19 July 2011

రక్తపిపాసి (మరొక పాత వాచకం)

పరిగెత్తుతున్నాయ్ అశ్వాలు మేఘాలవెంట
దౌడు తీస్తూ పచ్చిక మైదానాలలో

ఆ సమయాలలో, గిట్టల ప్రతిధ్వనులతో
విసృంఖలమైన ఆనందంతో నేను నీ వద్దకు
పరిగెత్తుకు వస్తాను

నువ్వు వొదిలివెళ్ళిన పాదముద్రల వెంట, పాదముద్రలలో
నువ్వు వొదిలివెళ్ళిన నీ పరిమళాన్ని
నా గుండెలనిండా ఎగపీలుస్తో, నువ్వు వెళ్ళినవైపు

ఇళ్ళకు వెళ్ళే పక్షులతో, చెట్ల మధ్యగా ఈల వేస్తో
సాగే గాలితో నేను నీవైపు దూసుకువస్తాను.

వెక్కిరింతలాంటి నవ్వుతో నువ్వు వెళ్ళిపోయిన తరువాత
పక్కపై నువ్వు వొదిలివెళ్ళిన మంచులాంటి

నీ ప్రేమ సారాంశాన్ని పెదాలపై అద్దుకుని, నిర్లజ్జగా నీకై
నేను మళ్ళా మళ్ళా దూసుకువస్తాను. హృదయంలో

అసహనంగా కదులాడుతున్న ఆకలిగొన్న పులితో నేను
జనారణ్యంలోకి నీ రక్తాన్ని చవిచూసిన

నా శరీరపు తృష్ణతో, నరమాంస తపనతో వస్తాను. నీపైకి
దుమికి నిన్ను నోట కరుచుకునేందుకు

అదుపు తప్పిన జలపాతంలా నాలోంచి నేను జారిపడి
నిన్ను పూర్తిగా తడిపేందుకు, నేను మళ్ళా మళ్ళా

ఒక రక్తపిపాసిలా, ఒక ప్రేమికుడిలా ఒక బిక్షగాడిలా
వస్తూనే ఉంటాను. మేఘాలు

అశ్వాల వెంట దౌడు తీస్తూ అంతంలేని ఎడారుల్లోకి అంతం
కాని రాత్రుళ్ళలోకి జొరబడుతున్నట్టు

నువ్వు వొదిలివెళ్ళిన నీ చేతివేళ్ళు తాకిన గాలిని
నా చేతివేళ్ళతో ఒడిసిపట్టుకుంటూ

విసృంఖాలమైన ఆనందంతో నేను నీ వద్దకు
పరిగెత్తుకువస్తాను. చూడు:

పురాతన కట్టడంలో పున్నమి నిండిన చీకట్లో

సమాధిలోంచి ఒక నిశాచరుడు జన్మిస్తున్నాడు నీకోసం=

No comments:

Post a Comment