31 October 2011

అద్దంలో చిన్నపిల్ల

అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటుంది
చిన్న పిల్ల: ఏమి కనిపిస్తుందో ఏమో మరి

ప్రతిబింబంలో! నవ్వుకుంటోంది తనలో తాను
మాట్లాడుకుంటోంది తనతో తాను
రెండు జడలని భుజాలపైగా వేసుకుని
మురిసిపోతుంది తనలో తాను

నుదుట బొట్టు బుగ్గన చుక్క
పరికిణీ గౌనూ జడలో పూలు

ఏం జరిగిందో ఏమో మరి అద్దంతో చిన్నపిల్ల

అద్దం వద్ద నుంచి ఆవరణలోకి
ఆవరణలోంచి వీధిలోకీ మళ్ళా

వీధిలోంచి ఇంటిలోకీ హడావిడిగా
పరిగెడుతుంది: చేతికి చిక్కకుండా
చిన్ని చుక్క చక్కగా పారిపోతుంది

తన పాదాల వెంట పిచ్చుకలు
తన స్వరం వెంట కోకిలకిలలు

తన చూపు వెంట విరిసిన పూవులు
తన తనువు వెంట
నువ్వు ఇంతకాలం సాగిన దారులు

ఏం కనిపిస్తుందో ఏం వినిపిస్తుందో
ఏం మరిపిస్తుందో మరి

నిన్ను ఒక అద్దాన్ని చేసి తన ముఖాన్ని
అందులో చూసుకుంటుంది

అంతలోనే నీ చుట్టూతా గెంతుతుంది
అంతలోనే నీ చుట్టూతా ఆడుతుంది
అంతలోనే పదాల జల్లై నీ చుట్టూతా

హాయిగా
జారి రాలిపడుతుంది
అంతలోనే నీ వొళ్ళో చతికిలబడి
మెడ చుట్తో చేతులు వేసి
కలువ పూవుల హారమై

నిన్ను అల్లుకుపోతుంది

నీలో మురిసిపోతుంది గారాలుపోతోంది
నీకు అందని గగనమైపోతోంది

అద్దంలో
తన ముఖాన్ని చూసుకుంటుంది
చిన్న పిల్ల: ఏమి కనిపిస్తుందో ఏమో మరీ

నీకు తన ప్రతిబింబంలో
తనకు నీ ప్రతిబింబంలో

ఆగి ఆగి నవ్వుతోంది
ఆగి ఆగి కరిగిపోతోంది
అద్దంలోకి మాయమౌతోంది

ఒంటరిగా ఒక్కతే
అద్దంలో అద్దంతో చిన్నపిల్ల.

పగలు

పగలు నీలా ఉంది. నీలి గుబులుగా
నీటి నీలంగా మారింది

కొమ్మలపై రెండు పిచ్చుకలు
పిచ్చుకలలో నా కలలు
చూడరు ఎవరూ వినరు ఎవరూ

రహదారిని దాటే నన్ను
పుచ్చుకునే అరచేయి నీదేనా?

అంధుడి నయనాలు అద్దాలని
దాటలేవు. ప్రతి ప్రతిబింబాన్ని
ప్రతిష్టించలేవు

పగలు నాలా ఉంది. నీలి బెంగగా
ఎదురుచూసే నల్లని కళ్ళగా
రెండు చూపుల మధ్య దూరంగా
దాహంగా మారి ఉంది.

నింగి అంత ఎండలో నీ అంత నీడలో
ఇన్ని నీళ్ళు దొరికేదేక్కడో

చెప్పు నువ్వైనా? ఎలా అయినా:

29 October 2011

మన్నించు

మన్నించు: అంటే ఏమిటి?

మన్నన లేని నాలికపై
మనుగడలేని గృహాలు: శిధిలాలలో
శిధిల కర్మాగారాలలో
నయన ముద్రణాలయాలు.

మాట్లాడకు: రెండు కాగితాల
మడతలలో ఒక పదం
శతాబ్ధాల నేరం. నువ్వూ లేవు
నేనూ లేను. ఎటూ ఎటువైపు.

తరువాత అతడు
అతడి తరువాత అతడు
ఆమెనే రాసాడు ఎప్పటికీ
ఆమెనే రాస్తాడు ఇప్పటికీ=

ఇక ఎవరూ మన గురించి
అస్సలు మాట్లాడలేదు:

వెళ్దామా మనం ఇక
మన్నిక లేని ఈ
మన్నించుల మతాల నుంచి?

త్వరగా

త్వరగా రా. పుల్లలతో అల్లిన గూటిలో

లేత ఎరుపు రెక్కలతో పావురపు పిల్లలు
నల్లటి ముక్కులతో చూస్తున్నాయి

కదలక మెదులతో కళ్ళలోని లోకాన్ని
చూపిస్తున్నాయి పిల్లలకీ
పిల్లలతో నిలబడ్డ తల్లికీ=

గింజలతో తల్లి తల్లితో గాలీ
గాలితో రాత్రీ రాత్రితో శాంతీ

ఎక్కడ ఆగిపోయి ఉన్నాయి
ఇవన్నీ? ఇవి అన్నీ? త్వరగా

రా: అద్దంలోంచి అద్దంలోకి
ప్రయాణించే అపరిచితుడు

తన తనువుకై తన గాజు దుస్తులను
మార్చుకునే వేళయ్యింది.

అసూయ

ఎలాగూ చెప్పలేవు ఎలాగూ విప్పలేవు

నిన్ను నీ ఇంటికి తీసుకువెళ్ళే దారులు
ఎప్పుడూ ఎక్కడా లేవు

హృదయాన్ని చీల్చి లాగిన అక్షరాలే
ఉంటాయి నీతోటి నీ బాటలో:
నువ్వే ఉంటావు వాటి నీడలో

వాటితోనే ఏడుస్తావు వాటితోనే నవ్వుతావు
వాటితోనే ప్రేమిస్తావు వాటితోనే ద్వేషిస్తావు
వాటితోనే పడుకుంటావు వాటినే కలగంటావు
వాటినే నటిస్తావు వాటినే ధరిస్తావు

అటు తిరిగిన పదాన్ని ఇటు తిప్పి
ఒక కొత్త భాషను కనుగొన్నట్టు సంబరపడతావు
మెలుకువలో కొంత స్వప్నావస్థలో కొంత
కొన్ని రంగులను అద్దాలకు అంటించి
ఒక కొత్త ప్రతిబింబాన్ని సృష్టించినట్టు ఊగిపోతావు

వాటినే మోహించాలి వాటినే రమించాలి
వాటినే నమ్మాలి వాటినే అమ్ముకోవాలి
మట్టిలా వాటినే తలపై పోసుకుని
సప్తలోకాలలోకి దూసుకుపోవాలి

ఇది వినా ఇంత కన్నా మరో దారి లేదు
ఇది వినా ఇంత కన్నా మరో దీపం లేదు

నిన్ను నీ ఇంటికి తీసుకువెళ్ళే దారులు
ఎప్పుడూ ఎటూ లేవు
నువ్వెటూ వెళ్ళలేవు

వేసుకున్న ముసుగుల గురించి
అడిగింది ఎవరు? వేచి ఉన్న
మృత్యువును చూసింది ఎవరు?

చూడు. చూస్తూ రా ఇటు.

ఈ వాక్యం అంచున దాగి ఉన్న
పద సమాధి మన ఇద్దరిదే:

27 October 2011

నెమ్మది, నెమ్మది

నెమ్మది నెమ్మది
వాళ్ళు పరిగెత్తినట్టు
నువ్వెలా నర్తిస్తావు ?
వాళ్ళు నవ్వినట్టు ఏడ్చినట్టు
నువ్వెలా ఎలా మాట్లాడతావు?

నెమ్మది నెమ్మది
సుతిమెత్తని బెరుకైన

రంగుల పూవులు
పూవుల ఆటలు:

ఆటలలో పిల్లలు
పిల్లలలో ఆటలు

అలసట లేని వర్షాలు
అలసట లేని పదాలు

నెమ్మది నెమ్మది
నెమ్మది నెమ్మదిగా

వాళ్లు గీసినట్టు చిత్రాలను
చేలను నువ్వెలా గీస్తావు

వాళ్ళు చెప్పినట్టు కథలని
నువ్వు ఎలా చెబుతావు?

చందమామా కుందేలు
రారాజులూ రాక్షసులు
వెన్నెలలో వేటగాళ్ళూ
పొదలలో పిట్టలూ పిక్

పిక్ పికల శబ్దాలు

కథలు కావాలి కథలు
కథలే కావాలి: కడవరకూ.

కాలం అంచుల వరకూ
పదాలు పోయేవరకూ.
కలలే కావాలి
కథలే కావాలి

నిద్ర పుచ్చకు
అసలే లేపకు:

కథలైన పిల్లలకి
కలలైన పిల్లలకి
రంగులైన పూలకి
పూలైన పిట్టలకి=

రాత్రీ దాత్రీ అనంత విశాల మైత్రీ
వాళ్ళదే: పిల్లలైన వాళ్ళ పాపలదే

నిద్రోస్తుందా? కనులలోకి
కౌగిళ్ళను పంపించాల్సిన

సమయమిదే:
నెమ్మది నెమ్మది
నిదురపో: దీవేనలలో
దివ్యకాంతిలో కరిగిపో.


26 October 2011

మిత్రుడి(కి) కూతురు(కి)

గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోతోంది నీ పాప

పరిగెడతావు తన వెనుక తను
ఎక్కడ చేజారిపోతుందా అని:

గాలిలో వానలో ఎండలో నీడలో
చినుకులని కురుల అంచులతో విసిరివేస్తూ
రివ్వున దూసుకుపోతుంది నీ పాప

అవి తన తెల్లని పాదాలా గాలికి తేలికగా
సాగిపోయే మేఘాలా తెలియదు నీకు

పూవుకి సీతాకోకచిలుక రెక్కలొచ్చినట్టు
సీతాకోకచిలుకకి పూపరిమళం అద్దినట్టు

ముత్యాలు వెదజల్లినట్టు నవ్వుతో
అందకుండా ఆగకుండా చూడెలా
తూనీగలా చేపలా గాలిలో నీటిలో
నేలపై నింగిలో ఎలా తేలిపోతోందో:

మనమెలాగూ తారజువ్వలని పట్టుకుని

నక్షత్రాల పందిరిలోకి వెళ్ళలేం ఇక
మనమెలాగూ కాకరపువ్వొత్తులని
అరచేతుల్లో వెలిగించుకుని
రాలే రంగుల గుత్తులం కాలేం ఇక

మనది కాని ఆనందం అది
మనం వొదిలివేసుకున్న లోకం తనది
మనం గుర్తుకు మాత్రమే తెచ్చుకోగల
సమయం సందర్భం తనది

ఇక ఈ పూట తూనిగలకు దారం కట్టొద్దు
ఒక ఈ పూట చిలుకలను
పంజరాల్లో ఉంచొద్దు. ఇక
ఈ పూట పూవులను గాజుపాత్రలలో
అలంకరణగా మార్చొద్దు:

తన వెనుక పరిగెడుతున్న నీ వంక
తలతిప్పి చూస్తో చేయి చాపి పిలుస్తో

నువ్వు అత్యంత ప్రియంగా రాసుకున్న
నీ వేళ్ళ మధ్య నుంచి జారిపోయిన
గాలిలోకి కొట్టుకుపోయిన కాగితంలా

ఎగిరిపోతో ఆటలోకి పారిపోతో నీ పాప
నవ్వుతోంది. తనవెంట రమ్మంటోంది:

వెళ్లగలమా మిత్రుడా నువ్వూ నేనూ

తన వెంట తన పాదాల వెంట
తన పసి పసిడి పదాల వెంటా?

25 October 2011

ఎందుకంటే

విషయాలు ఇక్కడదాకా వచ్చాయి

రాత్రుళ్ళు సూర్యసింహాన్ని
ఖైదు చేసింది ఎవరు?

అతడు ఆనాడు పిల్లలకి
తాబేలును చూపించాడు
పిల్లలు దానిని ఆకుపచ్చ
చేప అని అనుకున్నారు

అతడు అన్నాడు: నేలపై
నీటిలో బ్రతుకగలదు అది.

వాళ్ళు అన్నారు: మరి అది
నింగిలో ఉండగలదా?
నేలలో ఆడగలదా అని.

ప్రతిరోజూ పౌర్ణమి
ఎలా సాధ్యం?

ఎవరినీ అడగకు

అదేమిటంటే
విషయాలు ఇక్కడదాకా వచ్చాయి
కాబట్టి రాత్రిశాలలో

విశ్రమించిన సూర్యస్వప్నం
జూలు విదిల్చి కదలగా

ఇక పిల్లలు బడికి వెళ్ళారు
ఇక అతడు పనికి వెళ్ళాడు:

ఎందుకంటే

కథలని మించిన జీవితం
కథలు కాని/కానీ జీవితం

ఏముంది ఎక్కడుంది?

24 October 2011

కుబుసం

సర్పపాదాలు నీవి సర్ప గమనాలు నీవి

దూరాన్ని దూరం తగ్గించదు
దాహాన్ని దాహం తీర్చదు:
అరచేతులలో అచ్చంగా దాగినది
అ/మృతమో విషమో తెలియదు

సర్పాలు అల్లుకుని నవ్వే
తియ్యటి విషపెదాలు నీవి

శిధిలాలని శిధిలాలలతో నింపలేవు
మొదలుని చివరితోనూ
చివరిని మృతువుతోనూ

పూడ్చలేవు. పూరించలేవు

అరచేతుల మధ్య రేఖలలో
రాయబడినదీ రాసేదీ
ప్రేమో ద్వేషమో తెలియదు

సర్పనయనాలు నీవి
సర్పవాలు చూపు నీది

చేతులు చుట్టూ తెల్లటి సర్పాలు అల్లుకుని
మెడ చుట్టూ తెల్లటి సర్పాలు వంకీలు చుట్టుకుని
పెదాలని నాలికతో సర్పమైమరుపుతో
తడితడిగా మార్చే తెల్లటి సర్పాల పదాలు:

నాదస్వరం వినని
నాగస్వరం తెలీని
నాదైన స్వరం:
కాలకూట విషం
లలాట లిఖితం.

కుబుసం విప్పే విడిచే
సర్పవెన్నెల వేళల్లో
రహస్యం చెప్పేందుకు

నువ్వు ఎవరు? నేను ఎవరు?

సర్పజ్ఞాన చరిత్రలే అందరివి:
సర్ప పరిమళమే అందరిదీ:

కోరకు. ఆగకు.
అరవిచ్చిన వాక్యాన్ని
ఆదిలోనే ముడవకు

రక్తం నిండిన చేతులతో
పాపం నిండిన కనులతో
పవిత్రత నిండిన అపవిత్ర నినాదాలతో
అతడు వస్తాడు:

=ఇక ఆ తరువాత
దేవతల గురించి
ఎవరూ మాట్లాడరు:

ఒక నల్లటి శిల్పం మాత్రం
గాలికి ఊగే ఎర్ర గులాబీతో
అనంతం దాకా వేచి
ఉంటుంది నీకోసం:

ఇక ఎప్పుడూ ఇటు రాకు
ఇక ఎప్పుడూ ఇటు వైపుకు చూడకు=

శ్వేతసర్పాల ప్రాచీన నృత్యం
ఇప్పుడే మొదలయ్యింది:

మరి. మరియొకసారి. మరి
ఒక్కసారి.

23 October 2011

రాసినది

మునుపు రాసినది రాత్రంతా
తిరిగి రాయబడింది

తన కళ్ళతో తన
తనువు కళ్ళతో పసిపిల్లలతో
కాగితం కలవరమైపోయింది

పూలగుత్తులతో
పూలగుర్తులతో వెళ్ళు వాళ్ళ వద్దకి
అప్పుడప్పుడు ఇప్పుడూ:

నువ్ లేక నువ్ రాక
వాళ్ళ హృదయాలలో రాత్రంతా
వర్షం కురుస్తూనే ఉంది

వెళ్ళు ఇంటికి ఇక : ఇక ఈ వేళ నువ్వు
చినుకుల చరిత్రని లిఖించవచ్చు
కన్నీళ్ళని తాగి బ్రతుకవచ్చు

(అమావస్యనాడు
వెన్నెలని ఆశించమని
ఎవరు చెప్పారు నీకు?)

21 October 2011

ఒకే ఒక్కసారి

నీపై దయయుంచిన కనులు

నీపై దయతో నిను తాకిన చేతులు
నీపై దయతో నీతో సాగిన పాదాలు

నీపై ప్రేమతో నీకై ఎగిరిన రొమ్ములు

నీపై ప్రేమతో నిను బంధించిన తన చెరసాలలు
నీపై ప్రేమతో నిను విన్న విసిగిన విన్నపాలు
నీపై ప్రేమతో నిను కన్న కన్నమ్మ భారాలు

నీపై సహనంతో అసహనమైన తనువులు

నీపై సహనంతో నిను వీడలేని గృహాలు
నీపై సహనంతో నిను హత్తుకునే పిల్లలు
నీపై సహనంతో నీపై ఓరిమితో
నిను వీడని వెళ్ళిపోయే తల్లితండ్రుల జాడలు

ఎవరివి ఇవి? ఎవరిచ్చారు ఇవి?
బహుమతిని అనుమతిగా నీకు
కళ్ళని నల్లని కన్నీళ్ళలో ముంచి?

సరస్సు లోతులో దాగిన
స్వర్ణ మీన నయనంలో ఉలిక్కిపడే ఆకాశం
నీ స్వనిర్ధేశిత విషాదం:

కారణమడగకు: కన్నీరుంకిన కరుణలో
రణమెందుకని అడగకు.
రుణాలు లేవు పదాలకు
ఊహలు లేవు చింతలకు:

బలహీనతలతోనో ఆధారాలతోనో
నీపై ఆధారపడో లోకంతో రాజీపడో

నిన్ను వొదులుకోలేకో
నిన్ను మార్చుకోలేకో

నిన్ను బంధించిన నిన్ను పరిమితించిన
నిన్ను నియంత్రించిన అనుమతించిన

దయయుంచిన ప్రేమించిన సహించిన

ఆ స్త్రీ తనువు నిలువెల్లా వొణికిపోతోంది
ఆ స్త్రీ మనస్సు నిలువునా కాలిపోతోంది

పాపవలె ఎవరూలేని అనాధవలె
బేలగా ఎదురుచూస్తోంది.
రోదనని మునిపంటిన నొక్కిపెట్టి
నీకై తపించిపోతోన్నది:

వెళ్ళవా ఇంటికి ఒక్కసారి అబద్ధంగానైనా
నిజంగా ఒక్కసారి? ఒకే ఒక్కసారీ?

ప్రతీక

కరుగుతోంది లోకం
పచ్చటి ఎండలో

ఎగిరే నీరూ పారే గాలి
ఎదురొచ్చే నీలి నింగి

గలగలలాడే నీడలూ
తళతళలాడే గాజులు
తన చేతివే:

ముఖంలో ఇంద్రధనుస్సు
మాటలో మోహ వర్చస్సు

ఏడేడు లోకాలు
ఏడేడు రంగులు
ఏడేడు కాలాలు

తనవే: తన తనువువే.

ఏం చేయగలడు
ఇక అతడు?

పాద రక్షలని నా
పదాలవద్ద వొదిలి

అతడు తన హృదయ
మందిరంలోకి
అడుగిడాడు:

(శాంతి సదనమో
సమాధి చిహ్నమో

నువ్వూ నేనూ
తరువాత కలుద్దాం!)

20 October 2011

బాకీ

నాకొక మధుశాలని
కానుకగా ఇవ్వు

నేను నీకొక హృదయాన్ని
బాకీగా ఇస్తాను:

ఇక తిరిగి ఈ లోకం
వేధిస్తుందా మనల్ని?

ఇక

పూలకి చినుకులు
పక్షులకి మబ్బులు

అతడికి ఇతరుడు
ఇతరునికి తనువు
తన అణువణువు

ఇక నిన్ను వినేదెవరు?
ఇక నిన్నుకనేదెవరు?

19 October 2011

ప్రార్ధన

౧.
ఎవరు నీ కొరకు అమ్ముకొనుటకు
భూమిని చదరపు ముక్కలుగా చేసెనో
ఎవరు నీ కొరకు ఆకాశమును
ప్రాంతములుగా విభుజించి
నక్షత్ర ప్రసారంగా మార్చేనో
ఎవరు నీ కొరకు నీటిని
రూకలుగా మార్చి టిన్నులలో అమ్మెనో
ఎవరు నీ కొరకు వదనాన్ని
తెరలపై వ్యసనంగా మార్చేనో
ఎవరు నీ కొరకు రక్తప్రీతితో
చమురు దాహంతో యుద్ధాన్ని క్రీడగా
ప్రసార మాధ్యమ వేడుకగా మార్చేనో

అట్టి వానికి స/మానవులు నెవ్వరూ లేరు
అట్టి వానిని ఎన్నడూ విశ్వసించకు

***
రాయలేను నిన్ను నిన్నులాగా

కొలనులోంచి జాబిలి
కొమ్మలలోకీ కలలలోకీ కదిలే వేళ
పలుకలేను నిన్ను నీలాగా:

దుస్తులు వేసుకో
నేత్రాలని కప్పుకో
ఇతరున్ని తప్పుకో

నిన్ను నిన్నులా రాయని నిన్నటి
రేపటి నీవైన చేతులు సాగుతాయి
నీ రొమ్ముల దాకా
నీ పాదాల దాకా=

పసి పాదాలు పెంచిన
దారీ దూరం ఏదీ లేదు

ప్రాచీన భాండాగారాలలో
నువ్వు జోక్యం చేసుకున్న
సత్యమేమీ లేదు

చూపులని చూపులతో తప్ప
వెనుతిరిగి చూసే కాలం లేదు
కనుమరుగు కాని తీరం లేదు

పాలు నిండిన కన్నీళ్లు
కన్నీళ్లు నిండిన పదాలు
పదాలు నిండిన పెదాలు

సౌమిత్రీ స్మృతీ విస్మృతీ

నీ అ/శరీరం ఎక్కడ?
నీ పర/మ/పద
మాతృ నేత్రం ఎక్కడ?
నీ నేత్ర నాట్యం ఎక్కడ?

స్మృతీ విస్మృతీ ధరిత్రీ

రాయలేను నిన్ను నీలాగా
కనీసం నాలాగా
కనీసం నలుగురి లాగా:

ఏడవకు: ఏడ్చే అరచేతులకు
నువ్వు తప్ప ఎవరున్నారు?
నవ్వే నవ్య వదన బింబాన్ని
నువ్వు తప్ప ఎవరు తాకారు?
రాత్రిలో పూచిన పూవును
నువ్వు తప్ప ఎవరు చూసారు?

కౌగలించుకో తల్లీ తల్లులనీ
తల్లులు లేని తండ్రులనీ
తండ్రులు లేని పిల్లలనీ
వాళ్ళ ఆదిమ ఆర్తిహస్తాలనీ

ఒడిలో గర్భబడిలో దాచుకో
మదిలో మరువక ఉంచుకో
నీవైన నిన్ను హత్తుకున్న
పసి కథలనీ పసి కనులనీ:

జాబిలిలోని కొలను
నింగిలోకీ నీడలలోకీ కదిలే వేళ
రాసుకుంటావు నువ్వు

నిన్ను నీలాగా నిన్నులాగా:

పవిత్ర పాపంతో కదిలే లోకంలో
దారి తప్పిని దారిలో
తిరుగాడే తిరిగిరాని సంచారిలో

శిధిలాలలో శిలలలో
కడలిలో అర్థకూడలిలో
స్థంబించిన పదాలతో

నీకేమి సంబంధం ?
నీకేమి అనుబంధం?

***

చీకటికి వెలుగూ వెలుగుకి చీకటీ
కడలికి భూమీ నీటికి నేలా అని
పేరు పెట్టినది ఎవ్వరు?

అంతర్జాతీయంగా అమ్ముకొనుటకు
ఎవరు నిన్ను భూమిగా మార్చేనో
చీల్చుటకు ఎవరు నిన్ను
నిత్యప్రసారంగా చేసెనో చీకట్లలో ముంచెనో
ఎవరు నిన్ను లోహపు రహదారులలోకీ
చదరపు గదులలోకీ
శరీరాలులేని అంగాలలోకీ రూపాంతరం
రూప అంతరం కావించెనో

అట్టివానికి స/మానవులేవ్వరూ లేరు
అట్టి వానిని ఎన్నడూ బ్రతుకనివ్వకు

***

(ఆమెన్: ధన్యవాదములు. ఇచ్చిన
మృత్యు బహుమతి శిధిలాలు

ఏకసార్వబౌమ కథనాలు నెవ్వరివో
ఇంకన్నూ చెప్పవలయునా?)

18 October 2011

ఈ దిన/చర్య

ఇంకేం చేయను? ఇంకేం కాను?
౧.
దరికి చేరిన దారిలేని పూవును
దరికిరాని మునుపు లేని
ముందు చూపునూ కలిసాను.

పలికిన పలుకుల వెనుక
ఉన్నదెవరు? పలుకని
పదాల అర్థం చెప్పేదెవరు?

౨.

దారి లేదు. దరిదాపులో
శాంతి లేదు. భీమా
ఎటూ లేదు ఎవరికీ రాదు.

దారం మార్గం లేని ప్రాణంకి
ఒక ఆధార అధరం
కాగితంపై చివికే చిరిగే చిహ్నం

ఎవరికో ఎందుకో
ఎవ్వరూ ఎవ్వారికీ
ఎన్నటికీ ఎప్పటికీ

చెప్పరు. కాక కాలేక
కాకుండా చెప్పరు
కాక చెప్పరు. ఎవరూ:

౩.
ఒంటికాలితో జ్ఞానసరస్సులో
ఒక్క కన్నుతో
ఒక్క కాలంతో

ఏక వాక్యమైన అను అ/నేక
ఏకవాక్యానికి సాధన చేసాను:

తను ఎందుకు ఏడ్చిందో
తను ఎందుకు తననూ
తన బిడ్డనూ చంపుకుందో

జ్ఞానమైన పరకూడలి
వాక్యమేదీ చెప్పలేదు
రహస్యమూ విప్పలేదు

తన కన్నీళ్ళే ధారగా
దూరంగా దరిచేరి
రాలుతున్నాయి
అనాదినుంచి:

పసిశిశువుకి పాలిచ్చేదెవ్వరు?
పాపకు కథలు చెప్పి
నిద్ర పుచ్చే దెవ్వరు?

౪.

స్నేహితులగురించి యోచించాను
రాత్రుళ్ళ గురించి తర్కించాను:
నీడలైన స్త్రీల గురించీ, జాడలైన
తండ్రుల గురించీ వివరించాను

వదనాల గురించీ
వ్యసనాల గురించీ

స్మృతులలో సంచరించాను
మృతలలో తరించి, చెందని
మృతి వి/స్మృతి వంటిదని

విస్మరించి నెత్తురు గులాబీని
ఛాతిలో ధరించాను
రాళ్ళను కళ్ళల్లో చెలమలతో
ముళ్ళతో నిర్మించాను

కొన్ని చిత్రాలను రచించి
కొన్ని శిలలను మోహించి
కొన్ని కలలను చీల్చి చీల్చి

పై పదాలను పదాలతో
పెదాల మధ్య ఇమడని
అన/ర్థాలతో పూరించాను.

౫.
ఇంకేం కాను? ఇంకేం చేయను?

ఇంకేం చేయనూ ఇంకేం కానూ
అను/కుంటో రాత్రిని మింగిన
రాత్రిఆకులలోకి వాన చినుకై

జారి చేజారి పడ్డాను
మరియొకసారి. మరి
ఒక్కసారి.

17 October 2011

ఇలా, మరోసారి

ఎవ్వరూ లేరు. ఎవ్వరూ ఉండరు

ఎదురుచూసే మొక్కలకి
నీళ్ళు పోసేది ఎవరు?
రాత్రిలో దీపం వెలిగించి
నిన్ను తుడిచి కాంతితో
నిన్ను నింపేది ఎవరు?

ఎవ్వరూ లేరు. ఎవ్వరూ ఉండరు

= వేచిచూసే వేచిచూసి
ప్రాణం విసిగెత్తి నీపై నీకు
అలసట కలిగి

విసిరివేయాలి శరీరాన్ని
శరీరంలోంచి తీసి
లాగి లాగి చించివేయాలి
నాలోని నన్నూ
నీలోని నిన్నూ=

దప్పికగొని కళ్ళు తడబడి
పాదాలు విడవడి
తూలుతున్నాను
రాలిపోతున్నాను.

నీళ్ళను అవే నీళ్ళను
ఇన్ని మంచి నీళ్ళను

నేను మరచిన నీళ్ళను
పోయావా నీ పదాలతో

ఈ చిట్లిన చీకట్ల
గొంతులో?

16 October 2011

చెప్పను

ఎవరికీ ఇవ్వలేదు. ఎవరికీ
తీసుకు వెళ్ళలేదు

పూలనైనా రాళ్ళనైనా
వాననైనా వెన్నెలనైనా

ఎవరికీ ఇవ్వలేదు
తీసుకు వెళ్ళలేదు

నువ్వు ఉంటావని తెలియదు
నువ్వు లేకపోయినా తెలియదు
లేనితనాన్నీ, లేనితనపు
తనువునీ

ఎలా పట్టుకోవటం?
ఎలా కనుక్కోవడం?

అదే పరిమళం తెస్తోంది
నీ ముఖాన్ని
నా తిరిగే పదాలలో:

జాడని వెదకలేను
నీడలలో మిగిలిపోలేను

వచ్చిపో ఒకసారి.
సమాధిపై పూలు

నిన్నే తలుస్తున్నాయి
వీచే గాలిలో ఆకులలో:

నువ్వు వచ్చావన్న సంగతి
నువ్వు వెళ్ళావన్న సంగతి

ఎవరికీ చెప్పను
ఎవరికీ ఇవ్వను

ఎప్పుడు వస్తావు నువ్వు?

చూసారా మీరు

(నిన్ను ఏమీ కోరలేదు
నిన్ను ఏమీ కోరుకోలేదు)

నీ నుదిటిపై ఆనిన అరచేయి
అప్రతిహతంగా ఆవిరవ్వుతుంటే
ఏం చేస్తావు నువ్వు?

నిన్ను ఏమీ కోరలేదు
నిన్న ఏమీ కోరుకోలేదు

ఒక చేయి సర్పం కావొచ్చు. ఒక నాలిక బుసలు కొట్టవచ్చు.
ఒక చూపు ఒకే ఒక్క చూపు
నిన్ను విసిరికొట్టవచ్చు=

నిన్ను ఏమీ కోరుకోలేదు. నిన్ను ఎన్నడూ
ఏమీ ఆశించలేదు. లేదు లేదనక నిన్ను
ఎన్నడూ విడవలేదు

విచ్చుకునే పూల హృదయాల్లో మౌనం. దారిపక్కన వాలిన సీతాకోకచిలుకల్లో
నువ్వు ఎన్నడూ చూడని శోకం. గాలికీ కాంతికీ రాలే ఆకుల్లో
నువ్వు నిత్యం వినే శాపం. ఎవరిదీ విజ్ఞాన విష విలాపం? తెలుసు నీకు

నిన్ను ఏమీ కోరలేదు
నిన్న ఏమీ దాచలేదు

ఒక రాత్రి. ఒక భ్రాంతి.
ఒక నేత్రం ఒక శాంతి
ఇంతకు మించి

ఏమీ కోరలేదు నిన్ను
ఏమీ అడగలేదు నిన్ను

ఎక్కడికీ వెళ్ళలేదు నేను
ఎక్కడికీ వెళ్ళటం లేదు
నువ్వూ. దాచిన పదాలలో
దాగిన శాసనాలు:

స్మృతి లేదు ఇక . ఇతర
రాత లేదు ఇక . రాదిక.

ఇక వలయంలోకి
వలయమై వెళ్ళే
మధుమోహిత దారిదే ఇక.

పూలతో ముళ్ళతో పురుగులతో మృగాలతో
చేపలతో మొక్కలతో నిప్పుతో నీరుతో
నింగితో నేలతో కళ్ళ వెంబడి నీళ్ళతో

ఇటుగా వెళ్ళిన వాళ్ళని

ఎవర్నైనా చూసారా మీరు

ఎప్పుడైనా ఎక్కడైనా?

14 October 2011

ఒక్కసారి

(రెండు కళ్ళు మాయమౌతాయి)

మౌనం ఒక స్మృతి గీతం

నువ్వేమీ నాకు చెప్పలేనప్పుడు
నేనేమీ నీకు అందించలేనప్పుడు

మనం మన శరీరాల్ని
శరీరాలు లేని చోటికి

తీసుకువెళ్ళడమే మంచిది
మరణించినదాన్ని
మరణించనివ్వడమే మంచిది:

వెళ్ళిపోదాం అప్పటిదాకా

అద్దంలోంచి అద్దంలోకి అద్దాలతో
అద్దాల ప్రతిబింబాలతో
బొమ్మలతో బొరుసులేని తనతో:

=చితికి వెడుతో చింతిస్తో
చింతను గురించి చింతించి

ఏం లాభం? ఏం వరం?=

ఉండిపో అక్కడే
ఇక్కడైన అక్కడే

ఇక. ఒకసారి. ఒక్కసారి.

నేను నిన్ను పిలవను
ఇక. ఒకసారి. ఒక్కసారి.
ఒకేసారి.

ప్రధమ నేరం

ఇది నీ ప్రధమ నేరం కాదు
నాదీ కాదనలేను

తెల్లని గాజుగోళీలలో విశ్వమంత
కాంతిరహిత విసుగు లోకాలు

ఇది నీ కనుల ద్వితీయ నేరం కాదు
నా ప్రధమ శిక్ష కాదు

మనం మనతో విసిగిపోయాం
మనం మనతో

మనకి మనం దొరకనంత
దూరంగా జరిగిపోయాం:

జారిపోయిందీ ముఖాల్ని
అరచేతులలో కప్పుకుని
పారిపోయినదీ
విరిగిపోయినదీ

ఎవరూ అని అడగకు
ఎందుకు అని ఆశించకు
ఊహించకు చర్చించకు

పదం పదంతో విసిగి
శబ్ధం శబ్ధంతో పగిలి

మిగిలిన మహా నిశ్శబ్ధాన్ని
పూరించేది ఎవరు?

= మూర్ఖుడా! ముందే పలికిన
పదాన్నీ దాని జాడనీ
పరిహసించకు.
పరుల పాపాల్ని కీర్తించకు.

దిక్కులు దద్దరిల్లే చోట
పూలు వికసించే చోట
పసిపాదాలు నడిచే చోట
నవ్వులు నవ్వే చోట

నువ్వు ఉండకూడదు:

విలాపానికి లేని మిత్రుల
రూపాలలో విలపించిందీ
వలయమై మిగిలిందీ నువ్వే:

రాత్రిలో ప్రమిదె ఒక్కటే
వెలుగుతోంది ఒకటిగా:

ఇక చీకటికి తోడుగా
నీడలకి నీడగా

రాత్రంతా కరిగేదీ
రాత్రంతా మిగేలేదీ
రాత్రంతా రగిలేదీ

నువ్వే: వెళ్లిపోయేందుకు
భయం ఎందుకు?

13 October 2011

నవ్వినంత దూరం

నవ్వినంత దూరం
నడవలేదు
నువ్వు నాతో నేను నీతో

ఇరుకు కాలంలో
ఇరుకు జీవాలు:

పరిగెత్తీ
పరిగెత్తీ
పరిగెత్తీ

ఎక్కడా ఆగక
ఎక్కడా సోపక

ఇంకొంచం ధనం
ఇంకొంచం లాభం

కొంచెం కొంచెంగా
నెలవారీ సౌలభ్యం

ఒక కారు
ఒక ఇల్లు
ఇద్దరు పిల్లలు

కొంచెం పరువు
కొంచం గౌరవం

ఇంకొంచం నిలువ ధనం
ఇంకొంచం భూమి బలం

ఇంకా ఇంకా ఇంకా
ఇంకొంచం కొంచంకై
పరిగెత్తీ
పరిగెత్తీ
పరిగెత్తీ

ఎక్కడా ఆగక
ఎవరూ ఆపక

కొంచెం కొంచెంగా
ఇంకొంచంకోసం

కళ్ళలోని తడినీ
ఉండిన మదినీ

వొదిలి వొదిలి
విదిల్చి విదిల్చి

విసిగి విసిగి

హృదయాన్ని స్వహస్తాలతో
చంపివేసినది ఎవరు?

ఇక్కడో స్నేహితుడు ఉండాలి

ఇక్కడో మనిషి బ్రతికి
నవ్వుతో ఉండాలి:

చూసారా మీరు మీలో మీతో

నవ్వినంత దూరం నడిచిన

స్నేహ పాదాలని
ప్రేమనయనాలని?

12 October 2011

దారులు రాలిన పూలు

పూవులు రాలిన దారులలో నువ్వు=

శిశువుల నయనాలూ
గాలికి వీచే చిన్నటి తెల్లటి పూవులూ
స్త్రీల అరచేతులూ

ఇవన్నీ ఇవన్నీ ఒకటే. (ఒక్కటే.)
ఒకటైన ఒక్కొక్కటితో
నువ్వొకడివే నీ నీతోనే
నీలోని నీ మరొకరితోనే

మరి ఒక్కరితోనే
ప్రతి ఒక్కరితోనే ఉంటాయి
పూవులు రాలిన దారులు

వానల్లో వెన్నెల్లో
వాగుల్లో వంకల్లో

నక్షత్రాల్లో కరి మబ్బుల్లో
తెల్లటి మబ్బుల్లో పిట్టల్లో
రావిచెట్లల్లో ఎగిరే గాలుల్లో (ఉంటాయి)

పూవులు రాలిన దారులు

అవన్నీ అవన్నీ అవి అన్నీ

మంచుమైకం కమ్మిన
మట్టి దారుల్లో రాలిన

పూవులూ పూర్వపు దారిని
తాకలేని రేపటి చూపులు: (ఎవరివి?)


=చివరి పదం చివర
వర్షపద్మం పూసింది
మెరిసే తన కళ్ళల్లో:

చూసావా నువ్వది?=

ఆశించకు

లోహపు రహదారుల్లో
చెట్లు తాకలేని
కరుణరహిత కాలంలో

నిలువెల్లా నీళ్లకై నింగికి
చేతులు చాపిన మనిషి:

శాపం పాపం
నేరం ద్రోహం: ఇదే.

= మళ్ళా ఎప్పుడూ ఏడుస్తో
వేడుకోకు వెక్కిళ్ళతో
భూమినీ స్త్రీనీ: ఏదైతే
నువ్వు ఇచ్చావో
ప్రేమతోనో ద్వేషంతోనో
వస్తుంది అదే తిరిగి

తిరిగి తిరిగి. కరుణని
ఎప్పుడూ ఆశించకు

కాటిన్యం నిండిన చేతులతో
కాలుష్యంతో నువ్వు
భూదాహంతో చెరిచిన
భూద్రోహంతో దూరంతో

ఇప్పుడూ ఆశించకు తిరిగి
తిరుగు ప్రయాణాన్ని

స్త్రీ నుంచీ భూమి నుంచీ:

=కళ్ళకు గంతలు కట్టుకుని
జ్ఞానపు నేత్రాలతో
లోకాన్ని చూస్తుంది ఎవరు?=

10 October 2011

చూసావా

తరుముతూ వచ్చే గాలిలోకి
కళ్ళను
రాలిన పూలను చేసి
చినుకులను చేసి వదిలేసాను

కొంత రాత్రిని అంటించి
కొంత కాంతిని అంటించి: పంపాను జతగా
కొంత వెన్నెలను
కొంత మంచునూ తోడిచ్చి:

వేకువజామునే వచ్చాయి రెండు కపోతాలు
పరిపక్వం చెందిన వెచ్చగా పొదిగిన గూళ్ళతో
పూలు విచ్చుకుంటున్న మెత్తటి సవ్వడితో
చిన్నగా చిట్లుతున్న రెండు వెచ్చటి గుడ్లతో:

నేనిక ఈ దినం లోకంలోకి
లోకుల కాలాలలోకీ
చిన్ని చిన్ని రెక్కలతో
చిరుచిరు చూపులతో
బుడి బుడి నడకలతో
భూమిని ముక్కున కరచుకుని ఎగరవచ్చు

భయం లేదు. భంధించే
భాంధవ్యాలు లేవు.
నేత్ర విధి విలాపాలు లేవు.

రెక్కలు కింద తేలే గాలి
రెక్కల పైన వొంగే నింగి

ఏమీ వొద్దు. ఏమీ కావొద్దు
ఇక ఈ విదేహ దినానికి=

= నీ కిటికీ అంచున వాలి
కువకువలాడుతున్న
నన్ను చూసావా ఈ పూట
నీ యంత్ర కర్మాగారపు
మంత్ర తంత్ర ముఖ పరదా
వదన వ్యసనాలలోంచి?=

09 October 2011

ఎవరూ లేరు

సర్వం సిద్ధం చేసుకుని
లేరు ఎవరూ ఇక్కడ

వెళ్లిపోయేందుకూ
తిరిగి వచ్చేందుకు:

గుడ్లని పొదిగి
గూటిని వొదిలి

ఎగిరి వెళ్ళిన ఎదిగిన శ్వేతకపోతం
తిరిగి వస్తుందో రాదో

మన నయనాలయ్యిన
తను పూర్తిగా పొదగని

గుడ్లు గూడు లేక గోడలపై రాలిపోతాయో
గోడలకి చిట్లి మన కళ్ళు పగిలిపోతాయో
మసక మసక వానగా మిగిలిపోతాయో

చూసేందుకు
చూపేందుకు

ఎవరూ లేరు
ఎవరూ రారు ఇక్కడ:

(= చర్మాన్ని వొదిలి
ఇంద్రియాలని వొదిలి

తన ఎముకల్ని గూడు కట్టుకుని
తనని తాను తానే పొదుపుకుని

పదునాలుగేళ్ళు
రెండు కళ్ళు సప్త కాలాలు
మూడు ద్రోహాలను

వొదిలి వొదిలి
తను వెళ్లి తిరిగి వచ్చింది:

ముందూ తరువాత
అతడు అందుకోలేక

అందరితో నిండి
అందరితో ఉండి

ఎవరూ రాక ఎవరికీ
ఏమీ కాక కాలేక
అతడు చనిపోయాడు.

ఇక ఒక శిలావిగ్రహం

శిలా శాసనమై వేయి నాలికలై
పలు అ/సత్యాలను సంగ్రహంగా
లిఖించింది తిరిగి వచ్చే
ప్రతి/ధ్వని స్వరంతో:

నీకా కధ తెలుసా?)

సర్వం వొదులుకుని
సర్వం వద్దనుకుని

ఎవరూ లేరు ఇక్కడ

వెళ్లిపోయేందుకైనా
వచ్చేందుకైనా:


స్వప్నజ్ఞానం

రాసావా నువ్వొక వాక్యాన్ని? అంచున

అలల అంచున చినుకులు

చినుకుల చివర్న కనులు
కనులు కోల్పోయే చోట
కన్నీళ్లు రాసే నల్లని పదాలు

మౌనం ఎవరిది? మౌనశోకం ఎందరిది?

నువ్వు విరమించుకున్న చోట
నేలపై రెక్కల్లో నీడలు:
నీడలలో జాడలు. ఆటలాడే చోటే
ఆటలాడే పిల్లలు: స్త్రీలూ

ఆ ఆనందం నీది కాదు
అనుభవం నీది కాదు: ఏకాంతంలో
ఏక అంతంలో అ/జ్ఞానం
అది నీదేనా? అది నీ దాహానిదేనా?

రాసావా నిన్ను రచించే ఒక వాక్యాన్ని
ఎపుడైనా ఎక్కడైనా?
ఎందుకైనా ఎవరికైనా?

ముద్దలు పెట్టె తల్లిని తండ్రి ఎక్కడా అని అడగకు. కడుపులో కత్తి దించిన మిత్రుడిని
నయనాలను తుడిచిన చేతులెక్కడా అని అడగకు. మరణించిన వాళ్ళను మళ్ళా
హత్య చేయకు. ప్రశ్నలే పరమావధిగా ఉన్న లోకంలో సమాధానాలు వెదకకు. వెళ్లి
పోయిన వాళ్ళను తిరిగి, తిరిగి తిరిగి రమ్మని పిలవకు.

చినుకుల అంచున చిట్లే చిగురాకులు
ఆకుల మధ్య గూడు కట్టే పురుగుల పాదాలు: అవి కాంతి పంజరాలు. రాలే గాలి
వీచే నీరు. ఎగిసే భూమి కుంగే నింగి.
నవ్వుతో నవ్వుతో నిను వీడే నీలాగ్ని.

పొదుపుకోలేవు. మరచిపోలేవు. పరమమోహిత వలయామృత విష కౌగిళ్ళను
వొదుల్చుకోలేవు విడమర్చలేవు. విప్పి కప్పి ఎవరికీ చూపించలేవు. ఒకే ఒక
వాక్యాన్ని వాక్యంత ఆరంభాన్ని రాయలేవు. ఆపివేయలేవు.

ఏం కావాలి నీకు? నిత్య శాపమోహితుడా సత్య ద్వేష ప్రేమికుడా? తీసుకో రెండు
సమాధులని నీ కనులలోకి కొత్తగా: అంతకుమించి

మిగిలిందీ ఏమీ లేదు. రాయగలిగించీ రాయగాలినదీ రాళ్ళు వేయగలిగినదీ ఏమీ
లేదు. లేదు. లేదు. ఆమెన్:

ఎందుకు

ఎందుకు తొంగి చూసావో తెలియదు

వెనుక నుంచి నిన్ను
వివస్త్రని చేసేది ఎవరో తెలుసునా?

కృష్ణబిలాలలోకి చూపుల్ని విసిరిన
వలయపు పదాలని
నిర్మించిన చేతులని

నమ్మకు
అమ్మకు:


దాచుకున్న కత్తిని ఎవరికీ చూపకు
దోచుకున్న జ్ఞానాన్ని
ఎవరికీ పంచకు:

వాక్యాల్లోని విషాన్ని
విషంలోని వాదాన్నీ
లోకంలోకి చిమ్మకు

నన్ను నిలువునా
వెన్నముకలో చీల్చినది నువ్వని
ఎవ్వరికీ చెప్పను:

కాలాన్ని తెచ్చాను బహుమతిగా

పూలని నులిమిన చేతులతోనే
ప్రేమగా దీనిని అందుకో.

నీ శరీరం

నువ్వు వస్తావు నీ శరీరం రాదు

పదాలు సాగినంత దూరం
సాగుతుంది జ్ఞానద్రోహం:

నువ్వు లేని శరీరంతో నేను
శరీరంలేని నాతో నువ్వు: వాక్యాలు
ఎదిగే వాక్యాలు
పొదిగే వాక్యాలు

సర్ప సంభరాలు. విష విజ్ఞాన
భవిత భాండాగారాలు. వస్తోంది

ఆకాశమంత ఆవులింత. తప్పుకో

పడుకుందాం కాసేపు.

(చేతుల్ని కుట్టిన చేతుల
శయన నయనా కారాగారం
ఉందిక నీకోసం. నిద్రించు.
పరమపదించు. నిన్నిక

ఎప్పటికీ కలవను)

07 October 2011

రాత్రిలోకి చూడనిది

రాత్రిలోకి చూడనిది నువ్వొక్కదానివే

విసిగించాను. విసిగి వేసారిపోయాను

ఎన్నాళ్ళని వెన్నెల? ఎన్నాళ్ళనీ
నీ కరుణా వెన్నెల నీ కన్నుల?

రాత్రిలోకి చూడనిది నువ్వొక్కదానివే

వదనంతో వలయంతో శాంతి లేని కాంతితో
అలసిపోయాను. నీ నిర్ధయతో
నిస్త్రాణమయ్యాను రణమయ్యాను
రానివాడిని లేని వాడినీ అయ్యాను

ఏటి ఒడ్డున రాళ్లకూ
నీటి తడి ఉంటుంది
శిధిలాలలోని శిలలకూ
జీవం ఉంటుంది

రాత్రిలోకి నాలోకి చూడనిది నువ్వొక్కదానివే:

రాతి కన్నా రాత్రి రచన కన్నా
పూవు కన్నా ముల్లు కన్నా
కొండ కన్నా కొరివి కన్నా
కన్నా అంత

నిరార్ధక వార్తాహరుడనా నేను? అంత
నిరాశా నిశాచరుడనీ సహచరుడినా
నేను? నా మేనూ?

అలసిపోయాను. అలసి ఆగిపోయాను.

నిన్ను తాకిన చేతులలోనే ఇక నేను
ఒక చితి పేర్చుకుంటాను.
అందులో బహుభద్రంగా భారంగా
నా ముఖాన్ని దాచుకుంటాను

నిన్ను చూసిన కళ్ళలోనే ఇక నేను
ఒక సమాధిని తవ్వుకుంటాను.
బహు నెమ్మదిగా అందులో నా దూరాన్ని
దారినీ ఏర్పరుచుకుంటాను

విసిగిపోయాను
విరిగిపోయాను
అలసిపోయాను

రాత్రిలోకీ రాత్రి హృదయంలోకీ
చూడనిది నువ్వొక్కదానివే

ఎన్ని చినుకులు నిన్ను తాకినా
ఎన్ని పూలను తెంపుకు వచ్చినా
ఏం లాభం? ఏం హర్షం?

సర్వం శోకం. సర్వం వి/నాశనం.

రాత్రి రాత్రే. రేపు రేపే. కరగనిదీ
కలవనిదీ కలగా మిగిలేదీ నువ్వే.

చూడు: లిఖిస్తూ ఒక పదం
ఎలా ఒక లేఖయై
ఎవరికీ లేకుండా ఏమీ కాకుండా
ఎలా వెళ్ళిపోతుందో.

06 October 2011

కాకి కళ్ళు

చిక్కగా చిన్నగా
చెట్లల్లో కొమ్మల్లో

చెట్లూ కొమ్మలూ
చివుర్లూ తీగలూ
అయిన కళ్ళు:

ఆకాశమంత నలుపుతో
నలుపంత తెల్లదనంతో

నిన్ను చూడక చూస్తో
నిన్ను అరుస్తో
నిన్ను పిలుస్తో

తెల్లని చల్లని కళ్ళు:
తల్లివంటి పాలవంటి

వాన వంటి వాగు వంటి
కళ్ళు కదులుతో
కరుగుతో పరుగుతో
ఎగురుతో:

నాకు తెలుసిక ఇప్పుడు. ప్రభూ
నీవు నల్లని వాడివి
నీవు చల్లని వాడివి

విశ్వాలని కప్పిన రెక్కలకింద
కాకి కనుల కింద

నిద్రించి నీ దరిచేరి
విశ్రమించేందుకు నాకిక
ఏం భయం?

అద్దం

అద్దం మధ్య అద్దం

నిన్ను చూసే కళ్ళు
నిన్ను తాకే వేళ్ళు
ఎ ముఖానిదో నీకు తెలీదు:

అద్దంలో అద్దంలో అద్దం

పరావర్తనం చెందే కాంతి
కన్నీటి అంచులలోనే
కన్నీటి సరిహద్దుల్లోనే:

ఏమి ప్రపంచం! ఎటువంటి కాలం!

నవ్వడం నేరమే
ఏడవటం నేరమే
ఉండటం నేరమే

అద్దంపై అద్దంలో అద్దం

చివరి వరకూ చూడు
కడగంటి చూపు
కోడగంటి పోయేదాకా

దీపం దిగులుతో
ఆమె అలుపుతో
ఆమె తలపుతో ఆరిపోయేదాకా:

అద్దంలోంచి అద్దాన్ని అద్దంలోకి లాగే
ఒక మహా అబద్ధాన్ని

నిజం ఎలా చేయగలవ్?
ఎలా మిగిలిపోగలవ్? రా

అద్దం వెనుక ఉన్న అద్దంలో
ఒక ప్రియమైన అద్దం
ఆరడుగుల అందంతో
ఆరడుగుల పొడవుతో లోతుతో
ఆవేదనతో ఎధురుచూస్తోంది.

కౌగాలించుకోవా దానిని?
ముద్దాడవా దానిని? నీవైన

ఎవరికీ అద్ధలేని తన
ధ్రవపు అద్దపు
హృదయాన్ని?

నేను సీతాకోకచిలుకలతో నవ్విందీ మాట్లాడిందీ ఎట్లనగా ఆనగనగా ..

(ఇలాగే. ఏనాడూ ఎన్నడూ
కాదు అని ఊహించకు
పోదు అని విశ్వసించకు:)

పూలల్లో దారం అల్లుకుంటూ తను తనే
కళ్ళలో చూపులు అల్లుకుంటూ
ఇక నేను ఏమాత్రం నేను కాదు: పూలల్లో
వెన్నెల్లో వానహారమై పిల్లలు

ఇల్లంతా కదను తొక్కే వేళ
ఇల్లంతా కథను చేసే వేళ, కథల్లో
పురాతన గాధలలో

నిన్ను పాడే ఆత్మలు ఎవరు?
నిన్ను వీచే చిరుగాలి
పద పరిమళం ఎవరు?

ఎక్కడ ఉన్నావు
ఎక్కడ నుంచి వచ్చావు
ఎక్కడికి వెళ్ళిపోతావు

ఎలా వెళ్ళిపోతావు?

(రాత్రంతా నేలపైకి నక్షత్రాలు కురియగా
చెలమలోకి చందమామ జారిపడింది.

మిణుగురులు మిగిలాయి
మిడతలు విశ్రామించాయి

గులకరాళ్ళ తడి మీద కళ్ళను ఆన్చి
అతడు రాత్రిని దాటాడా?
అక్కడే మిగిలిపోయాడా?)

= దారాన్ని అల్లుకున్న పూలు
పూలను అల్లుకున్న పిల్లలు
పిల్లలని పుచ్చుకున్న స్త్రీలు
స్త్రీలని విడనాడిన తూలనాడిన

ప్రధమ పురుషులు
ప్రధమ ప్రేమలూ: శాంతీ కాంతీ?
అడగకు: ఓదార్పుకోసం=

(ఎన్నడూ ఆశించకు
ఎన్నడూ ఎవరినీ
పలుకరించకు:
పలువరించకు
కలువరించకు.)

ఇది కవిత్వం అని
ఎవరు చెప్పారు నీకు?

ఒక చేతితో
ఒక ఛాతితో
ఒక దాత్రితో

చాలిక సప్త లోకాలు
చాలిక సప్త కాలాలు
చాలిక సప్త జననాలు

=ఒకే ఒక్క పునర్జన్మ పరిమళం
వెంటాడుతోంది రేపటికి

అప్పటికి సీతాకోకచిలుకలు ఉంటాయో
ఏమౌతాయో ఎందరికి తెలుసు? =

కృతజ్ఞతలు

నువ్వు వెళ్ళిన గురుతులే ఇవ్వన్నీ
నువ్వు లేనప్పుడు వచ్చి చూస్తాను

ఇల్లు సర్దుకుంటాను. అద్దాన్ని తుడిచి
ఒకసారి వదనాన్ని చూసుకుంటాను

రెండు నయనాల్లో రెండు నీడలు
నీరెండలై నీవై నేలని తాకలేని వెన్నెలై
రెండు నల్లటి నీడలు
ఎర్రగా మారిన తెల్లని కళ్ళల్లో:

పూలు పూసాయా
ఎప్పుడైనా ఇక్కడ?
చినుకులు రాలాయా
ఎప్పుడైనా ఇక్కడ?

చితి చింత: చితాభస్మం చెంత
హృదయ వింత.
ఎవరు కనుగొన్నారులే
నయన రహస్యాన్నీ
దాగుని దోచుకున్న
హృదయ విలాపాన్నీ?

కరుణనిమ్ము. నీ అరచేతులలో
నా ముఖాన్ని దాగనిమ్ము.
అంతదాకా అనంతందాకా

ఈ కృతజ్ఞతలు: నీ దర్పణ
విచిత్ర మాయా పదాలకు
ధన్యవాదాలు.

03 October 2011

3

విరమణ:

నీకు ఎప్పటికీ తెలియదు
ఇక్కడికి ఎందుకు తీసుకు రాబడ్డావో
ఎవరు ఎందుకు తెచ్చారో:

దీపమొక్కటే వెలుగుతోంది
పరదేహంలో అర్థంలేని పరమార్ధంతో.
చూసావా నువ్వు?

.
చీకట్లోంచి నింగిలోని పిల్లలకి
నేలపైని నక్షత్రాలని చూపించాను
ఆనక పిల్లలెవరో
నక్షత్రాలేవరో తెలియక
తికమక పడ్డాను

కొంత బ్రతికాను.

గదంతా సీతాకోచిలుకల
గులాబీల పరిమళం అల్లుకోగా
వాళ్ళ రెక్కల కింద దాగుని
రేపటినుంచి వచ్చే
నిన్నటి స్మృతి గాధలను
విన్నాను. నిద్రించాను

మధుపాలను త్రాగి
నిన్ను మరచి మరొకరిని తలచి:

నీకు తెలియదు ఇది.

.
ఉద్యానవనంలోకి వాళ్ళని
తోడ్కోనిపోయాను

కొంత దూరం వాళ్ళతో నడిచాను.
కొంత వాళ్ళ కధనాలని విన్నాను

సంధ్యాకాంతి ఆకులలోంచి దూసుకురాగా
చివరికంటా వాళ్ళతో నడవలేనని తెలిసి
మధ్యలో ఆగిపోయాను.

తల్లులు తండ్రులు: ఎవరు వెళ్ళగలరు
చివరిదాకా వారితోటి?
ప్రియులు ప్రియురాళ్ళు: ఎవరు నిర్మించగలరు
వారు వి/నిర్మించిన శిధిలాలని
వ్యామోహ గగనాలనీ
గత ప్రాచీన పరిమళపు వైభవాన్నీ?

.
రాత్రి మళ్ళా స్నేహిత సర్పాలను
సర్ప శిలల కలలను కలిసాను:

పూవులు లేక చినుకులు లేక
వెన్నెల లేక కృష్ణపక్షపు గీతం లేక

చికిలించిన కన్నులను కాంచాను
ధూళికి దొర్లే కాగితాలలో
అలసిన వదనాలను చూసాను
కన్నీటి మరకలలు రాసాను.

హృదయానికి హత్తుకుని
కొంత ఏడ్చాను
కొంత నవ్వాను:

ఉన్నారా స్నే/హితులు ఎప్పుడైనా
ఎక్కడైనా ఎవరికైనా?

కళ్ళను తాకని కాంతీ
కాంతిని వీడని చీకటీ
చీకటిని చీల్చే స్వరజావళీ
నీ పద అందియల రవళి

కావాలి ఎవరికీ?

శ్మశాన శాంతిలో
సాగర తీరంలో దూరానికి దూరంలో
వెలుగుతుందోక దీపం
దేహానికి దగ్గరలో దాహపు సామీప్యంతో:

స్త్రీ రేపు రా: విదేహ విషం
చిల్లుతుంది చాతిలోంచి
తడిభస్మమై చింతయై అంతటా
తానొక్కంతియై


ఇక నిన్ను స్మరించగలిగేది
విస్మరించగలిగేది ఎవరు?
(ఎందరు?)

విరమణ:
ప్రమిదె ఒక్కటే వెలగడం లేదు
పదంతో పరమార్ధంతో
పరమాత్మతో పర ఆత్మతో:

వేళ్ళకొసలకి అంటిన కన్నీటి
కారడవుల తడి నీదేనా?

01 October 2011

... అను ఏక/వచనం

ఎంతో చేసానని అనుకుంటావ్ ఒక్కడివే ఒక్కడిలో ఒక్కడితో:

ఒక్కడికి ఇంతకన్నా ఎంత సాధ్యం అని యోచిస్తావ్. పిల్లలైతే ఆడుకుంటారు శ్రమ లేకుండా శ్రమ కాకుండా నేరాపరాధన లేకుండా కాని శ్రమ లేని శ్రమ లేకుండా క్షమ లేకుండా నువ్వెలా ఉండగలవ్
ఎదలో నిప్పు లేకుండా ఎద ఎడారి కాకుండా ఎడారిలో కన్నీళ్ళతో రాలకుండా?

ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు ఉన్నట్టుగా లేదని రోదిస్తావ్. నిర్మలమైన నిర్ముఖ భయమేదో నిన్ను తాకగా
విలవిల లాడిపోతావ్. నిలువెల్లా కరిగిపోతావ్. నిన్నే, నిన్ను కన్న పిల్లల గురించే ఇదంతా.
వాళ్ళైతే నవ్వుతారు ఎలాగో భయం లేకుండా విశ్వాన్ని సూర్యనయనంతో చూస్తో
వర్షపు వేళ్ళతో వెన్నెలని నీ ముఖంపై చిలుకరిస్తో వాళ్ళైతే నవ్వుతారు ఎలాగో అలాగా దిగులు లేకుండా:
నువ్వే ఎలా ఉండగలవ్ వీటన్నిటితో నీ భ్రాంతి వ్యసన వదనంతో లాభ నష్టాల వ్యాపారంతో?

కూడబెట్టుకున్నావ్ చిరునవ్వలేని పేదరికాన్ని. జాగ్రత్తగా జాగురూకతతో నిర్మించుకున్నావ్
చూపు లేని ఆకాశ హర్మ్యాల చదరపు రాతి గదులని యంత్ర మనుషులని రాతి మదులనీ.

వినరు వాళ్ళు నీ మాటలని. కనరు వాళ్ళు నీ స్వప్నాల్ని.
నమ్మరు వాళ్ళు నీ ముసలి మీసాలని
నీ మొసలి కన్నీళ్ళనీ నీ పద పదవుల
నీ పరాన్న భుక్కుల కీర్తి ఆకాంక్షలనీ.

పూలు పూసే కళ్ళు. కళ్ళని తాకే పొదరిళ్ళు
శాంతి ఇళ్ళు. అశాంతి లేని కాంతి శరీరాలు

ఇదే భూమి ఇదే నేల ఇదే వాన

ఇవే చెట్లు ఇవే పిట్టలు
ఇవే నీడలు ఇవే స్నేహాలు
ఇదే అమృతం ఇదే విషం
ఇదే శాపం ఇదే మోక్షం


రాత్రి కలువై నింగి నీళ్ళలో కదిలే జాబిలి. ఏటి ఒడ్డున ఎదిగిన వెదురు వొడిన దాగిన కడలి.
వీచే గాలి. వాలే గడ్డి. గడ్డిపై రాలే నక్షత్రాల సీతాకోకచిలుకల కాంతి.

ఎదురుచూస్తున్నాయి కప్పలు ఎగిరిపోయే మిడతలకై మిణుగురులకై: జారిపోతున్నాయి
సర్పాలు ఎవరివో గూళ్ళకై. నిదురించే పావురాళ్ళని చూసావా నువ్వు ఎప్పుడైనా? బతికిన
నయనాలతో ఉన్న శిల్పాలని చూసావా నువ్వు ఎక్కడైనా?

కొంత ఇష్టం కొంత కష్టం
కొంత ప్రేమ కొంత ద్వేషం
కొంత నలుపు
కొంత తెలుపు

కొంత 'కొంతలు' వద్దు వాళ్లకి
సర్వం సత్యం సౌందర్యం
సర్వం ధ్వంసం రహస్యం

రాచరికం లేని రాచముద్రిక
రాచముద్రిక లేని ముద్రిత వచనం
పునర్ ముద్రితం కాని వాచకం

మరొక లోకం
మరొక కాలం:

ఇవే ఇవే కావాలి వాళ్లకి
ఇవే ఇవే కావాలి పిల్లలకి
ఎదిగిన లిఖితాలు
వినిర్మాణ శతకాలైన వాళ్లకి

ఎంతో చేసానని అనుకున్న ఒక్కడే ఆ ఒక్కడే వొద్దు వాళ్లకి

ఎందుకున్నావ్ ఇంకా ఇక్కడే పారిపోకుండా వెళ్ళిపోకుండా
తిరిగొచ్చే తిరిగిరాని తిరిగే పదాలలోకి మరలి పోకుండా?

వెళ్ళిపో. తిరిగి రాకుండా వాళ్ళు వచ్చేదాకా
వాళ్ళు వచ్చి తిరిగి వెళ్ళిపోయేదాకా వెళ్ళిపో:

ఎదురుచూస్తుంది ఒక నలుపు శిలా స్మృతి చిహ్నం
నీకొరకు: ఇక ఎప్పుడూ ఎవర్నీ
ఎందుకు అని అడగకు.

రాత్రి తరువాత రాత్రి

రాత్రి తరువాత రాత్రిని మరిచాను

తెల్లవి కాని గులకరాళ్ళని తాకే
అలలలో పాకే వెన్నెల సర్పాలు:

చూడు చూడు నింగిలో ఊయలలూగే
మిణుక్ మిణుక్ చుక్కలు
అవి రాత్రిలో ఎగిరే పిట్టలు

పసి నవ్వులని చూసాను
పసి పువ్వులని చూసాను

రాత్రిని విస్మరించి స్మరించి మళ్ళా
మరొక రాత్రిని నిర్మించాను

కాంతితో
కరుణతో
ప్రేమతో:

ఆ తరువాత ఆ తరువాత తరువాత
అతడు తొలిసారిగా జన్మించాడు

తను తొలిసారిగా జీవించింది.

ఇక నువ్వు మరణించింది ఎప్పుడు?