14 May 2013

కాంతి

ఇక్కడే, ఒక్కడినే నక్షత్రాలని చూస్తూ కూర్చుంటాను-

చుట్టూ నల్లటి మల్లెపూవులు రాలే చెమ్మగిల్లిన చీకటి-
వీచే సన్నటి గాలీ: ఎవరో మరి
వాకిట్లో నీళ్ళు చిలుకరించాక

చక్కగా ఎగిరివస్తున్న, వొళ్ళు విరుచుకున్న మట్టి వాసనానూ-
ఎవరిదో ఒక చేయి నీడయై
గోడపై దీర్ఘంగా సాగి, నిన్ను
తాకే వేళలలో, నీ శరీరంలో

ఒక సన్నటి జలదరింపు. వెనుక నుంచి ఎవరో నీ మెడపై
రహస్యంగా ఊపిరై తాకినట్టు
ఇక్కడే మరి ఒక్కడినే నిన్నూ
ఈ నక్షత్రాల కాంతిని చూస్తూ-

మరి ఇక ఎవరికి  తెలుసు
నేను ఇప్పుడు చూస్తున్న
నువ్వైన ఈ నక్షత్రపు కాంతి ఏ పురాతన కాలానిదో? నువ్వు

ఇంతకూ అక్కడ ఉన్నావో లేదో?

No comments:

Post a Comment