20 May 2013

ఒక మామూలు కవిత

రాసుకుందామని కూర్చుంటాను, ఇక్కడ, ఒక్కడినే మరి, నీలాగే ఈ రాత్రి కాంతిలో-

నీవు ఉండే గదుల వంటివే. అద్దెకు తీసుకుని, మన శరీరాలనీ, మాటలనీ అద్ది
నాలుగు పూల కుండీలతో, పొద్దుతిరుగుడు పూవులా
మనం మలచుకునే, ఈ రెండు అద్దె గదుల ఇల్లే మరి-

నీవు వినే శబ్ధాల వంటివే ఇక్కడ కూడా. నువ్వు రాసుకుందామని కూర్చున్నప్పుడు
నీకు వంటింట్లోనుంచి వినిపించే వంట పాత్రల సవ్వడే-
ప్రతీ రాత్రీ, మనలని మనం బ్రతికి ఉంచుకునేందుకు

తానో, లేక కొన్నిసార్లు నువ్వో చేసే ధైనందిన చర్య-
నువ్వు వాటిని జాగ్రత్తగా వినగలిగితే, ఆ శబ్ధాలలో
సన్నటి గాజుల అలికిడి వంటి, గాలికి కదిలే పూల పరిమళం వంటి, బియ్యం చెరిగే, మరి
వాన చినుకులు రాలే ఘడియలూ వినిపిస్తాయి-

ఇక, నీ పిల్లల వంటి వాళ్ళే నాకూనూ- ఇల్లంతా
ఎగిరి ఎగిరి, ఈ పట్టాణాలల్లోంచి తప్పించుకుని
పచ్చని పొలాల్లో, తూనిగలో మరి మిడతలో రివ్వున ఎగిరే మైదానాలలో, వాళ్ళు హర్షంతో
కేకలతో పరిగెత్తిపోతున్నట్టూ- మరిక వాళ్ళు
ఉండటం వల్లేనే , ఈ నాలుగు గోడలూ ఇంత

పచ్చని పొలలై , ఉద్యానవనాలు వేలాడే నగరాలై
కొంత కనుల కింద శాంతియై.ఇక మరి రాత్రంటావా
నువ్వు నీ సహచరితో మాట్లాడుకునే,పోట్లాడుకునే
నిన్ను నువ్వు విడమర్చుకుని తెరపి పడే చీకటి వలే వ్యాపించే ఒక సజీవ గర్భం, చెమ్మానూ-
పెద్దగా ఏముంటాయి చెప్పు - కట్టవలసిన బిల్లులూ
రాని జీతాలూ, ఇవ్వవలసిన ఇంటి అద్దెలూ, జరిగిన

అవమానాలూ, రాబోయే రోజులూ, పిల్లలు ఉదయం చేసిన అల్లరి పనులూ, తలుపు సందులో
పడి చిట్లిన వేలూ, గుక్క పట్టి ఏడ్చిన ఆ ముఖమూ
ఇంకా కొంత శరీర శాంతి. రోజూ రమించాలనేం ఉంది?

అప్పుడప్పుడూ తన అరచేయి నీ నుదిటి మీద
ఆగినప్పుడు, అక్కడొక నెమలి వచ్చి, రెక్కలు
విప్పార్చి నృత్యం చేస్తుంది. అపుడు నీ లోపల ఎక్కడో సన్నగా చెట్లు వీచి, ఆకులు రాలి, నీ
లోపలి ఆకాశం నెమ్మదిగా మేఘావృతమౌతుంది-

మూసుకున్న కళ్ళ కింద కొంత చిన్న వెలుగు
ఎవరో దీపం వెలిగించి, నీ లోపల ఉంచి, అరచేతులతో కాపాడుకుంటునట్టు కూడానూ-
సరే, మరి ఇవే, మరి ఇలాంటివే,రాసుకుందామని
నేను కూర్చున్నప్పుడు: ప్రత్యేకమైన ఇంద్రజాలం
ఏదీ లేదు నా వద్ద. నీలాగే, అత్యంత సరళంగానే

చూడు, రాసుకుందామని కూర్చుని, నీ గురించీ
నా గురించీ చెప్పుకుంటుండగానే, ఎలా మరి ఈ
నాలుగు పదాలు, నిన్ను విడిచి, నన్నూ విడిచి
రొట్టెలు ఉంచిన ప్లేటు వద్దా, కదులుతున్న మల్లెతీగ చుట్టూ, తడి గుడ్డ చుట్టిన మట్టికుండ వద్దా
పసిడి కాలం వంటి నుదిటిపై, నిప్పుల వేడిమికి

కమ్ముకున్న చెమటని, తన ముంజేతితో తుడుచుకునే నీ స్త్రీ వద్దకూ, ఎలా
వెళ్లి చుట్టూ తిరుగాడుతున్నాయో! మరేం లేదు
ఇంతకూ ఇప్పుడైనా తెలిసిందా నీకు, మరి ఒక
కవితను ఎలా చేయవచ్చునో, నువ్వు ఒక కవితగా ఎలా మారవచ్చునో, ఇక చక్కగా ? 

No comments:

Post a Comment