12 May 2013

ముందు


ఒక కవిత ఎలా రాయాలోతరువాత చెబుతాను కానీ, ముందు ఇది ఊహించు:

కిటికీలోంచి చేతిని చాచి, తలను దానిపై వాల్చి కూర్చుంటే, మరి
ఎక్కడిదో ఒక తేనె పిట్ట వచ్చి నీ అరచేయిపై వాలుతుంది
అరచేతిని కదపకుండా, అబ్బురంతో కళ్ళింత చేసుకుని
నువ్వు దానిని చూస్తున్నప్పుడు

పైన ఆకాశం కొంత రంగు మారుతుంది. కొంత గాలి వీస్తుంది
పని చెసుకుంటూ, చెదిరిన శిరోజాలను వెనకకి తోసుకుని, నీ
వైపు ఒక పరి చిరునవ్వుతో చూసే నీ స్త్రీ గుర్తుకు వస్తుంది-
నిన్ను ఊరకనే తాకి కిలకిలా నవ్వే పిల్లలూ, వాళ్ళ కళ్ళల్లో

మెరిసే తోటలూ, నేల తడచిన సుగంధంతో నిన్ను తాకుతాయి
వెన్నెల ఏదో నీ ప్రాంగణంలో రాలి, కొన్ని పూవులేవో వికసించి
ఇక నీ చుట్టూతా సన్నటి పురాస్మృతుల జల్లు, నీ అరచేయిని
అందుకుని అరచేతిలో ఎవరో వేలితో సున్నాలు చుడుతున్నట్టు-

క్షణకాలం నీపై అలా వాలి, నిన్ను తాకి తేనె పిట్టైతే ఎగిరిపోతుంది కానీ
నీ శరీరమంతా దాని చిట్టి పాదాల ఒత్తిడి
దాని రెక్కలు అడుగున దాగిన వెచ్చటి
దాని పసి శరీరపు అలికిడి, లేత తాకిడి

మరేమో ఇక నీ మనస్సులో
సరస్సు వంటి ఒక నిశ్శబ్ధం- నావ ఏదో ఆగిపోయినట్టూ, నడి సంద్రమే
తీరం అయినట్టూ, ఇక ఈ
ప్రయాణపు మర్మమేదో పూర్తిగా తెలిసిపోయినట్టూ

మృత్యువు రహస్యమేదో తొలిసారిగా అవగతమయినట్టూ
పూల మధ్య దారం అయ్యి, ఆత్మ నుంచి ఆత్మకి
అల్లుకుంటుంనట్టూ, నెత్తురు దివ్వెయై వెలిగినట్టూ-

సరే, సరే, అది సరే కానీ,ఒక కవిత ఎలా రాయవచ్చునో, ఇప్పుడైనా తెలిసిందా నీకు?

No comments:

Post a Comment