07 May 2013

గుర్తు

నిన్ను ప్రేమిద్దామని, అది నీకు చెప్పుదామనీ అనుకుంటాను కానీ
మరి తెలియదు నాకు అది ఎలాగో-

నువ్వు లేక ఎలాగో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మరి ఇక
అందుకే ఉదయాన్నే లేచాను
ఇల్లంతా కడిగి తుడిచాను,ఒక
పాత్రలో నీళ్ళు ఉంచాను, మరి

గుప్పెడు బియ్యం గింజెలు పిచ్చుకలకూ, పావురాళ్ళకూ జల్లాను
కుండీలో మొక్కలకి నీళ్ళు వొంపి
దుస్తులనీ, దుప్పట్లనీ ఉతికాను-

మరేమీ కావవి, మన పిల్లలూ నువ్వూ నేనూ విడిచిన ఆ దుస్తులే
వాటిని అంటిపెట్టుకుని ఉన్న మీ
శరీర వాసనల కోసమే వాటిని ఓ
సారి తాకి చూసుకున్నాను,ఆపై

తీగెలపై ఆరవేసి, ఎండకి వొదిలివేసాను- కొద్దిగా దాహం వేయగా
మంచినీళ్ళు త్రాగి, వాలు కుర్చీలో
ఒదిగి కూర్చున్నాను, అలసటతో
కనులు మూతపడగా మరి ఆకలీ

వేయగా, కొంత ఓపిక తెచ్చుకుని బియ్యం వండుకున్నాను, ఏదో
ఇన్ని మిగిలిన కూరగాయలతో ఓ
కూర వంటిది చేసుకున్నాను. ఇక
సంకటయ్యిన అన్నాన్ని, ప్లేటులో

వడ్డించుకోగానే,  పొడుచుకు వచ్చాయి ఆ తెల్లటి మెతుకులలోంచి
నీ చేతివేళ్లు బయటకి, తాకాయి
నింపాదిగా మరి  నా ముఖాన్ని-
ఇక నీ కళ్ళేమో, త్రాగుదామని

ఉంచుకున్న గ్లాసు అంచున చెమ్మగిల్లి ఎప్పటిలా నొప్పితో మెరిసాయి
దిగులుతో నా వైపు చూసాయి
అరచేతిలో అన్నంముద్దలై అలా
స్థంబించిపోయాయి, ఏడిచాయి-

అయ్యో, ఎందుకు గ్రహించలేదు మరి ఇన్నాళ్ళూ నేను, నిన్ను ప్రేమిస్తున్నానని
నీకు తెలియజేయడం అంటే ఇలాగని
నువ్వు రోజూ చేసే ఈ పనులే, నువ్వు

ఉన్నప్పుడు నేనూ మన కోసం చేయడమనీ, నీతో కలసి కొంత తెరిపి పడటమనీ? 

1 comment: