03 May 2013

ఈ ఉదయం

మనుష్యుల శరీరాలలోపల మొక్కలు మొలకెత్తి, చెట్లుగా వ్యాపించి
అలలు అలలుగా వీస్తూ ఉంటే
నీకు కొంత స్వాంతన - కనీసం

మరి మబ్బుల లాగైనా ఉంటే, ఎప్పుడో ఒకప్పుడు చినుకులై, నీ
ముఖాన రాలతారని ఒక చిన్ని
నిరీక్షణ. మరలా కాకపోయినా

కనీసం ఒక్కసారి ఒకే ఒక్కసారి
మట్టిలా మారినా బావుండునని
ఒక ఊహ- తవ్వుకుని తవ్వుకుని, వాళ్ళల్లో భూస్థాపితమయితే
ఎలాగోలాగా తిరిగి జన్మించవచ్చు

అనే చిన్ని ఆశానూ, తిరిగి ఎవరిదో ఒకరిది వేలు పట్టుకుని అలా
నిశ్చింతగా వెళ్ళవచ్చు, అలా
నింపాదిగా ఆడుకోవచ్చు అలా
నిర్భీతిగా పడుకోవచ్చు అనే
ఓ అమాయకమైన కోరికానూ.

మరి ఏమిటంటే, ఏమీ లేదు - ఉదయపు అంచున ఒక అరచేతిని చాచి
మరో అరచేయికై ఎదురు చూస్తున్న
ఒంటరి వాసన వేసే ఒక మనిషి-
మరి ఎవరి ముఖంలోనైనా, ఎవరి

కనులలోనైనా నీ ముఖం కడుక్కున్నావా నువ్వు
ఎండ చిట్లే ఈ ఉదయపు ఎడారిలో? 

No comments:

Post a Comment