18 July 2011

నేరుగా ఒక వాచకం

నువ్వొక నిర్మొహ వ్యాపారివి: స్త్రీలెప్పటికీ నీకు వెన్నెల మెరిసే బాకులతో తిరిగే శరీరాలే. ఏం చూసావు నువ్వు ఇంతకాలం? నెత్తురు జల్లు కురిసే వాళ్ళ మాటలలో? ఏం పొందావు నువ్వు ఇంతకాలం, హలాహలం కనిపించని గ్రహణాలు ఏర్పడే వాళ్ళ మనసులలో?

నువ్వొక మోహవ్యసనుడివి, స్త్రీ మోహితుడివి. స్నేహితులెప్పుడూ నీకు అరచేతుల మధ్య దాచుకునే దీపాలే. కావాలనుకున్నప్పుడు వాళ్ళు నువ్వు రెండు వేళ్ళ మధ్యా నులిమివేయగలిగే చిరు మంటలే నీ స్వీయ ధ్వంస లెక్కల్లో నువ్వు కిందా మీదా చేయగలిగే లాభనష్టాల బేరిజులే: ఏం ఆశించావ్ నువ్వు వాళ్ళ నుంచి వాదనల నుంచి? ఎప్పటికీ స్త్రీలు కాలేని స్నేహిత పురుషులనించి? స్త్రీల పురుష స్నేహం నుంచి?

లేదు ఒక చేయి ఎవరి వద్దా మరొకరి కన్నీటిని తాకేందుకు. లేదు ఒక హృదయం ఎవరి వద్దా మరొకరిని పొదివి పుచ్చుకునేందుకు. రాతి గూళ్ళు రాతి కళ్ళు రాతి వక్షోజ యోనుల స్త్రీలు దేవతలవలె, తెల్లటి సితాకొకచిలుకలవలె సమ్మోహితులను చేస్తూ నీ చుట్టూతా ఎగిరే కంకాళాల నగరం ఇది. ఒక శిధిలాలయం ఇది. మరుపే లేని ఒక శ్మశానం ఇది. తాగురా నాయనా తాగు గుండెల నిండా తాగు. హృదయం అంటుకునేదాకా నీకు కావాల్సిన ఆరడుగుల శాంతీ, గూడూ దొరికేదాకా తాగు నాయనా తాగు. రహదారుల్లో, ఇనుప సంకెళ్ళ రొదలలో శబ్ధదాస్యం అయిన లోకంలో నిశ్శబ్దం నిశ్చలంగా నీకు కావాల్సిన రెండు స్త్రీ చేతులయ్యేదాక, లలితమైన నీ తల్లి పాలిండ్లు అయ్యి నిన్ను హత్తుకునేదాకా, నిన్ను నువ్వు మరచిపోయేదాకా నీ నయనాలు తడిచిపోయి ఎండిపోయేదాకా తాగురా నాయనా తాగు ...

ఇక ఈ రాత్రి తెల్లవారదు. ఇక ఈ కధ ఎన్నటికీ అంతం కాదు. దారి పక్కన తెగి పడ్డ పూలు నీడలతో మళ్ళా గాయపడ్డాయి. ఇక నిన్ను ఇంటికి తీసుకువెళ్ళేదెవరు ? 

1 comment: