని తమ అరచేతుల్లో పుచ్చుకుని తిరిగి
రాత్రి వేళ ఇంటి ముంగిట్లో కూర్చుని
తమ మెత్తటి చేతివేళ్ళతో రుద్దుతారు:

గరుకు కాలం
ఇనుప లోకం

ఎవరో ఒకరు నిన్ను నీలా దాచుకోనిదే
ఎవరో ఒకరు నిన్ను పలుకరించనిదే, చావుకి బ్రతికి ఉండవు నీవు
ఎవరో ఒకరు నిన్ను శుభ్రం చేయందే, దుమ్ము దులిపి
పెదవులతో నిన్ను ప్రమిదెలా అంటించందే లేత వేడై నిదురోవు నీవు -

యిక వెళ్ళు ఇంటికి!

ఒక గులాబీల ఉద్యానవనం, ముళ్ళ పరిమళంతో
పచ్చి నీటి వాసనతో ఎదురుచూస్తుంది నీకోసం-

రావి ఆకుల నీడల చెమ్మదనంలో, చెట్టు కాండపు మొదట్లో
ఆ పచ్చిక బయళ్ళ శబ్ధాలలో
చినుకులో, వెన్నెల తునకలో రాలి, మంచు శ్వాసతో పెనవేసుకుని

నువ్వు చూడని కీటకాలూ
నువ్వు వొదిలివేసిన మృగాలూ నిదురోయే వేళయ్యింది-

యిక యిక్కడ నీకేం పని?

20 March 2012

నీకు (నీకే)

ముకుళితమైన అరచేతులలో
ఒక ప్రార్ధనవి నీవు , అరవిచ్చిన మొగ్గవి నీవు-

ఉదయం ఊపిరీ
రాతిరి నిదురా, జనన మరణాల అభయం నీవే: అందుకే

నీ పాదాల చుట్టే తిరుగుతోంది
రంగుల వలయమై మా జీవితం

మా నుదుటిన నీ అరచేతి పరిమళం
మా శరీరంలో నీ త్రి కాలాల భాష్యం

మా ఎండిన పెదాలకు నీవే జలాధారం
మా ఆకలిగొన్న కడుపుకు, నీవే
అన్నం మెతుకుల మల్లెపూల హారం-

ఎలా మరువగలం నిన్ను? యిక యిదే
సరైన సమయం నీకు చెప్పేందుకు మేం

నిర్భీతిగా నిస్సంకోచంగా నిస్సిగ్గుగా
నిన్ను ఏనుగంత ముద్దులతో*
ఆకాశం అంత బాహువులతో

ప్రేమిస్తున్నామని, ప్రేమిస్తామనీ
నీతోనే, నీ వెనుకే ఉంటామనీ -

_______________________ ________
ఏనుగంత ముద్దులతో: this image is from a letter of Che Guevara. ఎక్కడ చదివానో జ్ఞాపకం లేదు. తెలుగులో వచ్చిన పుస్తకమే!

14 March 2012

యిక్కడ

ముకుళించిన పూవులే ప్రార్ధిస్తాయి
పొగ చూరిన ఇనుప మైదానాలలో
ఇనుప నయనాలనీ, ఇనుప హస్తాలనీ 'నాన్నా' అనీ 'అమ్మా' అనీ 'వొద్దూ' అనీ-

లోహనగర పాటశాలలు ఇవి
బడులు నగరాలుగా
నగరాలు బడులుగా మారిన

మరి ఒక మహా శిశువధయాగంలో
యంత్రోఛారణ కావిస్తున్నాయ్
రూకలైన విద్యతో విద్యైన రూకలతో-

అరచేతులలో ఎగిరే మట్టి పిట్టలూ
మోకాళ్ళపై చిందే నెత్తురు పూలూ

జుత్తు చెరిగి చెరిగి, శ్వేదం చింది చిట్లి
మార్మోగే నిండైన కేకల అందియలు

ఉంటాయిక్కడ అని
నీకు చెప్పిందెవరు?

అతి జాగ్రత్తగా తవ్వుతున్నారు తల్లి తండ్రులు
తమ పిల్లలకి సర్వసుందరమైన సమాధులని

యిక్కడ ఎప్పుడూ, లేని ఒక రేపటికై

అతి నియమంగా పంపిస్తున్నారు వాళ్ళని
వల్లే వేసే మర ఆలయాలలోకి యంత్రాలై

యిక్కడ, ఎప్పుడూ లేని ఒక ఇప్పటికై-

రంగుల మేఘాలు చిక్కుకున్న గోళీలు
పాదాలకు చుట్టుకున్న వానచినుకులు
చినుకులతో చిందేసే కాగితం పడవలు

కొన్ని రంగులు, కొన్ని నవ్వులు
కొన్ని ఇష్టాలూ, కొన్ని ఏడుపులూ

ఉంటాయిక్కడ అని
నీకు చెప్పిందెవరు?

ఒక మహా కంకాళాల ఘోష ఇది
జ్ఞానార్జన కపాలాల సంఖ్యలే ఇవి

ఏమీలేదు: రాలిపోయిన, పోతూన్న

లేత శరీరాల మౌనప్రార్ధనలే యిక్కడ
చెప్పాలని చెప్పలేక, ఆగిపోయిన
పసి పెదాలే, పసి చేతివేళ్ళే యిక్కడ-

యిక ఆ మూగ ఆక్రందనలని
వినేదెవరు
? విన్నదెవరు---

13 March 2012

ఈ మధ్యాహ్నం

పచ్చిక వీచే ఆ తనువు
పూలు పూచే కనులు

మట్టి కుండలో నీళ్ళని తాకి
మెరిసి, ఘల్ అల్ మనే
తన చేతి మట్టి గాజులు-

ఆ ఎండ ఎడ్ల బండిలో
ఈ బ్రతుకు జాతరలో

వడగాల్పుల మూటను నెత్తిన
ఎత్తుకుని వచ్చిన నీకు
తనంత చల్లటి మంచి నీళ్ళు
లేతగాలి వంటి తన తనువు

- యిక నింపాదిగా కనులు మూసుకుని
నీళ్ళను పూర్తిగా శ్వాసించి

తడచిన తన అరచేతి గంధాన్ని
నుదిటిపై వేసుకుని
విశ్రమిస్తావు నువ్వు-

ఏమీ లేదు. ఈ మధ్యాహ్నం
కొద్దిగా బావుంది
నా అలసటతోనూ -

?

చిక్కటి చీకటి ఆకుపై రాలింది
చెమ్మగిల్లిన ఒక తారక -
యిక నేను అన్నాను

ముట్టుకోకు నన్నూ, తననూ:
ధరిత్రి, విశ్వంలో తిరుగాడే
ఒక అశ్రు వలయ బిందువు-
యిక ఆ రాత్రంతా ఒదిగే పడుకుంది
దగ్గరకు రాని
రాతి బావుల
రావి ఆకుల చల్లని మెల్లని ఆ గాలి!

12 March 2012

ఆ అమ్మ

ముసిరిన నీడల్లో
గుమ్మానికి ఆనుకుని కూర్చుంది అమ్మ

తన అరచేతుల చీకట్లో
నీళ్ళలో వాలిన కళ్ళు - ఎప్పటిదో తన జ్ఞాపకం

యిక ఆ నీలి సంధ్యవేళ

ఆ అమ్మవారి గుడిలో
కొంగలాగని కొలనులో

ఆ తామర పూవులు
ముడుచుకుపోయాయి:

యిక ఈ రాత్రి
యిక ఎప్పటికీ
తెల్లవారదు -

అంతే...

తేలికగా ఉంటాయి
మధ్యాహ్నం పూట కొమ్మని దూసే అశోకా ఆకులు

యిక నేలపై పగిలిన ఎండలో
తన అద్దంలో వాలుతుంది ఒక నీడల రామచిలుక

చెట్టుకు అటువైపు
నేలని గీకుతో తన చెవులని గోకుతో తోకతో తిరుగుతో
గాలి గజ్జెలతో ఆడుతుంది నల్లనయ్య అది నీ కుక్కపిల్ల

చెట్టుకు ఇటువైపు
తనువంత పాత్రతో తనువంత దాహంతో నీ పెదాలు తవ్వుకుంటూ
ముఖాన్ని అరచేతులతో రుద్దుకుంటూ ఆడలేక అటుపోలేక నువ్వు-

ఇన్ని రహదారుల్లో, ఇన్ని లోహపు పొగల్లో స్పృహతప్పి వచ్చాక
నిన్ను స్ఫురింపజేసే చల్లటి మాదక ద్రవ్యమేదో ఉంటే బావుండేది

నిన్ను మరిపింపజేసే శీతల రాత్రుల, ఆదిమ పుష్పాల
ఒక వలయాంమృత మంత్ర జలమేదో ఉంటే బావుండేది-

ఏమీ లేదు, ఇది అంతా దేని గురించీ అంటే
ఏమీ లేని ఒక బద్ధకపు మధ్యాహ్నం.అంతే-

ఈ రోజుకు

అద్దె ఇంటి నిండా నువ్వు వెలిగించిన
అగరొత్తి పరిమళం

మరొక ఉదయం. మరొక పనిదినం

తెరిచి ఉంచిన కిటికీలు
రాలే కాంతి చినుకులు

హాయిగా తేలికగా ఊగే పరదాలు
బాల్కనీలో గింజలకై పిచ్చుకలు

నీ చుట్టూతా చిన్నచిన్న పిల్లలు
పిల్లల చుట్టూతా ఇంకా వీడిపోని

లేత నిదుర మబ్బులు: దీవెనలు

అదే ఇంటి నిండా
నువ్వు వెలిగించిన

ఉదయపు వాన పరిమళం
నిత్య జీవన ఇంద్రజాలం
ఒక మెత్తని అనుదిన కలకలం

యిక ఈ రోజుకు
ఈ నగర రహదారులలో
నేను ఒంటరిని కాను-

11 March 2012

ఒక సాధారణ వాచకం

నువ్వు చేసిన నాలుగు అసాధారణ పనులకై
నాలుగే నాలుగు సాధారణ వాక్యాలు రాస్తాను నీకై పూట-

౧.

వేసవి పగటిలో అన్నం వండి పిల్లలని స్కూలుకి పంపి
ఒక చల్లటి కుండై అక్కడ కూర్చున్నావు కిటికీ పక్కగా

చుబుకం కింద అరచేయితో , పసి కళ్ళతో
నీ చూపులను నీ తల్లి వద్దకు, తన స్మృతి వద్దకూ పంపి-

౨.

కమిలిపోయిన మధ్యాన్నం ఒక్కదానివే కవ్వంతో మజ్జిగ చేస్తూ
ఒక్కసారి మననం చేసుకున్నావు మంత్రంలా
'ఇళ్ళకు మగవాళ్ళు సమయానికేందుకు రారో' నని - ఆనక తినీ తినక

కడుపులోకి ముడుచుకుని పడుకున్నావు

కిటికీ పక్కన రిఫ్ఫ్ రిఫ్ఫ్ మని వింజామరలు వీచే
పావురాళ్ళ రెక్కలను వింటూ, ఒక అలసటని తనువులోకి లాక్కుంటూ
అంతం కాని ఒక అలసటని కలగంటూ-

యిక నువ్వు నిద్రించావో, మరణించావో ఎవరికీ తెలియదు-

౩.

సాయంత్రం ఇల్లంతా ఊడ్చి, గదంతా ఎగిరే పిల్లలను
నింపాదిగా కూర్చోబెట్టావు, హోంవర్క్ చేయించావు:

ఆనక చీకటయ్యి ఆకాశం బోసిపోయింది కనుక
బాల్కనీలో నక్షత్రాల పరదాని పరిచావు
చల్లటి గాలి వీచగా, నన్ను క్షణకాలం మరచి బ్రతికావు

తరువాత పిల్లలని దగ్గరగా లాక్కుని, ముద్దు పెట్టుకుని
ఒక్కసారిగా కన్నీళ్ళతో గాట్టిగా కౌగాలించుకున్నావు:

ఎందుకనో నీకే తెలియలేదు

౪.

రాత్రి నిలువునా చీలింది. గదిలోని దీపం
సగంగా చిట్లిపోయింది. పగిలి పగిలి
నీ ముంగిట్లోకి తూలుతూ వచ్చింది నేనే

విరిగి విరిగి నిదుర లేక తిరిగి లేచి, నన్నే
ఈ స్మశానాన్నే శుభ్రం చేసి
నా తల వద్ద ఒక ప్రమిదె వెలిగించినదీ నీవే-

నేను ఎన్నడైనా ఉన్నానా నీకు
నువ్వు ఎన్నడైనా ఉన్నావా నాకు అని
నువ్వూ అడగలేదు, నేనూ చెప్పలేదు-

***

యిక మిగిలిన అయిదో వాక్యం, వాక్యాంతం నీదే: మొదలపెట్టు-

10 March 2012

అద్దంలో చందమామ

తెరచి ఉంచిన కిటికీలో
రాతి చదరపు మేడలకు పైగా చందమామ-

తను లోపలికి రాదు, నన్ను రానివ్వదు

యిక నా అద్దంలో
నీ పసుపుపచ్చ ముఖాన్ని చూసుకుంటూ

నేను రాత్రంతా నిద్రపోయాను.
ఒక రహస్యాన్ని కలగన్నాను

అయితే నన్ను వొదిలి, నా నిద్రలోంచి

తన రాత్రి పలకల రాతి పగటిలోకి
అంతే రహస్యంగా
వెళ్లిపోయింది ఎవరు?

ఇంతకూ

నిన్ను తలుచుకుని
నిన్న రాత్రంతా తాగాను

పగలు గుండె లేనిదై నా వెంటపడగా
ఏమీ లేని, ఏమీ రాని ఈ కాలంలోకి

కబోధినై తడుముకుంటూ కదిలాను.

ఇంతా చేసి స్నేహితుడా

నువ్వు ఉన్నావా అని
ఈ లోకంలో చూడలేదు
ఈ మతి లేని జనాన్నీ అడగలేదు.

ఇంతకూ ఉన్నావా నువ్వు?

09 March 2012

నూరుల్ హసన్ ( అనే / అంటూ పిలవబడ్డ అతడికి)*

ఒక తెల్లవారుఝామున
నోటి వెంట నురగతో అతడు మరణిస్తాడు

గుండెల్లో నొప్పి
మంచం పైనుంచి లేవాలి
శరీరం సహకరించదు

భూమిని రెండు అరచేతులతో ఆపేందుకు ప్రయత్నించినట్టు
రెండు అరచేతులనీ బలంగా మంచంపై నొక్కిపెట్టి
శరీరాన్ని గది విశ్వంలోకి లేపేంతలోనే, కదలబోయేలోనే

నక్షత్రాల పోడిలా మెరుస్తోన్న నురగ
నోటిలో, నాసికా రంధ్రాలలో కలసిపోయి, నేలపైకి రాలిపోయి
అతను మరణిస్తాడు: హార్ట్ ఎటాక్ అని అంటారు వాళ్లు.

అతనూ చెబుతుండేవాడు
దట్టమైన అడవిలో తిరుగాడే ఏనుగులా, జీవితారణ్యంలో
నిర్భయంగా నడుస్తో చెబుతుండేవాడు:

'నేనెపుడో మరణిస్తాను, ప్రేమ లేక ఒత్తిడికి లోనైన గుండెతో'
తన భారీ శరీరంతో, భూమి పైకి వొంగిన నల్లని నక్షత్రంలా
కాఫి కప్పు పైకి వొంగుతో అతను తిరిగి కొనసాగించేవాడు

'ప్రేమ. నాకు ప్రేమ కావాలి
ప్రతిరోజూ కావాలి. మూడు పూటలూ కావాలి
చక్కగా ఉడికిన మాంసం లాంటి ప్రేమ'

మెరుపులతో పగులుతున్న రాత్రి ఆకాశంలా
అతను నవ్వుతో చిట్లేవాడు - ఇరానీ కేఫెలలో
తరచుగా లిబర్టీ దగ్గర 'మొఘల్ దర్బార్' లో
నవ్వులతో వొణికి పోయేవాడు-


అతని భాష దైహిక భాష

'ప్రేమ గురించి మరి కొద్దిగా', కుర్చీలో వెనక్కు వాలుతూ
బహు దూరపు ప్రయాణంలో చెట్టు నీడన చెట్టు కింద
చెట్టుకు ఆనుకున్న ప్రయాణికుడిలా సాగిలబడుతూ చెప్పేవాడు

'నువ్వు ప్రేమించావా?
పోనీలే ప్రేమించే ఉంటావు కానీ
నిజంగా ప్రేమించు. యిదే సమయం
యిదే సరైన రక్త సమయం. ప్రేమించేందుకు
రేపటికి స్మృతులను మిగుల్చుకునేందుకు'.

కానీ ఎలా ప్రేమించాలి?

'శరీరంతో స్వప్నించినట్టు, కలకీ వాస్తవానికీ మధ్య సీమలో
రెండూ అయ్యి రెండూ కాకుండా ఉండాలి ఒక్కటిగా ఉండాలి
ప్రేమించడం ఎప్పుడూ ఒక కళ. నువ్వు కవిత్వం రాస్తావే అలా.'

అతనూ కవిత్వం రాసాడు కానీ మృత్యువుతో
బహుశా, అతను మృత్యువుని ప్రేమించాడు
మధ్యాన్నం పూట నాంపల్లి హోటల్లో
తందూరి రొట్టేలనూ మాంసాన్ని ఇష్టపడినంతగా-

'ఆకలి వేసినప్పుడు ఎంత ఇష్టంగా తింటావు అన్నాన్నీ?
అంత ఇష్టంగా రమించాలి, కానీ
ప్రతీసారీ అది అలా కష్టమనుకో
ప్రేమతో రమించడం, నీకైనా తనకైనా
అయినా ప్రేమని వోదులుకోకూడదు
తెలీదా నీకు?శరీరం కూడా కవిత్వమే-'

శరీరమూ కవిత్వమే.అతనూ
అతని శరీరమూ కవిత్వమే

డెక్కన్
క్రానికాల్ పేపర్నీ, మరొక పుస్తకాన్ని
చంకలో ముదుచుకుని, బొద్దుగా ఉన్న
నిండైన నల్లటి మేఘంలా కదులుతో అనేవాడు-

'ఒక మందపాటి కవిత్వపు పుస్తకాన్ని నేను
ఆసక్తితో ఎవరూ చదవరు: నా భార్య
ఉపోద్ఘాతం మాత్రమే చదవగలిగింది
నా పిల్లలూ, వాళ్ళూ కొద్దిగానే-
కోరుకుంటాను, ఎవరైనా నన్ను
మొత్తంగా చదవాలని, తిరిగి రాయాలని-'

సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ సమయం ఇరుకౌతుంది
ఎంతగా అంటే సమయమే మిగలనంతగా -

కవిత్వం ఒక నల్లని ఆకాశం లేదా
తెల్లని నక్షత్రాల నల్లని ఆకాశం.
చీకటిలో తల ఎత్తి చూడగలగాలి
నిండైన జాబిలిని మాత్రమే కాదు
అమావాస్యనాడు తళుక్కుమనే

నక్షత్రాలనీ చూడగలగాలి, వినగాలగాలి

అందుకు సమయం కావాలి
అందుకు ప్రేమ కావాలి

మనిషి కూడా ఆకాశమే.మనిషి కూడా ఒక నల్లని సముద్రమే

యవ్వనంలోనే
కాదు కాలం గడుస్తున్న కొద్దీ
శరీరపు అలలని దాటి లోపలికి వెళ్లి
నక్షత్రాలనూ నక్షత్ర కవిత్వాలనూ చదవగలగాలి

అందుకు సమయం కావాలి

ఎప్పటికీ వీడిపోని మెత్తగా తాకే స్పర్శ కావాలి
ఎప్పటికీ ఆరిపోని మనస్సులోని తడి కావాలి
ఎప్పటికీ ఓడిపోని ప్రేమయపు యుద్ధం కావాలి

గుండెలో మృదువైన చెమ్మగిల్లిన హస్తాలు కావాలి
ఓదార్పుగా కౌగాలించుకునే స్నేహ కౌగిలి కావాలి
శరీర పరిమళం కావాలి జీవితపు చీకటి లోగిలిలోకి
పాదం మోపి నేనున్నానని నమ్మకంగా చెప్పే
రెండు అరచేతుల ఒత్తిడి కావాలి.ప్రేమ కావాలి

వృద్ధాప్యంలోనూ చలి మంట లాంటి
గుండె శంఖంలోని ని/శబ్ధం కావాలి.
కాకపోతే ఇవేమీ లేని నాడు, ఇవేమీ దొరకని నాడు

అసంఖ్యాక మడతల తెలుపు నలుపుల లాంటి రోజులలో
ఒక మనిషి తెల్లవారుఝామున
నోటివెంట నురగతో మరణిస్తాడు

ఆ తరువాత, చాలా రోజుల తరువాత
అతడిని పూడ్చిన సమాధిపై వర్షంలో
రెండు మొక్కలు ఆకాశంవైపు చేతులు చాస్తాయి

తల ఎత్తి నక్షత్రాలని గమనించమని చెబుతూ
మరణించి మొలకెత్తిన అతని బాహువులలోకి
ప్రపంచాన్ని ప్రేమగా ఒదిగిపోమ్మని కోరుతూ

రాయాలని కాంక్షించిన కవిత్వాన్ని వర్షంలో లిఖిస్తూ
వీస్తున్న గాలికీ, రాలుతున్న ఆకులకీ

పొగలా ముడివడి వీడి పిగిలిపోతున్న ఆకాశానికీ
మరు సంవత్సరానికి తనని
చూసేందుకని వస్తే, వచ్చే భార్యనీ పిల్లలనీ లేదా
తనకి పరిచయలస్థులైన మనుషులందరినీ

భూమిలోంచి తపనగా పొడుచుకు వచ్చిన
ఆ రెండు హస్తాలు ప్రార్ధిస్తాయి -


'నన్ను ప్రేమించండి'.

08 March 2012

నలుపు/తెలుపు

నువ్వు యిక్కడ ఉన్నావు కానీ
నీ కళ్ళే ఎక్కడో సుదూరంగా తప్పిపోయాయి

మన ఇద్దరి మధ్యా
ఒక నల్లని నిశ్శబ్ధం-

అలసటగా వాలిన ఒక అరచేయీ
నిస్సత్తువుగా ఆగిన ఆ పాదాలు

మట్టికుండపై అలాగే ఉండిపోయిన
నువ్వు తాగుదామని
ముంచుకున్న నీళ్ళ గ్లాసు
దాని పక్కనే వడలిపోయిన
నిన్ను తాకని మల్లె పూలు

రెపరెపలాడని పరదాలు, చదరపు గదులు
గూటిలో కదలని పావురాళ్ళు

పస్థుతానికి యిదే, ఇవే నువ్వు:

నువ్వు యిక్కడే ఉన్నావు కానీ
నేనే ఎక్కడో తప్పిపోయి ఉంటాను

యిక నిన్ను కానీ నన్ను కానీ
కనుగొని హత్తుకునేది ఎవరు?

07 March 2012

మాత్రమే*

ఒక ప్రేమ కవిత రాయాలనుకున్నాను
నీలాంటి ప్రేమ కవిత: నీ శరీరం

నువ్వూ అయిన ఉల్కాపాతం లాంటి దాన్నేదో
పదాలలో కూడా చూద్దామని అనుకున్నాను

చుట్టూ అల్లుకున్న కీచురాళ్ళు
చీకటి తీగపై మెరిసే తారకలు
ముఖంలో ముఖం పెట్టి, కళ్ళల్లో కళ్ళు పెట్టి ఈ రాత్రి గాలి

చాచిన నా చేతికి యిక ఎప్పటికీ అందని
వెనుదిరిగి వెళ్ళిన నీ వలయ పాద ముద్రికలు

అతనే అన్నాడు, నీ గురించి మాట్లాడటమంటే
దూరం గురించి మాట్లాడటమని
అతనే అన్నాడు, నీ గురించి మాట్లాడటమంటే
నక్షత్రాల గురించీ అసంఖ్యాక విశ్వమండలాల గురించీ ఊహించడమేనని-

రాత్రిపూట దారి తెలిసీ తెలియక
ఆకులపై తచ్చట్లాడే వెన్నెల సీతాకోకచిలుక
చీకటి తడి తాకిన గాలిలో, పచ్చటి గడ్డిలో
వడివడిగా వెళ్ళిపోయే నల్లని ఆదిమ సర్పవంక*
అన్నిటి మధ్యగా శాపగ్రస్థుమైన శిలలా
రాక్షస దేవతా రూపంలా మారిన నేను

నిజానికి నేను నీకు ఒక ప్రేమ కవిత రాయాలనుకున్నాను

నువ్వు నగ్నంగా పరుచుకున్న రాత్రుళ్ళ గురించీ
నీ రక్తపు చెలమలో ఇంకించుకున్న
నాలాంటి శరీరం గురించీ ఒక ప్రేమ కవిత రాయాలనుకున్నాను-

నన్ను నేను గమనించుకుని వెనుదిరిగిన సమయంలో

నా ఎదురుగా మిగిలిన ఒక నెత్తురు పలక
రెక్కలు తెగిన సీతాకోకబలపం
పురాతనమైన కట్టడాల్లా మారిన హింసాత్మక స్మృతులూ- ఆహ్

ఇంతకూ, నిజానికీ

నేను నీకు రాయాలనుకున్నది
ఒక్క ప్రేమ కవిత మాత్రమే-
_________________________________________ _______________________
*నెలవంక వలె సర్పవంక: సర్పం+వంక = సర్పవంక, వంకీలు తిరుగుతూ వెళ్ళే సర్పంగా కూడా చదువుకోవచ్చు

అంధుడు

కళ్ళను మూసిన అరచేతులను తెరిచి
పూసిన పూలను చూసి మైమరచి

సేదతీరుదామని, చూపులను తాకుదామని

ఇంటికి వెళ్ళిన బాటసారికి
ఆ అరచేతులలో
నెత్తురు నిండిన

నల్లని కనుగుడ్లను
ఉంచినది ఎవరు-?

06 March 2012

ధార

తను నిదురిస్తుంది

రాత్రిపూట కదులాడని మల్లెపూల పొద తను, తన తనువు
రాత్రిపూట వ్యాపించే నీటి తడి తను, తన తనువు:
నిన్నూ నీ నిశ్శబ్దాన్నీ చుట్టేసి స్థాణువును చేసే పరిమళం
తను, తన తనువు-

తన కలల వేళ్ళు నిదుర భూమిలో
బలంగా నాటుకుని ఉండవచ్చు: మరేమీ లేని కలలు
మట్టి కలలు. నల్లటి సారవంతమైన మట్టి కలలు

తన జీవితం ప్రకాశిస్తోంది పగటిపూట పరచుకున్న
సూర్యరశ్మిలో పచ్చటి చేతులతో
యిక తన వేళ్ళ చివరన వేలాడుతూ మరిన్ని జీవితాలు
ఒక పూల అల్లిక నైపుణ్యంతో, ఓరిమితో

నువ్వూ నేనూ వాళ్ళూ, తన అల్లికకై వేచి చూసే
తన వెళ్ళని తాకే సుక్షణంకై ఎదురుచూస్తో-

వాళ్ళందరికీ, మనందరికీ
తనే సారం, ఆధారం
మట్టీ నీళ్ళూ నీడా వెన్నెల కూడా-

తను కూడా చలిస్తుంది. తను కూడా విరిగిపోతుంది

భయాలు లేవని కాదు, కాకపోతే
భయాలకెప్పుడూ లోంగిపోలేదు-

చూడండి, ఎప్పుడూ ఒక నీటిహారం తన పెదాలపైన
చూడండి దినం ఎప్పుడూ వెచ్చగా నలుపబడే
ఒక రొట్టెపిండి తన అరచేతుల మధ్య- ఒక చిర్నవ్వు
మీగడలా, తడిసిన తన కనులపైన: ఎందుకంటే

తన చిరునవ్వు తన కలలలో, తనే అయిన కలలలో
యితరుల సారాన్ని కనుక్కుని ఉండవచ్చు
నిన్ను తన ఒడిలోకి తీసుకుని జోకొడుతుండవచ్చు-

ఏమని చెప్పను? పగలు తను మెలికలు తిరుగుతూ పాకే
సర్వ మైలాన్నీ తీసుకువెళ్ళే ఒక మహా నదీసర్పం
ఏమని చూపించాను? రాత్రయితే తనతో తాను ఆడుకునే
వొంటరిగా పడుకునే ఒక మహా దుక్కం

చూసారా మీరేపుడైనా, మీరెక్కడైనా తననీ, తన తనువునీ?

ఆ రాత్రి*

ఈ రాత్రి
తన దేహం అలసిపోయింది
నిన్నటిలాంటి ఈ రాత్రి
ఈ రాత్రిలాంటి మొన్నటి రాత్రి

మూడు రోజులుగా తన దేహం అలసిపోయి
వేర్లు వెలుపలకి వచ్చి వొరిగిపోయిన
వృక్షంలా మంచంపైకి రాలిపోయింది

జ్వరం: వేయినాలికల సాలెపురుగేదో
గూడు కట్టుకున్నట్టు మోకాళ్ళ మధ్య నొప్పి-

అమ్మ అంటుందీ:"మోకాళ్ళ మధ్య నుంచి
నలువైపులా నరాలు చీలిపోతున్నట్టు
భరించలేని నొప్పిరా కన్నా" -

తన కళ్ళ వెనుకగా ఎవరో నెమ్మదిగా
ఎండు కట్టెలు తగలవేస్తున్నారు:
యిక ఆ కళ్ళు రెండూ నిశ్శబ్ధంగా
అరణ్యాల్లా అంటుకుని కన్నీళ్ళతో మండిపోతాయి

"
తలలో పోటురా: పగిలిపోతుంది
భరించలేని నొప్పిరా కన్నా-"

ఆమె పక్కగా, అమ్మ పక్కగా కూర్చున్నాను
వేసవి ఎడారిలో నగ్నంగా నుంచున్నట్టు-
వేడి గాలి, జ్వలించే ఊపిరి: శరీరం నీరులా
ఆవిరవుతుందా? మాయమౌతుందా? ఏమో తెలియదు కానీ

ఆమె మాత్రం నిశ్శబ్దంగా పడుకుంది

నిశ్శబ్ధం మహా శబ్ధమైన మృదువైన భాష
ఆమె ఆ నిశ్శబ్ధ శబ్ధంతో సంభాషించింది
నాతోటి పలుమార్లు
ఇప్పటిలాంటి మునుపటి రోజులలో-

ఆమె నుదిటిపై అధ్రుస్యంగా కదులుతోన్న
ఒక పొద్దుతిరుగుడు పూవు
ఆమే ఒక పూవు. సూర్యరశ్మి వర్షంలా
కురుస్తున్న దృశ్యం కూడా
ఆమె ఒక మహా యోధురాలు కూడా-

రాత్రిలో బయటనుంచి
ఒక పిల్లి అరుస్తోంది:
మా గది బయట అది
అసహనంగా తిరుగాడుతున్న పాదాల సవ్వడి

నా హృదయంలో కూడా ఒక పిల్లి కదులుతోంది
అసహనంగా ఆమెకోసం
ఆమె కోలుకుని దయగా ఇచ్చే పాలకోసం
పాలలాంటి ప్రేమపూరిత జీవితం కోసం-

ఒక వేకువ ఝామున*

ఒక వేకువఝామున
ఆమె తనలోకి తాను ముడుచుకుపోయి పడుకుంటుంది

దేవతలు దు:ఖాన్ని ప్రశ్నించరు
హృదయాల్ని/ మనుషుల్ని రక్షించరు -
అందుకని ఆమె
మిగుల్చుకున్న మూడేళ్ళ కొడుకుని
పొదుపుకుని పడుకుంటుంది

దేవతలు దు:ఖాన్ని ఇస్తారు
హృదయాలపై హత్యాధ్వనులను మాత్రమే మిగుల్చుతారు

అందుకని ఆమె
నిమజ్జనపు రోజున
తన ఇంటికి తానే తాళం వేసుకుని
భయం భయంగా, తనలోకి కొడుకునీ
కొడుకులోకీ తననీ ఇముడ్చుకుని పడుకుంటుంది

ఇంటి ముందు నుంచి ఊరేగింపు వెళ్ళాలి
కుంకుమ చినుకులతో, నిమజ్జనపు ఉన్మాధపు నృత్యాలతో
వీధి వీధంతా జలదరించాలి - ఊరేగింపు-

ఉన్మాధపు ముఖాలు
నుదిటిపై పొడుగాటి ఎర్రటి అంగాలు
కింద జ్వలించే కనుల వృషణాలు
ఉన్మాధపు మృగాలు - అయ్యో, నిమ్మజనపు ఊరేగింపు
ఇంటి ముందు నుంచి వెళ్ళాలి

అందుకని ఆమె
తన ఇంటి తలుపులకి తానే తాళం వేసుకుని
భయంగా, తనలోకి కొడుకునీ
కొడుకులోకీ తనీ పొదుపుకుని పడుకుంటుంది-

ఆ ప్రియురాలి గర్భస్రావం*

రాత్రి ఆమె నన్ను పట్టుకుని గుక్కపట్టుకుని రోదించింది. పర్ణ కుటీరం లాంటి గదిలో, తుంపరగా రాలుతున్న అరవై వాట్ల కాంతి తునకల మధ్యగా, తను నన్ను

బాల్యంలో బొటనవేలిని కరచుకున్ననల్లటి గండుచీమలా, రెండు వేళ్ళమధ్య నొక్కి లాగుతున్నా వొదలని నల్లని మెత్తని గండు చీమలా తను నన్ను ప్రేమతో బిగించి, వెక్కిళ్ళ మధ్య మెరుపులా మెరిసి అధ్రుస్యమయ్యే ఎగిసిపడే ఊపిరితో విలవిలలాడింది: "నానూ, నువ్వు క్షణాన ఇక్కడ లేకపోతే ఏమయ్యేదాన్నో?"

రాత్రి మరికొంతగా, పిచ్చివాడికి పదిరోజుల తరువాత దొరికిన అన్నం ముద్దలా ఆర్తిగా సాగింది. వెచ్చగా కంపించే కన్నీళ్ళ నది నన్ను వలయాలుగా చుట్టుకుంది. ప్రేమలో కంపితురాలయ్యిన సీత తను. ఒక జలపాతాన్ని శరీరంలోకి ఇంకించుకునే ప్రక్రియలో నేను. తను వొణుకుతూ అంది:

"నా గర్భంలో రూపమొకటి పెరుగుతుంది. నాకు వొదులుకోవాలని లేదు. నాదైన నెత్తురు పిండాన్ని రాలిపోవడాన్ని అలా నిర్లిప్తంగా చూస్తుండాలని లేదు."

నేను మౌనంగా తనని కౌగాలించుకుంటాను. శరీరం ఏమిటి? ప్రేమలో ఉన్న శరీరాన్ని, ప్రేమించిన శరీరాన్ని, దుక్కంతో దుక్కంలో వొణుకుతున్న శరీరాన్ని శరీరంలోకి ఖడ్గంలా దింపుకున్న ఏమీ కాని కౌగిలి ఏమిటి?

పాకుడు రాళ్ళపై సాగిన సాయంత్రపు నీడల్లా, కనుల అంచుల నుంచి తడిమే చితికిన కళ్ళ తడి. కార్నర్ చేయబడ్డ పసి జింకలా తను నా శరీరంలోకి హడావిడిగా భయంతో ఒక లేత పావురంలా జొరబడినప్పుడు, యిక ఇప్పుడు కూడా ఇక్కడ

తను వొదిలివేసిన నెత్తురు పిండపు విత్తనాలు మొలుచుకువచ్చి, ముళ్ళ కంచెల్లా శరీరాన్నిచుట్టుకుంటాయి. రాత్రిపూట, వొద్దనుకున్నా అలుముకునే రహస్యమైన నీడలలో, కుత్తుక తెగుతున్న సీతాకోకచిలుకలా తను మరోమారు తిరిగి వస్తుంది: కాకపోతే అక్షరాలు తన గర్భంలో తునాతునకలైన ఎదిగీ ఎదగని పిండంలా చిట్లి కన్నీళ్ళ రాళ్ళతో రాసుకుంటున్న కాగితంపై అలుముకుంటాయి. తరువాత పదాల వెనుక నుంచి

విస్తృతంగా సాగే ఛిన్నాభిన్నమైన రక్తం, తుంపులు తుంపులుగా పిగిలిపోయే నా రూపం, వెనుకాలే నలుదిశలా ఆనవాలు లేకుండా కొట్టుకుపోయే వాచకం-

05 March 2012

ఆ రాత్రి*

మాకు ఆ పూట తిండి లేదు: అంతకు మునుపు

నగ్నంగా హత్తుకుని
ఆకలితో మేల్కొని ఉన్న నిన్నటి రాత్రి నుంచీ
ఈ పూట దాకా మాకు తిండి లేదు-

నా దేహం కానీ తన వక్షోజాలు కానీ రొట్టెముక్కలు కాలేవు
కన్నీళ్ళతో తడిచిన ఒక దిండుగా తప్పితే
ముఖాన్ని దాచుకునేందుకు ఆరిన రాతి రాత్రి వస్త్రంలా తప్పితే
నా దేహం కానీ తన వక్షోజాలు కానీ రెండు మెతుకులైనా కాలేవు

నేను అన్నాను: "రేపు మన దగ్గర డబ్బులుంటాయి
ఈ రాత్రి ఈ నాలుగు బ్రెడ్డు ముక్కలు తప్పితే
ఎక్కడా ఇరవై రూపాయలు అప్పు కూడా దొరకలేదు."

తను అంది: "నాకు ఆకలిగా లేదు. నువ్వు తినేయి
(నాకు తెలుసు అది అబద్ధమని)
నాకు కొద్దిగా నీళ్లు చాలు, పడుకుందాం." చివరకు

నా హృదయం కూడా ఓటి కుండయ్యింది.
వెలుతురు లేని రాత్రిలా ఆ రాత్రి
రొట్టె లేక మాడిన పెనంలానూ మారింది.
ఎండిన ఎడారి మధ్య తడిలేక తడబడిన
కళ్ళలానూ మారింది. యిక మేము

బయట కూర్చున్నాం, నిదుర రాక
గది ముందు చీకటిలో ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల మధ్య
నాలుగు వేళ్ళతో ప్రేమగా చించిన రొట్టెలాంటి సగం జాబిలితో
కుండల్లో వొండిన అన్నంలాంటి గాలితో, మా ముందు తోకాడిస్తూ
కూర్చున్న కుక్కతో, ఒకే శాలువాని కప్పుకుని

అప్పుడే ఆర్పిన స్టవ్ లాంటి శరీరాలతో
కూర్చున్నాం బయట ఇద్దరం
ఒకర్ని ఆనుకుని మరొకరు, యిద్దరుగా ఒక్కరిగా-

ఆ సాయంత్రం*

ఆ రోజు సాయంత్రం

కనిపించనిదేదో గాలిలో పెనుగులాడుతున్నట్టు
మాసాంతపు మార్చి ఎండ చెట్లపై వలల్లా జారి
ఆకుల మధ్య నల్లటి మచ్చల్లా మారుతున్నప్పుడు

నేను తన అరచేతిని గట్టిగా పట్టుకున్నాను

ఇంతకు మునుపెపుడూ తాకనట్టు
తన అరచేతిని భయంతో
తను వెళ్లి మిగిల్చిపోయే
లేనితనం ఇచ్చే శూన్యంతోనూ తపనతోనూ
దీనంగా దుక్కంగా, నా శరీరంలో
ముక్కలవుతున్న సారాంశం ఉనికితోనూ

తన అరచేతినీ, ఆ ఐదు వెళ్ళనీ తన శరీరాన్నీ
మరణించేముందు అత్యంత ప్రియమైనదాన్నేదో
బ్రతికి ఉన్న క్షణాలలోకి ఇంకించుకున్నట్టు

వొదలకుండా తన దేహపు వెచ్చదనాన్ని
జారిపోతున్న నా కనుల తడిలోకి అదుముకున్నాను

ఆ రోజు సాయంత్రం సర్వం నన్ను వొదిలి
తనతో వెళ్లిపోతున్నప్పుడు, యిక తిరిగి
మరెన్నడూ నేను తనని చూడనని తెలిసినప్పుడు

ఇంతకుముందు నేనెపుడూ అనుభవించని
స్థితినీ భాషనీ, అ/కారణంగా
చెంపపై చరచబడిన పిల్లవాడు
నీళ్ళు నిండిన నేత్రాలతో లోకాన్ని చూసినట్టు

శరీరాన్ని భిక్షపాత్రగా మార్చుకుని
వేసిన భిక్ష కళ్ళ ముందే తిరిగి మాయమయ్యే కాలాన్ని
నా అరచేతుల్లోకి పీల్చుకుని

ఆ రోజు సాయంత్రం, నా అరచేతుల మధ్య
ఆమె వొదిలివెళ్ళిన
ఆమె చేతి స్పర్శను
గట్టిగా పట్టుకుని కూర్చున్నాను-

నేల*

ఒక రోజు ఆమె నా గదిలోకి వచ్చింది: అంది కదా
"ఏమిటిదంతా అస్థవ్యస్థంగా?
నీ గదిని శుభ్రం చేయాలి." (సంవత్సరాల క్రితం
నాలోకి జొరబడి నన్నుశుభ్రం చేసినట్టు)-

నేను సరేనన్నాను. అంది కదా తను:
"కాళ్ళు దులిపి మంచంపై పెట్టుకో. నా పని అయ్యేదాకా
నువ్వు కిందకి దిగకూడదు."

నేను ఆమె ఆజ్ఞని శిరసావహించాను. ఎందుకంటే
మీకు తెలుసు, ఆమె నాకు ప్రియురాలి కన్నా
మరింత ఎక్కువగా తల్లి వంటిదని. ఇంకా నిజంగా
ఆమె ముందు నేను బాలుడనని- యిక తరువాత

దుమ్ముపట్టిన కుక్కపిల్లలా ఆ మంచపై
ముడుచుకు కూర్చుని నేను, ఆమెని గమనించాను

మట్టి పరిమళపు వొత్తిడితో కదిలిన గాలిలా
ఆమె గదంతా తిరుగాడింది.
విశ్వంలోని విశ్వాలని క్రమంలో పేర్చుతున్నట్టు

వస్తువులను సర్ధుతూ, ఒక పాత గుడ్డతో
సర్వాన్నీ తుడుస్తూ అడ్డం వచ్చిన వాటిని
పిల్లి పిల్లలను రెండు వేళ్ళతో పుచ్చుకుని
జాగ్రత్తగా పక్కకి పెట్టినట్టు ఉంచుతూ తనే
గదంతా వర్షపు నీటిలా పారాడింది.

నేను పిల్లిపిల్లనై (తను తీసి పక్కకు పెట్టిన)
తనను గమనించాను. లేత ఎండలో
వేగంగా కదులాడే పిచ్చుకల పాదాలలా
రాత్రుళ్ళలో అలలలో చెలరేగే వెన్నెలలా

కదిలే తననూ, తన పూజిత పాదాలనూ
తన అల్లికల పాదాల కదలికలనూ
అబ్బురపడే పిల్లి కళ్ళతో గమనించాను-

రాత్రి ఆకాశపు అద్దాన్ని మంచుతో తుడిచినట్టు
ఒక పాత బనీనుతో తను నా గదిని
తన శ్రమతో అడవులని తడిపిన తుంపరలా
కడిగివేసింది: అంత సమయమూ నేను

రెండు కాళ్ళ చుట్టూ రెండు చేతులు చుట్టుకుని
నా జీవితం కళ్ళల్లో మెరిసే దయతో
తననూ, తన పాదాలనూ తన ముఖాన్నీ గమనించాను
బహుశా ఒక కుక్కనై ఉంటే, ఆమె ఆజ్ఞలను దాటి
ఆమె పాదాలను సంతోషంతో నాకి ఉందును: తన
చుట్టూతా ఎగురుతో గిరీకీలు కొట్టి ఉందును-

ఆ తరువాత ఆమె అంది: " అప్పుడే కిందకి దిగకు
గది తుడిచాను, తడి ఆరాలి కదా-"

అవును. తడి ఆరాలి. అది నిజం. అదే నిజం

అందుకే ఇప్పటికీ యిక నేను
గదిలోని నేల వైపు చూస్తాను

తను లేని నేల వైపు - నేనపుడు గమనించని -
తను వొదిలి వెళ్ళిన నెత్తురు
పద పాద ముద్రికల వైపూ
వాటిపై తడారుతున్న నా వైపూ
ఇప్పటికీ నేను పాదం మోపలేని
తను లేని నేల వైపూ-

పగటిపూట పాదాలు*

పగటిపూట పాదాలు జ్ఞాపకం వొస్తాయి. అందరి మధ్యా వొంటరిగా కూర్చున్నప్పుడు, ఉదయం సమస్థం శబ్ధ ప్రపంచంలోకి ఉలికిపాటుతో మేల్కొంటున్నప్పుడు, మరో గదిలో పారాడుతున్న నీ పాదాల మెత్తటి చప్పుళ్ళ నీటి తడి మూసుకున్న నా కళ్ళ కిందుగా ఊరుతుంది.

మరో ప్రదేశంలో కూస్తున్న తపించే పక్షి పాటలానూ, సూర్యరశ్మిని మంచులా కప్పుకున్న అరణ్యాల కింద కనపడని సెలయేర్లు చేసే సన్నటి నవ్వులాంటి మెత్తటి చప్పట్లలానూ, కిటికీలోంచి గోడ గడియారం కిందుగా అల్లుకున్న ఎండలో హడావిడిగా కదిలే పిచ్చుకల కళ్ళలానూ గదంతానువ్వుతిరుగాడుతున్న నీపాదాల సవ్వడి.

నువ్వు తేనీరు పెట్టుకుంటుంటావు. నువ్వు దుస్తులనీ, దుప్పట్లనీ మడత వేస్తుంటావు. రాత్రి నేను రాసుకున్న కాగితాలూ గదంతా చిన్నపిల్లల్లా చిందరవందరగా అల్లరిచిలలరిగా గెంతుతుండగా వాటి చెవుల్ని మెలేసి బల్లపై పెడుతుం టావు. ఇంటి వెనుక తొట్టిలోంచి బుడుంగున నీళ్ళు ముంచి, స్నానానికై, పాలు దించిన పొయ్యిపై పెడుతుంటావు. ఆపై మధ్యలో గదిలోకి ఒకసారి తొంగి చూసి నన్ను లెమ్మని కేకేస్తావు. దర్గాలో హటాత్తుగా కదిలి, అంచు నుంచి నేలపైకి ఎగిరివచ్చే పావురంలా, నీస్వరం, సీతాకోకచిలుకలా సంధ్యకాంతిలోఎగిరే తూనీగలానూ నా వద్దకు వస్తుంది.

కళ్ళు మూసుకుని నేను చూస్తున్నదంతా ఒక స్వప్నమా? ఇంతకుముందే గడిపిన మరో ప్రేమైక జీవితమా?

తొలగిన దుప్పటిని తిరిగి చెవులదాకా లాక్కున్నట్టు, జీవితం తన గోరువెచ్చనితనమంతటతోనీ నన్ను కప్పుకుంటుంది. మూసుకున్న కళ్ళతోనే, పలుమార్లు నువ్వొచ్చి దుప్పట్లో నా నిదురలో నిదురించిన జ్ఞాపకమూ తడుతుంది. యిక తరువాత పగటి పూట పాదాలు ఏమీ లేని సాయంత్రలగానూ, నిదురలేని రాత్రిళ్ళగానూ మారతాయి. అనేక సంవత్సరాల తరువాత, తన్నుకులాడిన చీకట్లలోంచి చిటపటలాడే వెలుతురులోకి మేల్కొన్నతరువాత, నేను యిక పల్లేలో పెరిగి పట్నపు రహదారులలో తడబడే ఎద్దుని. అందుకని, యిక ఎప్పటిలాగే

నాలుగు రోడ్ల కూడాలి వద్ద నిలబడి, భుజంపై వేలాడే సూర్యుడి కాడిని దించి, తిమ్మిరెక్కిన ముఖాన్నిఅరచెతుల మధ్య రుద్దుకుని సలుపుతున్న భుజాన్ని విధుల్చుకుని జేబులో మిగుల్చుకున్న ఆఖరి బీడీని వెలిగించుకుని, మళ్ళా మరొక రోజులోకి, నీ పాదాలు లేని మరోక సమయంలోకీ అద్రుశ్యమవుతాను.

04 March 2012

రాత్రంతా

నేను తాకలేని చీకట్లో దాగి నీ ముఖం
చంద్రకాంతి పడి కాగితం

కానరావు నాకు /స్పష్టతతో-

యిక రాత్రంతా
చీకటి చెమ్మ తాకిన బరువుతో
లేత గడ్డిపరక
నా కళ్ళల్లో ఊగుతూనే ఉంది-

వ్యాఖ్యానం

నా మధుపాత్రలో నీవు
నీ మధుపాత్రలో నేను:

వర్షం లేని రాత్రుళ్ళలో
నేను నిన్ను తాగాను
నువ్వు నన్నెత్తుకుని
దింపకుండా తాగావు

హృదయం తేలికయ్యింది. శరీరం
నీలి మేఘమయ్యింది, జల్లయింది
ఇంకొంత కాలం జీవించవచ్చన్న
ప్రేమో, నమ్మకమో నవ్వో కలిగింది-

యిక నిండుగా మత్తిల్లి, అరుచుకుంటూ
ఏవేవో పాడుకుంటూ ఇళ్ళకు చేరే వేళల్లో

ఎవరిదో చేయి మన నుదిటిన లేపనం అయ్యింది
ఒక లేత నిద్ర వింజామరలతో ఆహ్వానం పలికింది

స్నేహితుడా, నేను ఉన్నందుకూ

నువ్వు ఉన్నందుకూ, మధువు ఉన్నందుకూ
జీవితం ఇచ్చిన ఆ విశ్వదాతువికి కృతజ్ఞతలు-

02 March 2012

ఒకప్పుడు

ఒకప్పుడు పగలంతా ఈ నగర రహదారులలో
జీవన వేటలో చనిపోయాను, చంపబడ్డాను

ఒకప్పుడు రాత్రంతా నీతో కలిసి నీలో నీలా జన్మించాను

యిక ఇప్పుడు నేను బ్రతికి ఉన్నానో, చనిపోయానో
కదిలే ఒక స్మశానంలానో, చూసే ఒక సమాధిలానో

ఎలా మారానో, నాకే కాదు
నా తల్లికీ తెలియడం లేదు-

ఎలా అడగటం

కన్నీటి నేత్రాలతో కదులుతోంది
ఒకప్పటి ఒక తెల్లని లోహపు తెర

తెరిచిన తన వొంటరి అరచేయిని
వీచే ఏ గాలీ తాకదు, అందుకోదు

నీ సిగలో వడలిన గులాబిది
ఏ రంగో నాకు ఇప్పటికీ జ్ఞాపకం లేదు

పగిలిన అరిపాదాలే గుర్తున్నాయి
నూనె రాసిన ఆ రాత్రుళ్ళలోంచి-

నీ పెదాలే గుర్తుకు లేవు ఇప్పటికీ

'నీళ్ళు ఇవ్వు కొద్దిగా' అని వొణుకుతూ
నువ్వు అలసటతో అడిగిన
చెమ్మగిల్లిన మాటలే గుర్తున్నాయి
మండే వేసవి దినాలలోంచి

పగలోక రెపరెపలాడే శ్వేత వస్త్రం
అప్పుడు నీకూ నాకూ
రాత్రొక విలవిలలాడే నీలి కుబుసం
అప్పుడు నాకూ నీకూ

కురియలేదు ఎన్నడూ చిన్ని వాన
వికసించలేదు ఎన్నడూ చిట్టి పూవు

వెన్నెలని తాకలేదు
పక్షులతో ఎగరలేదు
అప్పుడు నువ్వూ నేనూ - అందుకనే

లోహపు తెరలతో నీటి నేత్రాలతో
నువ్వు వొదిలివేసిన నీ అరచేయ్యే
మిగిలింది ఇక్కడ యిక ఇప్పటికి నాకూ నీకూ- ఇంతకూ

వెళ్ళిపోయినవాళ్ళని, వెళ్ళిపోయి మళ్ళా
ఎక్కడో తటాలున ఎదురుపడ్డ వాళ్ళని
'ఎలా ఉన్నావూ?' అని ఎలా అడగటం?

01 March 2012

నీకు సంబంధం లేని...

శిఖరం విరిగి
సరస్సులో పడిన ప్రకంపనం

వలయాన్ని చుడుతూ
వలయాలు, వృత్తాలుగా-

శిరస్సూ విరిగి
అరచేతులలో పడిన శిక్షణం*

కొలవలేవు ఆ వృత్తాలను
కనుగొనలేవు ఆ ఆదిమ
వలయ చలన బిందువును

ఆ చూపుడు వేలుతో ఎవరో
నుదిటిని దింపిన పదునైన
సన్నటి చిర్నవ్వు అంచును-

ఇది రాత్రుళ్ళు నన్ను
అవిశ్రాతంగా వేటాడే
అమృత విషసమయం

వెళ్ళిపో ఇక్కడనుంచి: నేను

నిదురిస్తానో, నిద్రమాత్రలతో
మధుపాత్రలతో తూగుతానో

నీకేం సంబంధం? నువ్వు చదివే
ఈ పదాలతో నీకేం అనుబంధం?

______________________________
శిక్ష+క్షణం = శిక్షణం: శిక్షించబడిన క్షణం, శిక్షా క్షణం.