25 May 2013

ఆకు

కూర్చున్నాం నేనూ, ఈ అశోకా వృక్షపు ఆకూ ఎదురెదురుగా-

కొద్దిగా ముదిరి, పీల్చివేయబడని పచ్చదనమేదో కొంత మిగిలి
కొంత సూర్యరశ్మిని తనపైకి వంచుకుని
చిరుగాలికి అలా కదిలే ఈ అశోకా ఆకు

నా పరధ్యాన ముఖాన్ని, తన చేతివేళ్ళతో మరి చిన్నగా తాకితే
అతని అమ్మ గుర్తుకు వచ్చింది -
కొంత పగిలి, మరికొంత చీలికలై

నేలకు నీడనీ, వాననీ, గాలినీ ఇచ్చి, నేలపైకి, నేలలోకి చేరేందుకు
ఆఖరుగా, తపనతో, ఆసుపత్రిలో
కొమ్మను పట్టుకుని రెపరెపలాడే
ముకుళితమైన ఆకుగా మారిన
ఆ అమ్మా, మరి ఈ అశోకా ఆకూ-

మరి  చీకటయ్యే వేళకి, పోటెత్తిన హోరుగాలికి, ఎగిసిన దుమ్మూ
దుమారానికి తాళలేక, నువ్వు
లేక మరి ఆకు తెగి, రాలి, ఎటు
వెళ్ళిపోయిందో, ఎన్నెన్ని తుంపులయ్యిందో

ఇక చెట్టుకీ తెలియదు,ఈ కళ్ళల్లో
నుంచి జారిన, అశోకా ఆకువంటి
అశ్రువుకీ, అశోకా చెట్టంత పొడుగైన అతని ఒంటరితనానికీ తెలియదు- 

No comments:

Post a Comment