హృదయ పాషాణం నుంచి
పాషాణ హృదయంలోకి
ఈ/నీ ప్రయాణం అంత
తెలికేమీ కాదు, కాబోదు=
ఉంటారు వాళ్ళు జారుడు
నాలికలతో, చేజారిన
పదాలతో, నిందించే
పదకోశాలతో, కత్తులతో-
అభిషేకిస్తారు నిన్ను
శిలలతో, శిల్పకలలతో.
రాతి నయనాలు వాళ్ళవి
రాతి వక్షోజాలు వాళ్ళవి
పూల కోసం తిరిగే వాడికి
స్మశానం బహుకరించే
రాతి హృదయ కారుణ్యం
వాళ్ళది, వాళ్ళ పదముద్రలది
నువ్వు వెళ్ళిన దారిలో
నీ పాదముద్రల
అలజడిలో
ఊగుతున్నాయ్
శిలువ వేయబడి
నలుదిశలా చిట్లిన
ఖండిత అంగాలు
ఏరుకోడానికీ ఏమీ లేవు
దాచుకోడానికీ ఏమీ లేవు
వొద్దురా వొద్దు.
కరడు కట్టిన లోకంలో
కన్నీళ్లను రాళ్లగా
మార్చుకోవద్దు.
మనుషులు
మాయమౌతున్న కాలంలో
స్త్రీలను ఆత్మలుగా ఊహించ
వద్దు. వొద్దురా వొద్దు.
ఒక్కడివే ఎదురుచూడు.
ఈ లోగా చీకట్లలోంచి
తన నవ్వు తెల్లని పిల్లై
నీ వైపు ఎలా
పరిగెత్తుకు వస్తుందో
చూడు=
No comments:
Post a Comment