10 May 2013

బాల్కాయ్*

'అక్కడ చేయి పెట్టుకోకూడదు, ఎప్పుడూ అక్కడ చేయి పెట్టుకుని
నులుముకుంటావేమిటి? యాక్, చేయి తీయి'
అని వీలైతే ఒక దెబ్బ కూడా వేస్తాం కానీ, వాడే

ఆనక అటు తిరిగి, ఇటు తిరిగీ, నెమ్మదిగా నా వద్దకు వచ్చి ఇలా
అంటాడు ఆ నాలుగేళ్ల నల్లని వాడు: "నాన్నా
దురద పుడుతుంది నాన్నా, దురద పుట్టినా
బాల్కాయ్ నులుముకోకూడదా?"అనడిగితే

ఎక్కడో ముఖం దాచుకుని, శతాభ్ధాల లైంగిక అణచివేతలు గుర్తుకు
వచ్చి, శరీరం ఒక పాపం, మరి లైంగిక
అవయవాలు ఒక నేరం, అని పిల్లలకి

చెప్పీ చెప్పీ చెప్పీ, శైశవం నుంచి బోధించీ బోధించీ బోధించీ, నీ శరీరాన్ని
నువ్వు ఆస్వాదించచనిదే,  ఇతరుల శరీరాన్ని
నువ్వు ఆరోగ్యవంతంగా ఆస్వాదించలేవు అని

ఈ పుణ్యభూమిలోని తల్లులకీ తండ్రులకీ ఇక

మరి చెప్పలేక ఎలా చెప్పాలో తెలియక, ఇదిగో
చేతివేళ్ళల్లో నీళ్ళు కుక్కుకుని, ఈ పదాలను
రాసుకుంటూ ఉన్నాను, శరీరాన్ని మరియు లైంగిక అవయవాలనీ, రతినీ
అంటరాని పదాలని చేసి, పిల్లల నోట్లో గుడ్డలు

కుక్కి, వాళ్ళని ర్యాంకులుగా, పెట్టుబడులుగా
సమాజంలో హోదాలుగా తప్పితే, నిలువెల్లా
వెన్నెలనీ పూలనీ కాంతినీ వాననీ వసంతాల్నీ
ఎడారులనీ దాహాలనీ మోహాలనీ దేహాలనీ మోసుకు తిరిగే ఆత్మలుగా మరి

వాళ్ళని చూడలేక, వాళ్ళని పెంచలేకా మరి వాళ్లకి చెప్పాలేకా, వాళ్లకి ఇక
శరీరాలు లేకుండా చేసి, నిలువెత్తు సమాధులుగా
మారుస్తున్న నిన్నూ నన్నూ ఎందుకో మరి దుక్కంతో తలచుకుంటూ-
--------------------------------------------------------
*బాల్కాయ్ = the word for penis that the little one uses-

1 comment: