14 May 2013

యిలా.

ఆకాశం నుంచి ఈ నేల దాకా
ఒక లేత వాన పరదా జారితే యిక ఎందుకో నాకు ఎప్పుడో
నా తల్లి కట్టుకున్న చుక్కల చీరా నేను తల దాచుకున్న తన మల్లెపూల
నీటి యెదా గుర్తుకు వచ్చింది.

పమిట చాటున దాగి తాగిన పాలు
తన బొజ్జని హత్తుకుని పడుకున్నఆ ఇంద్రజాలపు దినాలు
రాత్రి కాంతితో మెరిసే
దవన వాసన వేసే ఆచెమ్మగిల్లిన సూర్య నయనాల కాంతి కాలాలూ

గుర్తుకువచ్చాయి ఎందుకో, ఇప్పటికీ చీకట్లో
అమ్మా అంటూ తడుముకునే, ఎప్పటికీ
ఎదగలేని ఈ నా నలబై ఏళ్ల గరకు చేతులకు-

ఉండే ఉంటుంది తను ఇప్పటికీ - ఎక్కడో -
నన్ను తలుచుకుంటో ఏ
చింతచెట్ల నీడల కిందో ఓ
ఒంటరి గుమ్మం ముందో

కాన్సరొచ్చి కోసేసిన వక్షోజపు నుసి గాటుపై
ఓ చేయించుకుని నిమురుకుంటూ
తనలోనే తాను ఏదో గొణుక్కుంటూ

ఇన్ని మెతుకులు కాలేని ఆకాశాన్నీ
కాస్త దగ్గరగా రాలేని దూరాన్నీ ఎలా
అ/గర్భంలోకి అదిమి పట్టుకోవాలనిఒక్కతే కన్నీళ్ళతో అనేకమై యోచిస్తో
వాన కానీ భూమీ కానీ మొక్క కానీ పూవు కానీ గూడు కానీ దీపం కానీ

అన్నీ అయ్యి ఏమీ కాక, ఒట్టి ప్రతీకలలోనే
మిగిలిపోయి రాలిపోయే లేగ దూడ లాంటి
మన అమ్మ

యిలా ఉందని
ఎలా చెప్పడం?

No comments:

Post a Comment