01 May 2013

ఒక దినం, ఇలా

ఇక్కడే కూర్చున్నాను, ఈ ఎండ తటాకంలో కనుగుడ్లను బుడుంగన ముంచి
వాటిని శుభ్రం చెసుకుంటో - మరి

ఆ చెట్లు. అవి కదలవు. ఆ ఆకులు
అవి అల్లాడవు. గాలి లేక, వీయకా
గొంతు ఎవరో నులుమినట్టు, ఒక

దాహం. ఒక తపన. శరీరం మొత్తం ఒక నిలువెత్తు మట్టి కుండై, నీటికో
వానకో ఒకే ఒక్క చినుకుకో, పోనీ

కనీసం ఇంత చెమ్మకో వ్యాకోచించీ, వ్యాకోచించీ, వ్యాకోచించీ నిస్సహాయంగా
ఎదురు చూస్తున్నట్టు, ఇదొక, ఒక
చిల్లు పడ్డ నగరం ఓ అజగరమై ఇక

నన్ను చుట్టుకుంటే, ఒరే నాయనా
మరి ఏం చేయాలో తెలియక ఇలా
దారి పక్కన కూర్చున్నాను, నిన్ను

తలచుకుంటూ, ఎక్కడైనా ఒక బీరు
త్రాగుదామా అని కూడా అనుకుంటో-
అది సరే కానీ

మరి తాటి ముంజలు తిన్నావా నువ్వు
ఈ వేసవి కాలపు అంచులలో కూర్చుని
బుద్ధిగా ఒద్దికగా నీ చేతివేళ్ళని  నాక్కుంటో, నీ దుస్తులపై మరకలను చేసుకుని ఇకిలిస్తో? 

1 comment:

  1. Kotta tharamkavullo naaku K.Srikanth kavitvamante ishtam!

    ReplyDelete