19 July 2011

ఏమిటిది?

నీరెండ కాస్తుంది నీ కళ్ళలో

ఎవరెక్కడ ఉంటారు
నీ వార్త మమ్మల్ని చేరినప్పుడు?

నిలువెత్తు అశోకా వృక్షాల
నిలువెత్తు గాలి వీస్తోంది ఎక్కడో

నిన్నూ నీ మాటల
హోరుని తలపిస్తూ=

ఇలాగే ఉంటావా నువ్వు
ఎప్పుడూ, అందరితోనూ?

చిన్ని చిన్ని మొక్కలకు
అనాధ పూలపొదలకు
పాదులు చేస్తూ

ఇన్ని నీళ్ళు వాటికీ, ఇన్ని
గింజలు పిట్టలకీ జల్లుతూ

చిరునవ్వుతో అలాగే
కాలాన్ని దాటుతావా నువ్వు?

నిన్ను తరచూ తాకే
కన్నీటి నీడలు
నిన్ను తరచూ వీడని
రాహిత్యపు అలలు

ఏం చేస్తావ్ వాటన్నిటినీ?

నిన్ను గాయపరచిన
వాటన్నిటినీ

చప్పున మరచిపోయి
జుమ్మని అలా ఎలా
ఎగిరిపోతావ్

నీలాకాశంలోకీ నీలి
సముద్రంలోకీ, మళ్ళా
అందరి సమక్షంలోకీ?

నాకు తెలియకుండా
ఏదో ఇంద్రజాల విద్యను
నేర్చుకున్నావ్ నువ్వు

నాకు తెలియకుండా
ఏదో స్వప్నకళలో
పరిణితి సాధించావ్ నువ్వు

ఎవరూ లేనప్పుడు
నా కళ్ళలో చీకటి చిట్లి

కాలం కబోధి అయినప్పుడు
నీ వంక చూస్తాను. నీరెండ

పరుచుకున్న నీ కళ్ళనీళ్ళలో
నా ముఖాన్ని కడుక్కుంటాను.
నీ కనురెప్పల నీడలో

అలసటగా విశ్రమిస్తాను. రాత్రి
అయ్యింది. దిగులు ధూపం

చుట్టుకునే వేళయ్యింది. త్వరగా
చెప్పు బ్రతకడమెలాగో-

మరో మూల నుంచి శ్రీకాంత్
ఒళ్ళు విరుచుకుని లేచి
వస్తున్నాడు

నన్ను తన మృత్యు దంతాలతో
నమిలి తినేందుకు-

త్వరగా నా చేయి అందుకో
ఆ నల్లటి వెన్నెల

నన్ను ముంచివేయక మునుపే
నేను అతడిలా కాక మునుపే=

1 comment:

  1. ''నిన్ను తరచూ తాకే
    కన్నీటి నీడలు
    నిన్ను తరచూ వీడని
    రాహిత్యపు అలలు

    ఏం చేస్తావ్ వాటన్నిటినీ?

    నిన్ను గాయపరచిన
    వాటన్నిటినీ

    చప్పున మరచిపోయి
    జుమ్మని అలా ఎలా
    ఎగిరిపోతావ్

    నీలాకాశంలోకీ నీలి
    సముద్రంలోకీ, మళ్ళా
    అందరి సమక్షంలోకీ?''

    శ్రీకాంత్ గారూ,
    ఇట్లా రాసినపుడు మీ కవిత్వం ఎంత బావుంటుందో....గాయాలన్నింటినీ ఒక్కసారిగా దులిపేసుకుని నీలాకాశంలోకి రివ్వున ఎగరాలనిపిస్తోంది.
    కానీ మీర్రాసిన 'తెలుసు' కవితల్లాంటివి చాలా బాధిస్తాయి.''కృష్ణశాస్త్రి బాధ......''లా కాకూడదు కదా...ఆ కవిత చదివినపుడే కామెంట్ చేయాలనుకున్నాను.కానీ చదివిన తర్వాతి భారం మాట్లాడనివ్వలేదు.ఆ కవితలో దుఖాన్ని మించిన సౌందర్యం ఉందేమో...మరి నాకు తట్టలేదు.మీ కవిత్వం మీది ప్రేమతోనే ఈ కామెంట్.
    మల్లీశ్వరి

    ReplyDelete