20 May 2013

ఎన్నడైనా?

ఇక్కడ నువ్వుంటే బావుండేది- (నిజంగానే, ఆ రిక్త అరచేతుల్లోనే)

వేళ్ళతో తాకితే కదిలే చీకటి. ఇదొక సరస్సు కూడానూ-
శరీరాన్ని నావను చేసి వొదిలితే, మరి 
సన్నగా వీచిన గాలికీ, ఆ కాంతికీ ఇక 
ఒక్కసారిగా ప్రాణం వచ్చిసాగిపోతుంది 

రాత్రి అలలపై ఈ కాగితపు నావ, తీరం లేని లోతుల్లోకీ, ఒక విస్మృతి 
కాలంలోకీ, నువ్వు లేని లోకాలలోకీ- 

అయినా సరే, మరి ఇక్కడ నువ్వుంటే బావుండేది (నిజంగానే)

ఈ చీకటి నీళ్ళలోకి తొంగి చూసి, వాటిని మంచినీళ్ళ వలే మార్చే  

నీ ప్రతిబింబాన్నిఈ అరచేతులతో అందుకుని
కొంత నా దప్పిక తీర్చుకునేందుకూ, 
ఈ శోక వదనాన్ని కడుక్కుని కొంత 

తెరపి పడేందుకూ, ఆపై నిదురించేందుకూ-

అది సరే కానీ, రాత్రిపూట గోడలపై రెపరెపలాడే నీడలను చూస్తూ 
కూర్చున్నావా ఒక్కడివే ఎన్నడైనా?

No comments:

Post a Comment