06 May 2013

అస్వస్థత

నీకేం చేయాలో తెలీనప్పుడు, ఊరకే కూర్చుని కిటికీలోంచి బయటకి చూస్తావు-

మరి పెద్దగా ఏమీ ఉండవు అక్కడ. గాలి, రికామిగా తిరిగే ఆ గాలే
నీ ముఖాన్ని తాకుతుంది తన పసివేళ్ళతో-
ఆరేసిన బట్టలే కదులుతాయి అలజడిగా అటు తిరిగీ, ఇటు తిరిగీ
కుంచించుకుపోయే కాంతిలో: మరి ఎందుకో

ఆ కాంతినీ, ఆ కదలికల ఆందోళననీ నువ్వు
ఎదురుచూసే కనులగానూ, కనురెప్పలగానూ ఊహిస్తావు- ఎవరో నిన్ను తాకి
ఆనక వెళ్ళిపోతే, తనతో పాటు వెళ్ళలేక, ఇంకా
ఇక్కడే ఉండిపోయి ప్రతిధ్వనిస్తున్న నవ్వులానూ ఊహిస్తావు, 'ఊహించడం పెద్ద
నేరమేమీ కాదు కదా' అని కూడా అనుకుంటూ-

ఇక నీ నుదిటిపై, లోపలా ఎర్రటి కాంతి. వానలో
ఎవరో నిన్ను బొగ్గులపై కాలుస్తున్న స్థితి. మరి
ఎండిపోతున్న పెదాలపై నాలికతో రాస్తుంటే, ఒక చేదు సర్పమేదో పాకిన అనుభూతి
లోపలెక్కడో కొద్దిగా వొణుకు, కొద్దిగా దిగులు-
'నుదిటిపై వాలాల్సిన అరచేతులెక్కడా? పొదుపుకోవాల్సిన బాహువులు ఎక్కడా?

శరీరం శరీరం మొత్తం ఒక మాటై నిన్ను పలకరించాల్సిన మనుష్యులు ఎక్కడా?'
అని కూడా అనుకుంటావు కానీ, ఊహించడమే
పెద్ద నేరమైన చోట, మాటని ఆశించడం పాపమే
అని గ్రహించి, కూర్చుంటావు అక్కడ, అక్కడే ఆ

కిటికీ ముందు, కిటికీ ఎవరో నువ్వు ఎవరో, మరి
నిజానికి లోపలేదో వెలుపలేదో తెలియక, తెలుసుకోవాలనే పెద్ద కోరికా కలగక- మరే
మరి చూస్తూ ఉండు, దిగంతాల నుంచి రాలుతున్న
ధూళిలోకి మరి నీ కన్నులను వొదిలివేసి ముఖాన్ని

నీ అరచేతుల్లో కుక్కుకుని ఊరికే అలా. అయినా
ఇంతకూ, ఎవరికి మిగిలి ఉన్నాయి గూళ్ళు ఇక్కడ
నువ్వు తల దాచుకోడానికైనా, గుండెలు బాదుకుని రోదించడానికైనా, చివరికి

ఎవరూ లేక, రాకా కనీసం నీలో నువ్వు నీతో నువ్వు చనిపోడానికైనా?

No comments:

Post a Comment