12 July 2011

తెలుసు

తెలుసు ఎవరూ రారని

మెరుపులలో చిట్లేదెవరో
ఉరుములతో

పదాలని నింపేదెవరో, అతి
సునిశితంగా

నీ హృదయాన్ని చిత్తడిగా
మార్చేదెవరో

నిన్ను మరుపులోకి నెట్టే
నేరానికి పాల్పడేదెవరో

నీ కుత్తుకపై పదునైన కత్తై
నేమలీకవలె వాలేదెవరో

కన్నీళ్ళలో మునిగిన కళ్ళు
ఎవరివో ఎందరివో

పగుళ్ళిచ్చిన పెదాలు ఎవరివో
జన్మనిచ్చిన పాదాలు ఎవరివో

లాలించే ఒడి ఎవరిదో, అక్కున
చేర్చుకునే కౌగిలి ఎవరిదో

నువ్వు ఎవరో, నువ్వు ఎవరి
వాడివో ఎక్కడి వాడివో

నీ ఆరంభం ఏదో
నీ అంతం ఏదో నీ
పునర్యానం ఏదో

ఎవరికీ తెలుసు?

తెలిసిందీ తెర మరుగు
కానిదీ ఇది:

ఇలాగే చచ్చిపోతాను
ఎవరూ రాని
ఎవరూ లేని పదాలను
రాసుకుంటూ
నన్ను నేనే
శపించుకుంటూ:

రాకండి ఇక్కడికి-

రావిఆకుల రాళ్ళ కింద
సమాధిపై ఒక దీపం

మృతువుతో, ప్రేమంత
కరుణతో మాట్లాడుతోంది:

1 comment: