08 July 2011

నీకొక భాష దొరుకుతుంది

నీ రాత్రి కళ్ళలో
మిణుగురులు

కురిసే చినుకులు నీలో
కదిలే ఆకులు నీలో

అలలు, అలలుగా
తెరలుగా గాలి నీలో

నీ ఒళ్లంతా జల్లు. నీకేమో

నువ్వు ఎక్కడ
జారిపోతావోనని
తను ఎక్కడ
మారిపోతుందోనని

నువ్వు ఎక్కడ
మరచిపోతావోనని
తను ఎక్కడ
వొదిలివేస్తుందోనని

ఒకటే దిగులు.
ఒకటే గుబులు.

వర్షం కురిసే వేళ్ళలో

ఆకాశంలోనూ, నీలోనూ
మబ్బులు కమ్ముకోక
పోతే ఎలా?

అందుకే నీ కళ్ళరాత్రిలో
అన్ని నక్షత్రాలు
అన్ని చినుకులు:

నీ చేతివేళ్లను
పెనవేసుకున్న
తన చేతివేళ్ళు

నిను వీడక మునుపే
నువ్వు నిన్ను వీడి

ఒక పదాన్ని తుంపి
తన పెదవిపై ఉంచు:

ఇక నీకొక భాష
దొరుకుతుంది

ఈ పై పదాలు
రాసేందుకు=

No comments:

Post a Comment