14 July 2011

మొదలు/ఇలా

మిణుక్ మిణుక్ మంటూ
ఆ పావురపు కళ్ళు

చూస్తున్నాయి నిన్నే తదేకంగా
బ్ళుక్ బ్ళుక్ శబ్ధాలతో:

గదిలోకి నీ మదిలోకి ఉదయపు
ఆకుపచ్చని లేత కాంతి

నీ అరచేతుల మధ్య ఆవిరిలా
ఊపిరిలా ఒదిగిపోయిన

తన ముఖపు మెత్తటి శాంతి:

రెక్కలు, నింగిని సవాలు చేసే ఆ
రెక్కలు, నువ్వు నిర్భీతిగా

ఎగరగలిగే ఆ రెక్కలు తనవే. తన
తనువే. గూడు

నీ చుట్టూ ఘాడంగా అల్లుకునే
ఆ పూలగూడు తన పాదాలదే

నువ్ రాలిపోకుండా ఆపే
వనలతా వలయం తను. నిన్ను

వెంటాడే చూపుల హారం తను
తన తనువు. నువ్వు.


కొద్దిగా వేచి చూడు.
మెడ కిందుగా తన చేయి
మొహసర్పమై

చుట్టుకుంటుంది.
పావురపు గుండె గుబులుగా
కొట్టుకుంటుంది.

మరెక్కడో కురిసే వర్షాన్ని
మోసుకువచ్చే చల్లటి గాలి
నీ ముఖంలో=

గదంతా పరుచుకున్న
పావురపు రెక్కల సవ్వడిలో
అద్దంలో, నీ ముఖంలో

ఒక పూవు వికసిస్తుంది.

వెళ్ళకు: ప్రేమించేందుకూ
రమించేందుకూ
యిదే సరైన సమయం.

ఇక నీ ఊపిరితో
దినపు దీపాన్ని ఆర్పివేసి

వెచ్చటి వెన్నెలను
వెలిగించు=

No comments:

Post a Comment