15 May 2013

ఎందుకు కాకూడదు?

కనులలో ఏవో నెగడులు రగిలి, నుదిటిలో ఏవో లోకాలు చిట్లి, అరచేతుల్లో
ముఖాన్ని పాతుకుని, ఆ చీకట్లలో కూర్చుని
బావురుమంటున్న ఒంటరి నీడల్నినేనొక్కడినే

వింటున్నప్పుడు, మరి నువ్వొస్తావు: నీవే అవి- రెండే రెండు అరచేతులు

రెండే రెండు పాదాలు, రెండే రెండు కనులూ, రెండే రెండు మాటలూ, శబ్దాలూ
అస్వస్థత నిండిన శరీరాన్ని లోపలి పొదుపుకునే
నీ బాహువులూ, రెండే రెండు అశ్రువులు, మరిక

రెండే రెండు పెదవులు, చీకటిని చీకటి పెనవేసుకున్నట్టూ
ముదురాకులపై ఉదయపు చెమ్మ ఏదో పరచుకున్న్నట్టూ

ఘనీభవించిన సరస్సులపై పొగమంచు ఏదో ఒక సుగంధమై వ్యాపించినట్టూ
భీతిల్లి కంపించే అరచేతిలోకి మరో అరచేయి ఏదో ధైర్యమై
చుట్టుకున్నట్టూ, కనులు తెరవని కుక్కపిల్ల ఏదో, తన
తల్లి పొదుగులోకి ముడుచుకున్నట్టూ, పాలు తాగినట్టూ

ఇక నువ్వు యిలా వెలిగించిన ఈ ఒకే ఒక్క రాత్రిలోకి ఇలాగే జారిపోతాను నేను
నీతో, మరి ఒక అంతిమ క్షణంలోకి, కరుణ నిండిన ఒక
ఆఖరి కాంతిలోకీ, తిరిగి మొదలయ్యే ఒక శ్వాసలోకీనూ-

మరేం పర్వాలేదు: వికసించిన పూవులన్నీ ముకుళితమవ్వాలి. అవన్నీ ఎక్కడో
ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు రాలిపోవాలి.మరి అది
కనిపించని నిప్పులని దాచుకుని, కని /పెంచే చల్లని
తల్లి వక్షోజాలై, నన్నూ నా ముఖాన్ని అదుముకుని

నాకు పునర్జన్మని ఇచ్చే, నీ అరచేతుల్లోనే, ఆ వనాలలోనే ఎందుకు కాకూడదు? 

2 comments: