12 July 2011

ఒక (పాత) వాచకం

పూవు ఒకటి ఉంటుంది.

అవతలివైపు, తల్లిదనంవైపు
రెండు జతల చేతులు మాత్రమే

పొదివిపుచ్చుకోగల పూవు
ఒకటి ఉంటుంది.

ప్రత్యేకత, ఒక్కటిగా ఉండే
ప్రత్యేకత ఒక పాపం:

మబ్బులు లేకుండా తరచూ
వర్షించే ఆ రెండు కళ్ళను

మరో రెండు కళ్ళతో జత చేస్తేనే
చూడగలిగే ఒక

జాబిలి ఉంటుంది.

ప్రత్యేకత, ఒక్కటిగా ఉండే
ప్రత్యేకత మహాపాపం.

మొహసింతో నేనొక దేవతని
స్వప్నించాను.
మొహసింతో నేనొక దేవతని
స్వప్నించి రోదిస్తున్నాను.
మొహసింతో నేనొక దేవతని
స్వప్నించాను. నాకిక
ఇది నిదురో మెలుకువనో ఇక
తెలియదు. నాకిక
నేను జీవించి ఉన్నానో
మరణించానో ఇక తెలియదు.

సత్యాసత్య అలలు తేలే
విషాద కొలనులోంచి నీ స్వరం
నన్ను చేరినప్పుడు
నీ పదాలు, నీ గర్భిణి దేవతా
పదాలు ప్రతిధ్వని లేక
నన్ను చేరినప్పుడు

ఒక నిశ్శబ్దం నెమ్మదిగా
సాగరపు ఒడ్డున గాలిలో

చెమ్మలా, తల్లిలా
ఒక తాగుబోతు విచారంలో
వికసించినప్పుడు

ప్రతీకలలో పదాలలో
విశ్వాసం ఉంచగలిగే
దూత ఎవరు?

రోదనే దినచర్యగా మారిన
లోకంలో

పాప పాడే పాటనీ పిట్టనీ
సాగారాన్నీ విశ్వాన్నీ
అర్థం చేసుకునే
వారెవరు?

అస్థిత్వాలెవరు?
స్నేహితులెవరు?
స్త్రీలేవారు?

నిర్లజ్జగా
నిర్భీతిగా
వొణుకుతో నీ కేక
నన్ను మరోవైపునుంచి
అవతలివైపు నుంచి
నన్ను తాకినప్పుడు
నీకు ఇది మాత్రం
చెప్పగలను:


లొంగిపోం మనం:
ద్వంసంకాం మనం
మరణిస్తూ
మరణించం మనం
రెండు అరచేతుల మధ్య
తన రెండు వక్షోజాల మధ్య
పదిలంగా
కాపాడుకుంటున్న
దీపపు జ్వాలలా
తన నయనాల్లో ఇంకా
బ్రతికి ఉన్న పదంలా

ఈ మృత్యువుతో
మరణిస్తూ మనం

ఇక్కడే అనంతపు జాడని
తాకుతాం మనం:

మొహసింతో, మొహసింతో
ఈ జీవించడంలో
మరణించు: ఇప్పటికి

ఎప్పటికీ=

1 comment:

  1. chala bagundi sree...ur poesy makes ripples in my heart......love j

    ReplyDelete